Bandla Ganesh: బకాయిలు చెల్లించినా వేలం వేశారు.. సుప్రీం మెట్లెక్కిన బండ్ల గణేశ్!

Bandla Ganesh: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఆస్తి వేలం వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Arun Chilukuri
Published on: 15 July 2026 2:35 PM IST
Bandla Ganesh
X

Bandla Ganesh: బకాయిలు చెల్లించినా వేలం వేశారు.. సుప్రీం మెట్లెక్కిన బండ్ల గణేశ్!

Bandla Ganesh: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఆస్తి వేలం వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లోన్ వ్యవహారంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బకాయిలన్నీ తీరిపోయిన తర్వాత కూడా బ్యాంక్ తన ఆస్తులను వేలం వేసిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్ శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యూనియన్ బ్యాంక్ అందించిన రుణాలకు బండ్ల గణేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గ్యారెంటర్లుగా ఉంటూ, తమ సొంత ఆస్తులను పూచీకత్తుగా తాకట్టు పెట్టారు. అయితే, కంపెనీ దివాలా పరిష్కార ప్రక్రియ సమయంలో తనఖా పెట్టిన ఆస్తిని బ్యాంక్‌ వేలం వేసింది.

కానీ, వన్ టైమ్ సెటిల్‌మెంట్ (OTS) కింద ఇప్పటికే రూ.71.44 కోట్లతో కలిపి సుమారు రూ.129.02 కోట్లను బ్యాంక్ తమ నుంచి వసూలు చేసిందని బండ్ల గణేశ్ కోర్టుకు తెలిపారు. అసలు, వడ్డీతో కలిపి బకాయిలన్నీ చెల్లించిన తర్వాత కూడా ఆస్తులను వేలం వేయడం సరికాదని ఆయన పిటిషన్‌లో స్పష్టం చేశారు.

గతంలో ఈ వేలం ప్రక్రియను సవాలు చేస్తూ బండ్ల గణేశ్ రుణ వసూళ్ల ట్రైబ్యునల్‌ను (DRT) ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన డీఆర్‌టీ.. బ్యాంక్ జరిపిన వేలం ప్రక్రియను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. స్వాధీనం చేసుకున్న ఆస్తిని తిరిగి అసలు యజమానులైన బండ్ల కుటుంబానికి అప్పగించాలని ఆదేశించింది. అలాగే వేలంలో ఆస్తిని కొనుగోలు చేసిన వ్యక్తికి సొమ్మును వడ్డీతో సహా వాపసు చేయాలని బ్యాంకును ఆదేశించింది.

అయితే, డీఆర్‌టీ తీర్పును సవాలు చేస్తూ యూనియన్ బ్యాంక్ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు డీఆర్‌టీ ఉత్తర్వులను కొట్టివేస్తూ, బ్యాంక్ చర్యలను సమర్థించింది. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తాజాగా బండ్ల గణేశ్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story