Pokiri: మహేష్‌బాబుకు బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన రవితేజ పోకిరి

2006లో వచ్చిన పోకిరి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని పోకిరికి ముందు పోకిరి తరువాతగా విభజించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పక్కర్లేదు.

Balachander
Published on: 29 April 2026 1:36 PM IST
Pokiri: మహేష్‌బాబుకు బ్లాక్‌బస్టర్‌ ఇచ్చిన రవితేజ పోకిరి
X

Pokiri: 2006లో వచ్చిన పోకిరి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని పోకిరికి ముందు పోకిరి తరువాతగా విభజించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. మహేష్‌బాబు కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాగా దీనిని చెబుతారు. ఈ సినిమా కథ వెనుక ఓ ఆసక్తికరమైన నిజం ఉంది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ సినిమా కథను రాసుకుంది మహేష్‌బాబు కోసం కాదు. మాస్‌ మహారాజాగా పేరొందిన రవితేజ కోసం. మరి రవితేజ ఈ సినిమాను ఎందుకు మిస్‌ చేసుకున్నాడు.

రవితేజ వదులుకున్న 'పోకిరి'.. మహేష్‌కు ఇండస్ట్రీ హిట్!

దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు హీరో రవితేజ మధ్య మంచి అనుబంధం ఉంది. రవితేజతో పలు విజయవంతమైన చిత్రాలను తీశాడు పూరి. అయితే, రవితేజ కోసం పూరి పోకిరి సినిమాను కథను సిద్దం చేసుకున్నాడు. రవితేజకు కథను వినిపించిన తరువాత...రవితేజ బిజీగా మారిపోవడంతో ఆ కథలో కొన్ని మార్పులు చేసి మహేష్‌బాబుకు వినిపించాడు. కథ విన్న మహేష్‌బాబు చాలా ఎగ్జైట్‌ అయ్యి వెంటనే ఓకే చేశారట. ఇక ఈ సినిమా కథకు మొదట పూరీ అనుకున్న టైటిల్స్‌ ఏంటో తెలుసా ఉత్తమ్‌ సింగ్‌, సన్నాఫ్‌ సూర్య. కానీ, మహేష్‌బాబుకు అనుగుణంగా మార్పులు చేసిన తరువాత కథకు తగ్గట్టుగా మూడు అక్షరాల సెంటిమెంట్‌తో పోకిరి అనే టైటిల్‌ను పెట్టుకున్నాడు.

రికార్డుల వేట -12 కోట్లతో మొదలై 40 కోట్లకు..

పోకిరి సినిమా కోసం నిర్మాతలు కేవలం 12 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. తక్కువ రోజుల్లో సినిమా షూటింగ్‌ పూర్తయింది. సినిమా రిలీజ్‌ అయ్యాక..ఈ సినిమా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఏకంగా ఈ సినిమా రూ. 40 కోట్లకు పైగా షేర్‌ను సాధించినట్టు ట్రేడ్‌ వర్గాలు తెలియజేశాయి. అంటే ఈ సినిమా ద్వారా నిర్మాతలకు రూ. 40 కోట్లు లాభం వచ్చిందన్నమాట. 2006లో రూ. 40 కోట్లు షేర్‌ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమా 200 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి సినిమాగా రికార్డుకెక్కింది. అంతేకాదు, 15 కేంద్రాల్లో 200 రోజులు ఆడింది. ఇలియానాకు ఈ సినిమా ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టగా, ప్రకాష్‌రాజ్‌ అలీభాయ్‌ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

పండుగాడు.. ఒక ట్రెండ్ సెట్టర్!

సినిమా అంతా ఒకెత్తైతే మహేష్‌బాబు మేనరిజం ఒకెత్తు. డైలాగ్‌ డెలివరీ ఒక కొత్త ట్రెండ్‌కు ప్రాణం పోశాయి. "ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా!", "ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను" వంటి డైలాగులు నేటికీ కుర్రకారు నోళ్లలో నానుతూనే ఉన్నాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అప్పట్లో థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల నుంచి లేచి డ్యాన్స్ చేసేలా చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోకిరి క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఇప్పటికీ ఓ ట్విస్టేనని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ రవితేజ ఈ సినిమా చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టమే కానీ, మహేష్ బాబును మాత్రం ఈ సినిమా 'ప్రిన్స్' నుంచి 'సూపర్ స్టార్' రేంజ్‌కు తీసుకెళ్లిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాతోనే మహేష్‌బాబు మాస్‌ హీరోగా అవతరించాడనడంలో సందేహం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story