Ramayana movie: రిలీజ్‌కు ముందే రికార్డులపై ‘రామాయణం’ దండయాత్ర!

Ramayana movie: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సౌత్ క్వీన్ సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో తెరకెక్కెన విజువల్ వండర్ ‘రామాయణం’ .

Gagan kumar
Published on: 4 Nov 2026 1:13 PM IST
Ramayana movie
X

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సౌత్ క్వీన్ సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో తెరకెక్కెన విజువల్ వండర్ ‘రామాయణం’ మూవీ థియేటర్లలోకి రాకముందే సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం, విడుదలకు కొద్ది గంటల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఏకంగా రూ. 100 కోట్ల మార్కును దాటేసి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దసరాకు 15 రోజుల ముందే ప్రారంభమైనప్పటికీ, మొదట్లో కాస్త నెమ్మదిగానే సాగాయి. అధిక ఆదాయ వాటా కోసం పంపిణీదారు అయిన ధర్మ ప్రొడక్షన్స్‌కు, థియేటర్ ఎగ్జిబిటర్లకు మధ్య నడిచిన చర్చల కారణంగా ముంబై, ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లోని పరిమిత స్క్రీన్లు, సింగిల్ స్క్రీన్లలో బుకింగ్స్ ఆలస్యమయ్యాయి. అయితే గత శుక్రవారం ఈ సమస్యలన్నీ కొలిక్కిరావడంతో ఒక్కసారిగా స్క్రీన్ల సంఖ్య పెరిగింది. కేవలం మంగళవారం ఒక్క రోజే ఏకంగా 1,500 కొత్త స్క్రీన్లు జతకూడటంతో, మొత్తం స్క్రీన్ల సంఖ్య 5,000 మార్కును దాటి బుకింగ్స్ ఊపందుకున్నాయి.

విడుదలకు రెండు రోజుల ముందే ఈ చిత్రం భారతదేశంలో అడ్వాన్స్ టికెట్ల అమ్మకాల ద్వారానే రూ. 58 కోట్ల గ్రోస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. తొలి రోజే చూసేందుకు ప్రేక్షకులు పోటీ పడటంతో రూ. 27 కోట్లు వచ్చాయి. 2వ, 3వ రోజులకు సంబంధించి ఇప్పటికే రూ. 25 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడయ్యాయి. భారతదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15 లక్షలకు పైగా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మొత్తం స్క్రీన్లలో కేవలం 4% ఉన్నప్పటికీ, 25% పైగా వసూళ్లు ప్రీమియం ఫార్మాట్ అయిన IMAX షోల నుంచే రావడం విశేషం.

విదేశీ మార్కెట్‌లోనూ ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. లాస్ ఏంజిల్స్‌లో గ్రాండ్ ప్రీమియర్ జరిగిన 24 గంటల్లోనే యుఎస్ బుకింగ్స్ 27 శాతం మేర పెరిగాయి. నవంబర్ 4న జరగనున్న ఉత్తర అమెరికా ప్రివ్యూల కోసం కేవలం ప్రీమియర్ల నుంచే 1.5 మిలియన్ డాలర్ల మార్కు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లలో బుకింగ్స్ ద్వారానే 5 మిలియన్ డాలర్లు (రూ. 40 కోట్లకు పైగా) రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలిపి విడుదలకు ముందే రూ. 105 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్** నమోదు చేసి, ఇప్పటివరకు 'బాహుబలి 2', 'RRR', 'పుష్ప 2', 'ధురందర్ 2' వంటి దిగ్గజ చిత్రాలు సాధించిన రూ. 100 కోట్ల అడ్వాన్స్ క్లబ్‌ సరసన 'రామాయణం' చేరింది. బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, నవంబర్ 5న థియేటర్లలోకి అడుగుపెడుతున్న ఈ చిత్రం భారతీయ చిత్రసీమలోనే బిగ్గెస్ట్ డే-1 ఓపెనర్స్ టాప్-5 జాబితాలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.