Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో ఏం జరిగింది.? సంచలన విషయాలు వెల్లడించిన డాక్టర్
Puneeth Rajkumar: కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి ఐదేళ్లు కావస్తోంది.
Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాల్లో ఏం జరిగింది.? సంచలన విషయాలు వెల్లడించిన డాక్టర్
Puneeth Rajkumar: కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణించి ఐదేళ్లు కావస్తోంది. ఆయన మరణం ఇప్పటికీ అభిమానులను కలచివేస్తూనే ఉంది. తాజాగా పునీత్‌కు చికిత్స అందించిన డాక్టర్ రమణరావు, ఆయన చివరి క్షణాలకు సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేసిన పునీత్
పునీత్ రాజ్‌కుమార్ 2021 అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండె ఆగిపోవడంతో మరణించారు. ఆయనను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ వైద్యులు ప్రాణాలను కాపాడలేకపోయారు. తాజాగా జస్ట్ క్యూరియస్ అనే కన్నడ టాక్ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ రమణరావు ఆ రోజు జరిగిన విషయాలను గుర్తుచేసుకున్నారు. పునీత్ జిమ్‌లో సుమారు గంటన్నర పాటు కిక్‌బాక్సింగ్ చేసి తన క్లినిక్‌కు వచ్చారని చెప్పారు. ఆ రోజు ఆయన మొదటిసారిగా కిక్‌బాక్సింగ్ ప్రయత్నించారని, వ్యాయామం తర్వాత చాలా అలసిపోయి కనిపించారని వివరించారు. క్లినిక్‌కు వచ్చిన సమయంలో పునీత్ విపరీతంగా చెమటలు పడుతూ ఉన్నారని డాక్టర్ తెలిపారు. సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత చెమటలు పట్టడం సహజమే అయినప్పటికీ, పునీత్ పరిస్థితిని చూసి ఏదో సమస్య ఉందని అనుమానం వచ్చిందన్నారు. దీంతో వెంటనే ఈసీజీ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు.
ఈసీజీలో గుండెపై ఒత్తిడి ఉన్నట్లు గుర్తింపు
పునీత్‌కు నిర్వహించిన ఈసీజీ పరీక్షలో గుండెపై ఒత్తిడి పడుతున్నట్లు కనిపించిందని డాక్టర్ రమణరావు వెల్లడించారు. ఆయన పరిస్థితిని గమనించిన వెంటనే మందులు ఇచ్చి, ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆ సమయంలో పునీత్‌కు గుండెపోటు రాలేదని, గుండెపై ఒత్తిడి కనిపించిందని డాక్టర్ వివరించారు. ఆయన పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని భావించి వెంటనే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పునీత్ తన సొంత కారులోనే ఆసుపత్రికి బయలుదేరారని, ఆ సమయంలో ఆయన మాట్లాడగలుగుతున్నారని డాక్టర్ గుర్తుచేసుకున్నారు. కారులో నిటారుగా కూర్చోవాలని పునీత్ ప్రయత్నించగా, తల భార్య అశ్విని ఒడిలో పెట్టుకుని విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. డ్రైవర్‌ను వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరినట్లు చెప్పారు.
ఆసుపత్రికి చేరుకోవడానికి నిమిషం ముందే గుండె ఆగిపోయింది
పునీత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలోనూ ఆయన స్పృహలోనే ఉన్నారని, చుట్టూ ఉన్నవారితో మాట్లాడరని డాక్టర్ రమణరావు తెలిపారు. అయితే ఆసుపత్రికి చేరుకోవడానికి నిమిషం ముందు ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని చెప్పుకొచ్చారు. ఆసుపత్రిలోకి తీసుకెళ్లే సమయానికి గుండె కొట్టుకోవడం లేదని, వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించారని చెప్పారు. పునీత్‌ను బతికించేందుకు వైద్య బృందం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదన్నారు. ఈ ఘటన తన జీవితంలో అత్యంత బాధాకరమైన సందర్భాల్లో ఒకటని డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. పునీత్ తనకు కేవలం ఒక పేషెంట్ మాత్రమే కాదని, సొంత కొడుకులాంటి వ్యక్తి అని భావోద్వేగానికి గురయ్యారు.
కొడుకులాంటి వ్యక్తిని కోల్పోయా.. డాక్టర్ భావోద్వేగం
పునీత్ రాజ్‌కుమార్‌తో తనకు ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉందని డాక్టర్ రమణరావు తెలిపారు. పునీత్ తన రెండో కుమారుడికి మంచి స్నేహితుడని, చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి ఆడుకునేవారని గుర్తుచేసుకున్నారు. బొమ్మలను కూడా పంచుకునేవారని చెప్పారు. వైద్య వృత్తిలో ఎన్నో విషాదకర ఘటనలను చూశానని, అయితే కొన్ని సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోతాయని డాక్టర్ అన్నారు. పునీత్ మరణం అలాంటి ఘటనల్లో ఒకటని తెలిపారు. ఆయనను కోల్పోవడం సొంత కుమారుడిని కోల్పోయినంత బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.




