Rajanala: సినీ ప్రయాణంలో ఆ చివరి రోజులు... ఓ సీనియర్ నటుడి హృదయవేదన
ఖంగుమనే కంఠంతో, ఎవరి వెన్నులోనైనా వణుకుపుట్టించి విలనిజం అంటే ఇలానే ఉండాలని చెప్పిన రాజనాల చివరి రోజుల్లో పాపం బతికేందుకు మాత్రమే వేషాలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Rajanala: ఎవరి జీవితంలోనైనా సరే చివరి రోజులు చాలా కీలకమైనవి. బతుకుండే ఆ కొన్ని రోజులు ఎవరికీ భారం కాకుండా... ఎవరినీ నొప్పించకుండా జీవించాలి. బాగా బతికిన రోజులు ఎంత బలంగా ఉన్నా...బలహీనమైన ఆ చివరి రోజులు ఎందుకు ఇంకా బతికి ఉన్నామా అనిపించకుండా బతికేయాలి. ఇది సామాన్యుల నుంచి సినీ తారల వరకు అందరికీ వర్తిస్తుంది. ఇక ఆ పాతతరం నటుల్లో కొందరు కళను కేవలం కళమాదిరిగానే చూశారు. సంపాదించిన సొమ్మును దాచుకోకుండా దానధర్మాలు చేశారు. దాచుకోవడానికి ఏమీ లేకపోవడంతో చివరి రోజులు అత్యంత దుర్భరంగా గడిపారు. ఇలాంటి వారి జీవితాల్లో రాజనాల జీవితం కూడా ఒకటి. చివరి రోజుల్లో సినిమాల్లో నటన కోసం ఆయన చేసిన ప్రయత్నం నిజంగా కంటతడి పెట్టిస్తుంది.
ఊరికే ఏదీ తీసుకోను
సింహంలాంటి దేహం... కత్తిదూస్తే ఎవరైనా సరే భయపడే వేగం... కళ్లురుమిచూస్తే భయం గొలిపే విలనిజం... ఇవన్నీ రాజనాలకు ఆభరణాలే. సినిమా ఏదైనా కావొచ్చు...హీరో ఎవరైనా కావొచ్చు... విలన్ మాత్రం రాజనాలే. ఒక్క క్షణం కూడా తీరికలేనంతగా ఆయనకు సినిమా ఆఫర్లు వచ్చాయి. మూడు నాలుగు షిఫ్టుల్లో పనిచేశారు. ఏ పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటించేవాడు. అలాంటి వ్యక్తి చివరి రోజులు మరింత దుర్భరంగా మారిపోయాయి. మద్రాసు నుంచి అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి తన అభిమాని కట్టించిన లాడ్జీలో ఓ రూములో ఉండేవాడు. ఎవరూ ఏదీ ఉచితంగా ఇస్తానన్నా తీసుకునేవాడు కాదట. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఓ సినిమాలో నటన కోసం రెండుమూడు సార్లు ఫోన్ చేయగా... చివరకు దర్శకుడిని కలిసే అవకాశం లభించింది. మద్రాసు నుంచి వచ్చిన తరువాత రామానాయుడు సినిమాలో నటించగా వచ్చిన డబ్బుతో ఫ్యాన్, చిన్న చిన్న వస్తువులు కొనుగోలు చేసినట్టు తెలిపారు. మీ సినిమాలో వేషం ఇస్తే మిగిలిన వస్తువులు కొనుగోలు చేస్తానని చెప్పగా...కోడి రామకృష్ణ మీరు ఇక్కడి నుంచి వెళ్లే సరికి మీ రూములో మీకు కావలసిన వస్తువులు ఉంటాయని చెబితే రాజనాల ససేమిరా అన్నారట. వేషం ఇస్తే ఆ డబ్బుతోనే కొనుగులు చేస్తానని, ఉచితంగా ఏమీ తీసుకోనని చెప్పాడు. ఎలాగైతేనేం వేషం ఇచ్చిన తరువాత ఆటోకు డబ్బులు ఇవ్వబోగా...ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోడని, తాను నెలకు మాట్లాడుకున్నానని, నెలవారీగా తానే ఇస్తానని చెప్పినట్టు కోడిరామకృష్ణ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన దేవీ ప్రసాద్ ఓ సందర్భంలో తెలిపాడు.
ముసలితనం మహాశాపం
యవ్వనంలో ఉండగా ధీమాగా, నాకేమిలే అన్నట్టుగా ఉంటే..ముసలితనం శాపంగా మారుతుంది. ఇబ్బందులు వస్తాయి. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు. ఎక్కడా ఎందులోనూ రాజీపడకుండా నడవలేని రోజు నలుగురు మనకు తోడు ఉండేలా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. సినిమాల్లో చూపిన విధంగానే కళాకారుల జీవితాలు చివరి రోజుల్లో అత్యంత దుర్లభంగా ఉంటాయి. కానీ, ఇప్పటి తరం నటుడు వచ్చిన డబ్బను విచ్చలవిడిగా ఖర్చుచేయకుండా పొదుపు చేస్తూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముసలితనాన్ని శాపం కాకుండా చూసుకుంటున్నారు.




