Prakash Raj: ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు..మోదీపై నిప్పులు!
Prakash Raj: బెంగళూరులో తన ఓటు హక్కు తొలగింపుపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Prakash Raj: ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు..మోదీపై నిప్పులు!
Prakash Raj Vote Deleted: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ మరోసారి తన విమర్శలతో రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. ఒకవైపు తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును తొలగించడంపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై మండిపడగా.. మరోవైపు ఝార్ఖండ్‌లో ఉద్యోగ అభ్యర్థులపై పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండించారు. ఈ రెండు విభిన్న ఘటనలపై ఆయన స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటికే నాలుగు ఓట్లు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో బెంగళూరులోని ప్రకాష్ రాజ్ ఓటును ఎన్నికల సంఘం తొలగించింది. సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం బెంగళూరు నియోజకవర్గంలో దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని, అందులో తన పేరు కూడా ఉందంటూ ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాను అక్కడే పుట్టి, పెరిగి, విద్యాభ్యాసంతో పాటు థియేటర్ ప్రయాణం కూడా అక్కడే సాగించానని ఆయన గుర్తుచేశారు. అదే నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తన ఓటు హక్కును ఇప్పుడు తొలగించడం అత్యంత విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా ఓట్లు తొలగించి మమ్మల్ని మీరు ఆపగలుగుతారని అనుకుంటున్నారా? అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని అధికారం నుంచి దించడాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. మరోవైపు, ఝార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ సమీపంలో నిరసన తెలుపుతున్న JPSC-JSSC అభ్యర్థులపై పోలీసులు టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ప్రయోగించడాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు.
JSSC-CGL పోటీ పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, నియామక ప్రక్రియలో సంస్కరణలు, పారదర్శకత తీసుకురావాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. JPSC-JSSC రిఫార్మ్ మంచ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి అసెంబ్లీ దిగ్బంధనానికి పూనుకోగా, పోలీసులు నీటి ఫిరంగులు, లాఠీలతో వారిని అడ్డుకున్నారు.
ఈ నిరసన ప్రాంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఆయన... ఈ రకమైన క్రూరత్వం ఇకపై చెల్లదని, ఇది అహంకార పూరిత అధికార పతనానికి దారితీస్తుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.




