Om Namo Venkatesaya : అన్నమయ్య, రామదాసుకు భిన్నంగా ఉన్న భక్తి సినిమా... కారణమేంటో తెలుసా?

అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఓం నమో వేంకటేశాయ ప్రత్యేకత ఏమిటి? హాథీరామ్ బావాజీ కథ, వైరాగ్య కోణం, కథనంలోని లోపాలు, సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోవడానికి కారణాలను తెలుసుకుందాం.

Balachander
Published on: 8 Sept 2026 12:40 PM IST
Om Namo Venkatesaya : అన్నమయ్య, రామదాసుకు భిన్నంగా ఉన్న భక్తి సినిమా... కారణమేంటో తెలుసా?
X

Om Namo Venkatesaya : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేవి 'అన్నమయ్య', 'శ్రీరామదాసు'. అయితే వీరిద్దరి కలయికలో వచ్చిన మూడోవ భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' మాత్రం ఆ రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన కథనంతో రూపొందింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హాథీరామ్ బావాజీ జీవిత విశేషాలు, చరిత్రలో సరిగ్గా లభించకపోవడంతో స్వంత కథనంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, మునుపటి సినిమాల కంటే భిన్నమైన వైరాగ్య కోణాన్ని ఆవిష్కరించింది.

అన్నమయ్య, రామదాసులకు భిన్నమైన కథనం

సాధారణ భక్తి సినిమాల్లో భక్తుడి ప్రయాణం ఒకేలా సాగుతుంది. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' చిత్రాలలో కథానాయకులు మొదట కుటుంబం, ఆస్తిపాస్తులు, భోగభాగ్యాలతో ఉంటారు. భక్తి మార్గంలోకి వచ్చాక దేవుడు పెట్టే పరీక్షల వల్ల ఒక్కటిగా అన్నింటినీ కోల్పోతారు. చివరకు తీవ్రమైన కష్టాలు అనుభవించి వైరాగ్యంతో స్వామివారిలో ఐక్యం అవుతారు. కానీ, 'ఓం నమో వేంకటేశాయ'లో హాథీరామ్ బావాజీ ప్రయాణం ఇందుకు పూర్తిగా భిన్నం. కథ ప్రారంభంలోనే అతడు అన్నింటినీ త్యజించిన వ్యక్తిగా కనిపిస్తాడు. తిరుమల చేరుకున్న అనతికాలంలోనే స్వామివారి సాక్షాత్కారం లభించడం, దేవుడే స్వయంగా వచ్చి ప్రతిరోజూ అతనితో పాచికలు ఆడటం జరుగుతుంది.

మితిమీరిన దైవానుగ్రహం ... సరికొత్త పరీక్ష

హాథీరామ్ బావాజీ భక్తికి మెచ్చి, భక్తులందరూ ముందు బావాజీని దర్శించుకున్నాకే తనను దర్శించుకోవాలని స్వామివారే శాసిస్తారు. జనాలు తండోపతండాలుగా వచ్చి తన కాళ్లపై పడటం, పూజించడం బావాజీకి తీవ్రమైన ఇబ్బందిగా మారుతుంది. కేవలం స్వామి సేవను మాత్రమే కోరుకున్న భక్తుడికి, ఈ అధికమైన గౌరవ మర్యాదలే ఒక పెద్ద భారం అవుతాయి. ఈ విపరీతమైన ఆరాధనను తట్టుకోలేక కొండ వదిలి వెళ్లాలనుకున్న బావాజీని స్వామివారే ప్రాధేయపడి ఆపుతారు. దీంతో స్వయంగా స్వామివారి చేతుల మీదుగానే సజీవ సమాధి కావాలనే అత్యంత వినూత్నమైన షరతును బావాజీ విధిస్తాడు.

బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోవడానికి కారణాలు

కథనంలో కొత్త కోణం ఉన్నప్పటికీ, ఈ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. చరిత్రలో లేని 'కృష్ణమ్మ' అనే పాత్రను సృష్టించినప్పటికీ, దానికి సరైన ముగింపు ఇవ్వకపోవడం ప్రతికూలంగా మారింది. అంతేకాదు, దర్శకేంద్రుడి మార్కు పాటలు, శృంగార సన్నివేశాలను ఇరికించడం కథనంలోని గాంభీర్యాన్ని దెబ్బతీసింది. అన్నీ కోల్పోవడం ఎలాగో, కోరుకోనివన్నీ దేవుడే ఇవ్వడం కూడా ఒక పరీక్షే అనే ప్రధానాంశాన్ని మరింత బలంగా చూపించలేకపోవడం వల్ల ఈ వినూత్న ప్రయత్నం సాధారణ చిత్రంగా మిగిలిపోయింది. భిన్నంగా తీసుకున్న కథను మరింత భిన్నంగా చూపించినట్టైతే అన్నమయ్య, రామదాసులా ఆదరణ లభించేది. కానీ, బావాజీ గురించిన సరైన సమాచారం లేకపోవడంతో కథ బలహీనంగా మారింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story