Paidi Jairaj: తొలి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌...తెలుగువాడేనని మీకు తెలుసా?

బాలీవుడ్‌లో తొలి స్టార్‌ హీరో ఎవరు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. తొలి స్టార్‌ హీరోగా గుర్తించబడింది మన తెలుగువాడే. ఆయనే పేరు పైడి జైరాజ్‌.

Balachander
Published on: 5 Aug 2026 10:57 AM IST
Paidi Jairaj: తొలి బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌...తెలుగువాడేనని మీకు తెలుసా?
X

Paidi Jairaj: భారతీయ చలనచిత్ర రంగాన 'సూపర్ స్టార్', 'యాక్షన్ హీరో', 'పాన్ ఇండియా స్టార్' అనే పదాలు ఈనాటివి కావు. ఎన్టీఆర్, కాంతారావు వంటి హేమాహేమీలు తెరకు రాకముందే, కత్తిసాములు, గుర్రపు స్వారీలు చేస్తూ బాలీవుడ్‌ను శాసించిన తొలి ఇండియన్ యాక్షన్ హీరో మన తెలుగువాడే. ఆయనే కరీంనగర్ మట్టిలో పుట్టి, ముంబై వెండితెరపై తెలంగాణ జెండా పాతిన పైడి జైరాజ్.

హైదరాబాద్ నుంచి బొంబాయికి... సాహస ప్రయాణం

28 సెప్టెంబర్ 1909న సిరిసిల్లలో జన్మించిన జైరాజ్, హైదరాబాద్ నిజాం కాలేజీలో బీఎస్సీ చదువుతూ నాటకాల వైపు ఆకర్షితులయ్యారు. సరోజిని నాయుడు భర్త గోవిందరాజుల నాయుడి వద్ద ప్రోత్సాహం పొంది, కష్టాలెన్నో అనుభవిస్తూ బొంబాయి చేరుకున్నారు. యంగ్ ఇండియా పిక్చర్స్ సంస్థలో నెలకు మూడు రూపాయల జీతానికి పనిచేస్తూ లైట్‌బాయ్‌గా, అసిస్టెంట్ కెమెరామెన్‌గా, డూప్‌గా చిన్నా చితకా పనులు చేశారు. అయితే, 1929లో 'స్టార్ క్లింగ్ యూత్' అనే సైలెంట్ సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం, 'షికారి', 'జగమత్ జవాని' చిత్రాలతో టాకీ యుగంలోకి అడుగుపెట్టింది.

చారిత్రక పాత్రలు ... దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం

అలా మొదలైన ఆయన ప్రయాణం... ఆ తరువాత చారిత్రాత్మక చిత్రాలవైపు మరలింది. రాణా ప్రతాప్, పృథ్విరాజ్ చౌహాన్, టిప్పు సుల్తాన్ వంటి ఏ చారిత్రక పాత్రలైనా జైరాజ్‌కే దక్కేవి. భారతదేశపు తొలి భగత్ సింగ్ చిత్రం "షహీద్-ఏ-ఆజాం- భగత్ సింగ్"లో ఆయనే కథానాయకుడు. ఇలా ఆయన సుమారు 300 సినిమాల్లో నటించగా, అందులో 150 చిత్రాల్లో హీరోగా అలరించారు. దేవికారాణి, మధుబాల, నర్గీస్, మీనాకుమారి వంటి దిగ్గజ నటీమణులందరి సరసన నటించారు. అంతేకాదు, రష్యన్ చిత్రం 'పరదేశీ', హాలీవుడ్ సినిమాలు 'మాయ', 'నైన్ అవర్స్ టు రామా'లలో నటించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో భారతీయ సినిమాకు చేసిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు 1980లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. అంతేకాదు, బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ కూడా జైరాజ్‌కు వీరాభిమాని కావడం గమనార్హం. 11 ఆగస్టు 2000న కన్నుమూసిన జైరాజ్ జ్ఞాపకార్థం హైదరాబాద్ రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌కు ఆయన పేరు పెట్టారు. ఆరు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన ఈ తొలి తెలుగు సూపర్ స్టార్ ప్రస్థానం భారత సినీ చరిత్రలో సదా చిరస్మరణీయం. ఇలాంటి వారికి గుర్తుచేసుకోవడం మన ధర్మం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story