Pawan Kalyan Birthday: వెండితెర ‘పవర్ స్టార్’ నుంచి డిప్యూటీ సీఎంగా ప్రభంజనం..!

Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

Gagan kumar
Published on: 2 Sept 2026 7:25 AM IST
Pawan Kalyan Birthday
X

Pawan Kalyan Birthday: వెండితెర ‘పవర్ స్టార్’ నుంచి డిప్యూటీ సీఎంగా ప్రభంజనం..!

Pawan Kalyan Birthday: పవర్‌ఫుల్ నటుడిగా తెరపై అశేష జనవాహినిని అలరించడం ఒకెత్తయితే... అదే జనాన్ని తన సిద్ధాంతాలతో చైతన్యపరచి, ప్రజామోదం పొందిన నాయకుడిగా నిలవడం మరొక ఎత్తు. ఈ రెండు భిన్నమైన రంగాల్లోనూ తనదైన ముద్ర వేసి, కోట్లమంది గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అరుదైన వ్యక్తిత్వం పవన్ కల్యాణ్. ఆయన జన్మదినం సందర్భంగా, ఒక నటుడిగా, ప్రజా నాయకుడిగా ఆయన సాగించిన ప్రస్థానం, సాధించిన విజయాలపై స్పెషల్ స్టోరీ మీ కోసం.

తెలుగు చిత్రసీమలోకి ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో అడుగుపెట్టిన పవన్ కల్యాణ్, స్వల్పకాలంలోనే యూత్ ఐకాన్‌గా మారారు. కేవలం నటనకే పరిమితం కాకుండా మార్షల్ ఆర్ట్స్, డాన్స్, ఫైట్స్, మేనరిజమ్‌ లతో తనకంటూ ఒక సొంత ‘స్టైల్ స్టేట్‌మెంట్’ను సృష్టించుకున్నారు. 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' చిత్రాలతో పవన్ సాధించిన విజయాలు తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయి. ముఖ్యంగా ‘తొలిప్రేమ’ నేషనల్ అవార్డును గెలుచుకోగా, ‘ఖుషి’ చిత్రం ఆయన క్రేజ్‌ను శిఖరాగ్రానికి చేర్చింది.

కొన్నేళ్ల విరామం తర్వాత వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత 'అత్తారింటికి దారేది', 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలతో తన మాస్ పవర్ ఇంకా తగ్గలేదని నిరూపించారు. కేవలం నటుడిగానే కాక ‘సత్యాగ్రహి’ వంటి ప్రయోగత్మక ఆలోచనలతో, స్వయంగా మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రఫీ చేస్తూ సినిమాల్లో సరికొత్త ట్రెండ్స్‌కి శ్రీకారం చుట్టారు.

సినిమాల్లో అగ్రకథానాయకుడిగా కొనసాగుతున్న సమయంలోనే, సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఆయన రాజకీయ అడుగులు వేశారు. 2014 మార్చి 14న ‘జనసేన’ పార్టీని స్థాపించి, తక్షణ అధికార లబ్ధి కంటే సిద్ధాంతాలకే ప్రాధాన్యమిచ్చారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లడం నుంచి, కౌలు రైతుల కుటుంబాలను ఆదుకోవడం, సుగాలి ప్రీతి కేసుకు న్యాయం పోరాటం చేయడం వరకు... ప్రతి అంశంలోనూ ప్రజల పక్షాన నిలబడ్డారు.

క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన చేపట్టిన ‘వారాహి యాత్ర’ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద మార్పునకు నాంది పలికింది. రాజకీయాల్లో అసాధారణమైన ఘట్టం 2024 అసెంబ్లీ ఎన్నికలు. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 21, అలాగే 2 పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించి 100% సక్సెస్ రేట్‌తో చరిత్ర సృష్టించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు & పర్యావరణ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గ్రామ స్వరాజ్యం, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story