Omamkuchi Narasimhan: ఆయన్ను చూడగానే ఎవ్వరైనా ఇట్టే నవ్వేస్తారు

ఓమకుచ్చి నరసింహన్‌ తన ప్రత్యేకమైన రూపం, కీచు గొంతు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను నవ్వించిన విలక్షణ హాస్యనటుడు. 14 భాషల్లో 1500కు పైగా సినిమాల్లో నటించిన ఆయన సినీ ప్రయాణం గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 21 Sept 2026 11:38 AM IST
Omamkuchi Narasimhan: ఆయన్ను చూడగానే ఎవ్వరైనా ఇట్టే నవ్వేస్తారు
X

Omamkuchi Narasimhan: కొంతమంది నటులు తెరపైకి రాగానే నవ్వించడానికి పెద్దగా డైలాగులు అవసరం ఉండదు. వారి రూపం, నడక, చూపు, హావభావాలు చాలు. అలాంటి అరుదైన నటుల్లో ఓమకుచ్చి నరసింహన్ ఒకరు. బక్కపలచటి శరీరం, ప్రత్యేకమైన హెయిర్‌స్టైల్, కీచు గొంతు, విచిత్రమైన ముఖకవళికలు, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ కలిస్తే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చే ఓమకుచ్చి రూపమే కనిపిస్తుంది. ఆయన అసలు పేరు నరసింహన్. 1936లో తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. 1953లో వచ్చిన ‘అవ్వైయార్’ చిత్రంతో బాలనటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. అయితే చదువుపై దృష్టి పెట్టేందుకు కొంతకాలం నటనకు దూరమయ్యారు. చదువు పూర్తయ్యాక ఎల్ఐసీలో ఉద్యోగం చేశారు. కానీ నటనపై ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు. చివరకు నాటక రంగం ద్వారా మళ్లీ కళారంగంలోకి వచ్చి, అక్కడి నుంచి వెండితెరపై తనదైన ముద్ర వేశారు.

‘ఓమకుచ్చి’ పేరు ఎలా వచ్చింది?

నరసింహన్‌కు ఓమకుచ్చి అనే పేరు సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెట్టింది కాదు. దాని వెనుక నాటక రంగానికి సంబంధించిన కథ ఉంది. థిల్లైరాజన్ నాటక బృందంలో పనిచేస్తున్న సమయంలో ఆయన ‘ఓమకుచ్చి’ అనే పేరున్న కరాటే మాస్టర్ పాత్ర పోషించారు. ఆ పాత్ర పేరు క్రమంగా ఆయనకే గుర్తింపుగా మారిపోయింది. అదే నాటక బృందంలో ఉన్న సమయంలో యువకుడిగా ఉన్న శంకర్‌తో కూడా ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత దర్శకుడిగా శంకర్ ఎదిగినప్పటికీ.. నరసింహన్‌తో ఆయనకున్న పరిచయం కొనసాగింది. శంకర్ దర్శకత్వం వహించిన ‘జెంటిల్‌మన్’, ‘ముదల్వన్’ వంటి చిత్రాల్లో ఓమకుచ్చి కనిపించడం కూడా ఈ అనుబంధానికి మరో గుర్తుగా చెప్పుకోవచ్చు.

చిన్న పాత్ర.. పెద్ద గుర్తింపు

ఓమకుచ్చి నరసింహన్‌కు తెలుగులో పెద్ద పెద్ద పాత్రలు దక్కలేదు. చాలా సినిమాల్లో ఒకటి రెండు సన్నివేశాలకే పరిమితమయ్యారు. కానీ తెరపై కనిపించిన ఆ కొద్దిసేపే ప్రేక్షకులను నవ్వించడానికి సరిపోయేది. తెలుగులో ఆయనను ‘జుట్టు నరసింహం’ పేరుతో కూడా పరిచయం చేశారు. 1985లో వచ్చిన ‘మా పల్లెలో గోపాలుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ‘మన్నెంలో మొనగాడు’, ‘పసుపుతాడు’, ‘కాశ్మోరా’, ‘ముద్దుల కృష్ణయ్య’, ‘చిన్నారి దేవత’, ‘జీవన జ్యోతి’, ‘యముడికి మొగుడు’, ‘మురళీకృష్ణుడు’, ‘ముద్దుల మావయ్య’, ‘బాల గోపాలుడు’, ‘పవిత్ర బంధం’, ‘దేవి’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ‘ముద్దుల మావయ్య’లో బట్లర్ గజకర్ణగా, ‘బాల గోపాలుడు’లో శవంగా కనిపించే చిన్న పాత్రలో కూడా ఆయన చేసిన నటన ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి పాత్రలే ఆయన ప్రత్యేకతను చెబుతాయి. డైలాగ్ చిన్నదైనా.. పాత్ర కనిపించే విధానం మాత్రం గుర్తుండిపోయేది.

1500కు పైగా సినిమాలు

తమిళ చిత్ర పరిశ్రమలో ఓమకుచ్చికి మరింత విస్తృతమైన అవకాశాలు వచ్చాయి. గౌండమణి, వివేక్, వడివేలు వంటి ప్రముఖ హాస్యనటులతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. 14 భారతీయ భాషల్లో 1500కు పైగా చిత్రాల్లో నటించడం ఆయన కెరీర్‌లోనే విశేషమైన విషయం. ‘జెంటిల్‌మన్’, ‘ముదల్వన్’ వంటి శంకర్ చిత్రాల్లోనూ ఆయన కనిపించారు. ముఖ్యంగా ‘ముదల్వన్’లో రాజకీయ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో ఆయన హావభావాలు పెద్దగా మాటలు లేకుండానే నవ్వు తెప్పిస్తాయి.

ఓమకుచ్చి నరసింహన్ నటనలో అసలు బలం డైలాగుల్లో కాదు.. బాడీ లాంగ్వేజ్‌లోనే ఉండేది. తెరపైకి వచ్చి ఒక్కసారి చూసినా ప్రేక్షకుడి దృష్టిని తనవైపు తిప్పుకునేవారు. ముఖకవళిక మార్చినా, నడక మార్చినా, గొంతు వినిపించినా.. ఆయన ఎవరో ప్రేక్షకులకు అర్థమైపోయేది. చివరి దశలోనూ నటన కొనసాగించిన ఆయన 2006లో వచ్చిన ‘తలైనగరం’ చిత్రంలో కనిపించారు. 2009 మార్చి 12న, 73 ఏళ్ల వయసులో కన్నుమూశారు. పాత్ర ఎంత చిన్నదైనా దానికి తనదైన ముద్ర వేయడం.. అదే ఓమకుచ్చి నరసింహన్ ప్రత్యేకత. అందుకే ఆయన పేరు ప్రతి ఒక్కరికీ వెంటనే గుర్తుకురాకపోయినా.. తెరపై కనిపించగానే నవ్వు తెప్పించే ఆ విలక్షణమైన రూపం మాత్రం ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోయింది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.