Varanasi: ఆ సీక్రెట్‌ను రివీల్ చేసిన రాజమౌళి... మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు పండగే
మహేష్‌బాబు వారణాసి సినిమాను ఐమాక్స్ ఫార్మాట్‌లోనే ఎందుకు చిత్రీకరించారో రాజమౌళి హింట్ ఇచ్చారు. సినిమా ఎంత విజువల్ గ్రాండియర్‌గా ఉండబోతున్నాయో చెప్పండంతో ఫ్యాన్స్‌లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' గురించి ఒక బిగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను భారీ ఐమాక్స్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం ఉన్నప్పటికీ... అసలు ఐమాక్స్ సాంకేతికతనే ఎందుకు ఎంచుకున్నారో రాజమౌళి ఇప్పటివరకు ఎక్కడా పెదవి విప్పలేదు. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన 'సునామీ' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జక్కన్న ఈ సీక్రెట్‌ను రివీల్ చేశారు.
ఐమాక్స్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఇదే!
రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం... ఈ సినిమాలో విజువల్స్ అత్యంత బ్రహ్మాండమైన పరిమాణంలో ఉంటాయి. అంటార్కిటికా ప్రాంతంలో ఉండే దాదాపు 300 అడుగుల అంటే సుమారు 91 మీటర్లు ఎత్తున్న భారీ మంచు కొండల దృశ్యాలు ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాదు, కథలో భాగమైన విలక్షణమైన రామాయణ వానర సేనల భారీ యుద్ధ సన్నివేశాలు ఐమాక్స్ స్క్రీన్‌పై మాత్రమే సరిగ్గా అనుభూతి చెందగలరని ఆయన తెలిపారు. ఈ విశాలమైన ఐమాక్స్ రేషియో వల్ల మాత్రమే ప్రేక్షకులు థియేటర్లో కూర్చుని ఆ అద్భుత ప్రపంచంలోకి నేరుగా ప్రవేశించిన అనుభూతిని పొందగలరని రాజమౌళి స్పష్టం చేశారు.
శరవేగంగా షూటింగ్... విడుదల ఎప్పుడంటే?
ఈ గ్లోబ్-ట్రావెల్ అడ్వెంచర్ చిత్రంలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తయింది. ప్రధానమైన భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా ముగిసింది. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. కాగా, ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కథను రహస్యంగా ఉంచుతూనే విజువల్ వండర్‌కు సంబంధించిన విషయాలను రాజమౌళి బయటపెట్టడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారీ ఐమాక్స్ ఫార్మాట్ విజువల్స్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న ఆతృతలో ఉన్నారు అభిమానులు. కథ ఏంటన్నది బయటకు తెలియకున్నా... విజువల్స్ ఎలా ఉండబోతున్నాయో రాజమౌళి హింట్ ఇవ్వడం విశేషం.




