Ranveer Singh Boycott : బాలీవుడ్లో సంచలనం.. హీరో రణవీర్ సింగ్‌పై 3 ఏళ్ల నిషేధం?
Ranveer Singh Boycott : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చుట్టూ ఒక పెద్ద వివాదం ముదురుతోంది. దేశంలోనే అతిపెద్ద సినీ కార్మికుల సంఘం అయిన..
Ranveer Singh Boycott
Ranveer Singh Boycott : బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ చుట్టూ ఒక పెద్ద వివాదం ముదురుతోంది. దేశంలోనే అతిపెద్ద సినీ కార్మికుల సంఘం అయిన 'ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్' (FWICE) రణవీర్ సింగ్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనతో ఇండస్ట్రీలో ఎవరూ సహకరించకూడదంటూ ‘నాన్-కోఆపరేషన్ డైరెక్టివ్’ (బహిష్కరణ) జారీ చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కాల్సిన 'డాన్ 3' (Don 3) సినిమా షూటింగ్ ప్రారంభానికి కేవలం మూడు వారాల ముందే రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి హఠాత్తుగా తప్పుకోవడమే ఈ వివాదానికి ప్రధాన కారణం. హీరో తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా కలకలం రేగింది.
రూ. 45 కోట్ల భారీ నష్టం.. కార్మికుల ఆగ్రహం
రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ నుండి ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం వల్ల చిత్ర నిర్మాత, దర్శకుడు ఫర్హాన్ అక్తర్‌కు చెందిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్కు దాదాపు రూ.45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ మీడియాకు వెల్లడించారు. షూటింగ్ కోసం విదేశీ ప్రయాణాలు, లొకేషన్లు, హోటల్ బుకింగ్స్ వంటి ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం వల్ల ఈ నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కేవలం నిర్మాతలకు ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా, ఈ ఎగ్జిట్ వల్ల ఎంతోమంది కెమెరామెన్లు, టెక్నీషియన్లు, రోజువారీ వేతనంపై ఆధారపడే వందలాది మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని కార్మిక సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సూపర్ స్టార్ అయినా సరే పరిశ్రమ నియమ నిబంధనల కంటే పెద్దవాడు కాదంటూ సంఘం స్పష్టం చేసింది.
నోటీసులను బేఖాతరు చేయడంతోనే కఠిన నిర్ణయం
ఈ మొత్తం వివాదంపై స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ FWICE సంఘం రణవీర్ సింగ్‌కు వరుసగా మూడుసార్లు నోటీసులు పంపింది. అయితే, రణవీర్ సింగ్ ఆ నోటీసులను పూర్తిగా బేఖాతరు చేశారని, ఈ సమస్య తమ పరిధిలోకి రాదంటూ ఆయన ప్రతినిధులు సమాధానం ఇచ్చారని సినీ కార్మికుల సంఘం తెలిపింది. వారి బాధ్యతారహిత్య వైఖరి వల్లే ఈ కఠిన బహిష్కరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, వివాదం సద్దుమణిగే వరకు తమ 4 లక్షల మంది సభ్యులలో ఎవరూ రణవీర్ సింగ్‌తో కలిసి పనిచేయరని ఫెడరేషన్ ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ స్పష్టం చేశారు. మరోవైపు, రణవీర్ సింగ్ ప్రతినిధులు స్పందిస్తూ, తాము చిత్ర పరిశ్రమపై ఎంతో గౌరవంతో ఉన్నామని, ఇలాంటి వృత్తిపరమైన విషయాలను పరిణతితో, గౌరవప్రదంగా పరిష్కరించుకోవడానికే రణవీర్ ఇష్టపడతారని ఒక ప్రకటన విడుదల చేశారు.




