Ramayana Ticket: రూ.300 టికెట్ ఇప్పుడు రూ.99కే.. ‘రామాయణ’ మేకర్స్ బంపర్ ఆఫర్!
Ramayana Ticket: గురునానక్ జయంతి సందర్భంగా ‘రామాయణ: పార్ట్ 1’ మేకర్స్ టికెట్ ధరను రూ.99కి తగ్గించారు. 2D, 3D, ఐమ్యాక్స్ షోల తగ్గింపు ధరలు మరియు బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు తెలుసుకోండి.
Ramayana Ticket: రూ.300 టికెట్ ఇప్పుడు రూ.99కే.. ‘రామాయణ’ మేకర్స్ బంపర్ ఆఫర్!
Ramayana Ticket: బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న ‘రామాయణ: పార్ట్ 1’ (Ramayana: Part 1) చిత్రబృందం ప్రేక్షకులకు అదిరిపోయే శుభవార్త అందించింది. భారీ బడ్జెట్ చిత్రాలను కుటుంబంతో కలిసి థియేటర్లలో చూడాలంటే జేబుకు చిల్లుపడాల్సిందేనని భావించే సినీ ప్రియుల కోసం మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఇవాళ (నవంబర్ 24, మంగళవారం) సినిమా టికెట్ ధరను ఏకంగా రూ.99కి తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రూ.300 టికెట్.. ఇప్పుడు రూ.99కే!
సాధారణంగా మల్టీప్లెక్స్‌లలో భారీ సినిమాల టికెట్ ధరలు రూ.300కు పైగానే ఉంటాయి. అయితే, మరింత మంది కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా మేకర్స్ ఈ ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో 2D టికెట్లు రూ.99 నుంచే లభిస్తున్నాయని చిత్రబృందం అధికారిక సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
3D, ఐమ్యాక్స్ షోలపైనా భారీ డిస్కౌంట్లు
కేవలం 2D ఫార్మాట్‌కే కాకుండా 3D, ఐమ్యాక్స్ (IMAX) షోల ధరలను కూడా గణనీయంగా తగ్గించారు.
3D టికెట్లు: గతంలో రూ.500కు పైగా ఉన్న 3D టికెట్లు ఇప్పుడు ఎంపిక చేసిన థియేటర్లలో రూ.119 నుంచి రూ.249 మధ్య లభిస్తున్నాయి.
ఐమ్యాక్స్ 3D: ఎంపిక చేసిన ఐమ్యాక్స్ స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.250 నుంచే ప్రారంభమవుతున్నాయి.
రెక్లైనర్ సీట్లు: ప్రీమియం రెక్లైనర్ సీట్ల ధరలు సుమారు రూ.199 నుంచి రూ.249 వరకు ఉండగా, కొన్ని అత్యంత ప్రీమియం స్క్రీన్లలో మాత్రం రూ.700–800 వరకు కొనసాగుతున్నాయి.
ఈ ఆఫర్ ఒక్కరోజేనా.. వారం మొత్తం ఉంటుందా?
తొలుత మంగళవారం ప్రత్యేక ఆఫర్‌గా ప్రకటించినప్పటికీ, బుక్‌మైషో (BookMyShow) షో వివరాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఈ తగ్గింపు ధరలు ఈ వారం మొత్తం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 4,000 స్క్రీన్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రానికి అన్ని థియేటర్లలో ఒకే ధర వర్తించదు. కాబట్టి టికెట్లు బుక్ చేసుకునే ముందు బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ (District) వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ధరలను సరిచూసుకోవడం మంచిది.
వసూళ్లు నెమ్మదించడంతోనే ఈ వ్యూహమా?
విడుదలైన తొలి రోజుల్లో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘రామాయణ’ కలెక్షన్లు సోమవారం (నవంబర్ 23) కాస్త నెమ్మదించాయి. ఆదివారంతో పోలిస్తే తగ్గుదల కనిపిస్తూ, సోమవారం సుమారు రూ.12.70 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో థియేటర్లలో ఆక్యుపెన్సీని పెంచేందుకే మేకర్స్ ఈ రూ.99 ఆఫర్ వ్యూహాన్ని అమలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రూ.1,700 కోట్ల క్లబ్లో ‘రామాయణ’
నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యశ్ (రావణుడు), రవీ దూబే (లక్ష్మణుడు) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కేవలం 19 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,700 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. తాజా డిస్కౌంట్ ఆఫర్‌తో బాక్సాఫీస్ వద్ద మరోసారి వసూళ్ల సునామీ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




