Ramayana: మీ క్రియేటివిటీకి ఓ దండం రా దూత.. వివాదంలో రామాయణ మూవీ

ఇటీవల విడుదలైన రామాయణ సినిమాపై వివాదం రాజుకుంది. వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీపై ముంబై పోలీసులకు ఫిర్యాదు అందింది.

CR Reddy
Published on: 24 Nov 2026 8:27 AM IST
Ramayana
X

Ramayana

Ramayana: ఇటీవల విడుదలైన రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ చిత్రం చుట్టూ వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అసలు వాల్మీకి రామాయణాన్ని ఘోరంగా వక్రీకరించి, కోట్లాది మంది హిందువుల మత విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తూ హిందూ జనజాగృతి సమితి ప్రతినిధి శతీశ్ కోచరేకర్ చట్టపరమైన చర్యలకు దిగారు. ముంబైలోని ములుంద్ (వెస్ట్) పోలీస్ స్టేషన్‌లో సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీపై ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు.

శ్రీరాముడిని తక్కువ చేశారని ఆరోపణ

రామాయణం అంటే కేవలం వినోదానికి సంబంధించిన విషయం కాదని, అది కోట్లాది మంది హిందువుల భక్తికి, జీవన విలువలకు పునాది అని హిందూ జనజాగృతి సమితి స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ సినిమాలో క్రూరుడైన రావణుడిని పేదలకు బంగారు ఇళ్లు ఇచ్చేవాడిగా, అణగారిన వర్గాల రక్షకుడిగా, మహిళల గౌరవాన్ని కాపాడేవాడిగా చూపిస్తూ అనవసరంగా కీర్తించారని ఆరోపించింది. అందుకు విరుద్ధంగా, తాటకి, ఖర-దూషణుల రాక్షస సైన్యం ముందు ఆయుధాలు ధరించిన శ్రీరాముడు, లక్ష్మణుడు భయపడి వెనక్కి తగ్గి పారిపోతున్నట్లు చూపించారని, అదే సమయంలో నిరాయుధుడైన రావణుడు మాత్రం ఒంటరిగా భారీ సైన్యంతో నిర్భయంగా పోరాడినట్లు చిత్రీకరించారని మండిపడింది.

కల్పిత సన్నివేశాలపై భగ్గుమంటున్న భక్తులు

సినిమాలో చేర్చిన మరికొన్ని కల్పిత సన్నివేశాలపైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శూర్పణఖ ముక్కు కోసిన విషయంలో సీతాదేవి లక్ష్మణుడిని ఉద్దేశించి "ఏ స్త్రీ రూపాన్ని వికృతం చేసే హక్కు నీకు లేదు" అంటూ మందలించినట్లు చూపించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా శ్రీరాముడు ఖర-దూషణులనే రాక్షసులను క్షమాపణ కోరినట్లు అభ్యంతరకరమైన కల్పిత సన్నివేశాలు పెట్టారని కోచరేకర్ ఆరోపించారు. త్యాగానికి, నిష్ఠకు ప్రతీక అయిన లక్ష్మణుడిని పొగరుబోతుగా, గురువులను ఎగతాళి చేసే వ్యక్తిగా చూపిస్తూ పూజనీయమైన పాత్రల విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్

ములుంద్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో భారతీయ న్యాయ సంహిత(BNS), 2023లోని సెక్షన్ 299 (ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను దెబ్బతీయడం), సెక్షన్ 196 (మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టడం) కింద లోతైన విచారణ జరిపి కేసు నమోదు చేయాలని కోరారు. నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితీశ్ తివారీతో పాటు ఇందుకు బాధ్యులైన వారందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్క్రిప్ట్, డైలాగులు స్వాధీనం చేసుకోవాలి

దర్యాప్తులో భాగంగా సినిమా పూర్తి అధికారిక కాపీని, స్క్రిప్ట్, డైలాగుల ప్రతి, సబ్‌టైటిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవాలని, అభ్యంతరకరమైన ప్రతి సన్నివేశం టైమ్‌స్టాంప్‌ను సాక్ష్యంగా భద్రపరచాలని సమితి కోరింది. అసలు గ్రంథానికి, సినిమాలో చేసిన మార్పులకు మధ్య తేడాలను గుర్తించేందుకు వాల్మీకి రామాయణ పండితులు, సంస్కృత నిపుణులు, ధర్మశాస్త్ర వేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది. కళాత్మక స్వేచ్ఛ పేరుతో పూజనీయ పాత్రలను అవమానించడాన్ని హిందూ సమాజం సహించదని, పోలీసులు తక్షణమే స్పందించి నిష్పక్షపాత విచారణ జరపకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా తీవ్ర ఉద్యమం చేస్తామని హెచ్చరించింది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.