Radhika Apte: ఆయనతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.. బాలయ్యపై హీరోయిన్ సెటైర్లు!

Radhika Apte: తెలుగు సినిమాలు, సంస్కృతిపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Gagan kumar
Published on: 4 Nov 2026 3:10 PM IST
Radhika Apte
X

Radhika Apte: ఆయనతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.. బాలయ్యపై హీరోయిన్ సెటైర్లు!

Legend movie: తన సహజమైన అభినయంతో, బోల్డ్ పాత్రలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు. హిందీతో పాటు తెలుగు, తమిళ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఈ బ్యూటీ.. గతంలోనూ టాలీవుడ్‌లో తన అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ చిత్రాల కథాంశాలు, ఇక్కడి సంస్కృతి, పితృస్వామ్య పోకడలపై ఆమె చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

మహానటి కీర్తి సురేష్‌తో కలిసి రాధికా ఆప్టే నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'అక్కా' ప్రస్తుతం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా తన సౌత్ ఇండస్ట్రీ అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలుగులో నేను చేసిన ఓ చిత్రంలో నాకంటే వయసులో చాలా పెద్దవాడైన నటుడితో రోమాన్స్ చేయాల్సి వచ్చింది. అంతేకాదు, కథలో సొంత మేనబావను పెళ్లి చేసుకునే సన్నివేశాలు ఉంటాయి. పైగా సినిమా మధ్యలోనే నా పాత్రను చంపేశారు అంటూ రాధికా ఆప్టే అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆమె ఏ సినిమా పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ 'లెజెండ్' గురించే ఈ వ్యాఖ్యలు అని సినీ ప్రియులకు ఇట్టే అర్థమైపోయింది. ఈ చిత్రంలో రాధికా ఆప్టే బాలయ్యకు మరదలి పాత్రలో కనిపించగా, ఫ్లాష్‌బ్యాక్‌లో ఆమె పాత్ర ముగిసిపోతుంది.

రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమె తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కథ నచ్చకపోతే, పెద్ద హీరోతో నటించడం ఇష్టం లేకపోతే అసలు ఆ సినిమాను ఎందుకు ఒప్పుకున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సౌత్ ఇండియాలో 'మేనరికం' అనేది తరతరాలుగా వస్తున్న సంస్కృతి అని, ప్రాంతీయ సినిమాలు చేస్తున్నప్పుడు ఇక్కడి నేటివిటీని గౌరవించాలని హితవు పలుకుతున్నారు.

కెరీర్ ఆరంభంలో పేరు, పారితోషికం కోసం మాస్ సినిమాల్లో నటించి, ఇప్పుడు ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాక పితృస్వామ్యం అంటూ విమర్శలు గుప్పించడం ఎంతవరకు సమంజసమని టాలీవుడ్ ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. 'లెజెండ్' అనుభవం నచ్చకపోతే, ఆ తర్వాత మళ్లీ బాలకృష్ణ సరసన 'లయన్' సినిమాలో ఎందుకు నటించారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే, ఈ వ్యవహారంలో రాధికా ఆప్టే వాదనను కొందరు సినీ విశ్లేషకులు సమర్థిస్తున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే ఇతర భాషల హీరోయిన్లకు పెద్ద ప్రాజెక్టులను కాదనే స్వేచ్ఛ, బేరమాడే బలం ఉండవని వారు అభిప్రాయపడుతున్నారు.

మాస్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం, కథ చెప్పేటప్పుడు ఉన్నవి సెట్స్‌పైకి వెళ్లాక మారిపోవడం సాధారణమే అని చెబుతున్నారు. మొత్తానికి, అవకాశం వచ్చినప్పుడు మౌనంగా ఉండి, ఏళ్ల తర్వాత ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.