Ratatouille Movie: ఎలుక చేసిన తమాషా వంట... చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే రాటాటూయి
ఒక ఎలుక ఫ్రాన్స్‌లో అందరూ మెచ్చుకునే చెఫ్‌గా ఎలా మారింది అనే కాన్సెప్ట్‌తో 2007లో వచ్చిన రాటాటూయి సినిమా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఎవరైనా వంట చేయవచ్చు అనే చిన్న మాటతో కథను అల్లడం ప్రత్యేకం.
Ratatouille Movie: అందరూ చీదరించుకునే ఒక మురికి ఎలుక ప్రఖ్యాత ప్యారిస్ షెఫ్‌గా మారితే? కర్కశంగా మారిన అహంకారిని చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లిన ఒకే ఒక్క రుచి రాటాటూయి..అసలేంటి వంటకం. ఆస్కార్ గెలుచుకున్న ఈ డిస్నీ అనిమేషన్ వెనుక ఉన్న అసలైన కథనం ఏంటో తెలుసుకుందాం.
పిల్లలనే కాదు, పెద్దలను కూడా తన్మయత్వంలో ముంచెత్తే అద్భుతమైన అనిమేటెడ్ చిత్రం 'రాటాటూయి'. 2007వ సంవత్సరంలో దర్శకుడు బ్రాడ్ బర్డ్ తెరకెక్కించిన ఈ డిస్నీ-పిక్సార్ వండర్, అకాడమీ ఉత్తమ అనిమేటెడ్ చిత్ర అవార్డును గెలుచుకోవడమే కాకుండా, BBC ప్రకటించిన 100 గొప్ప చిత్రాల జాబితాలోనూ చోటు దక్కించుకుంది. ఎవరైనా వంట చేయవచ్చు అనే ఒక చిన్న సూత్రం చుట్టూ తిరిగే ఈ కథ, ఒక చిన్న ఎలుక తన ఆశయాన్ని ఏ విధంగా సాధించిందో హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది.
అసలు ఏమిటీ 'రాటాటూయి'?
ఫ్రాన్స్‌లోని ప్రొవాన్స్ ప్రాంతానికి చెందిన 'రాటాటూయి' అనేది నిజానికి టమాటో, వెల్లుల్లి, ఉల్లిపాయలు, జుక్కిని, వంకాయలతో చేసే ఒక సాధారణ శాఖాహార వంటకం. మన దగ్గర గుజరాతీ ఉంధియు లేదా కేరళ అవియల్ లాంటిది. అయితే సినిమాలో ప్రఖ్యాత షెఫ్ థామస్ కెల్లర్ రూపొందించిన 'కన్ఫిట్ బయాల్డి' అనే వైవిధ్యమైన శైలిని ప్రదర్శించారు.
ముగ్గురు పరాజితులు... ఒకే ఆశయం!
ఈ కథలో ప్రధానంగా మూడు విభిన్న పాత్రలు కనిపిస్తాయి. అందులో ఒకటి రెమీ పాత్ర. సభ్య సమాజం అసహ్యించుకునే ఒక మురికి ఎలుక. కానీ, దానికి అత్యంత నిశితమైన వాసన శక్తి, వంటల పట్ల అమితమైన ప్రేమ ఉంటాయి. ఇక రెండో పాత్ర లింగ్విని. వంటల పట్ల ఏమాత్రం ప్రవేశం లేని, మరణించిన ప్రసిద్ధ షెఫ్ గుస్టావ్ అక్రమ సంతానం. ఇక మూడో పాత్ర కొలెట్. పురుషాధిక్యత కలిగిన షెఫ్‌ల ప్రపంచంలో తన ప్రతిభను నిరూపించుకోవడానికి పోరాడే మహిళ. ఈ మూడు పాత్రల చుట్టూ కథ నడుస్తుంది. ఇక వంట రాని లింగ్విని తలపై ఉన్న టోపీలో దాక్కుని, జుట్టును లాగుతూ అతడితో వంటలు చేయిస్తుంది ఎలుక రెమీ. ఈ విచిత్ర సమన్వయంతో వారిద్దరూ పారిస్ నగరంలోనే ప్రసిద్ధి చెందుతారు. యానిమేషన్ అయినప్పటికీ.. ఇక్కడ కథనాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.
ఇగోను కరిగించిన చిన్ననాటి జ్ఞాపకం!
ఈ చిత్రానికి అసలైన ప్రాణం 'ఆంటోన్ ఇగో' అనే కర్కశమైన వంటల విమర్శకుడి పాత్ర. ఎవరి ప్రలోభాలకు లొంగని ఆ విమర్శకుడిని మెప్పించడానికి రెమీ స్వయంగా 'రాటాటూయి' అనే సాధారణ వంటకాన్ని తయారు చేసి వడ్డిస్తుంది. ఆ వంటకాన్ని ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే... ఆ కఠినమైన మనిషి క్షణాల్లో కరిగిపోయి తన చిన్నతనంలో అమ్మ వండిన వంట తాలుకూ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. తనలోని అహంకారాన్ని మరచిపోయి, ఒక ఎలుక చేసిన వంటకు దాసోహమవడం సినిమాకే అత్యంత మరుపురాని ఘట్టం. మనుషుల భావోద్వేగాలను ఒక చిన్న వంటకం ఏ విధంగా ప్రభావితం చేయగలదో చెప్పడానికి ఈ చిత్రం ఒక నిదర్శనం. కథ చాలా చిన్నదే. ఎవరైనా వంట చేయవచ్చు అనే చిన్న మాటను ఆధారంగా చేసుకొని ఇంత పెద్ద కథను అల్లడం. దానికి ఎలుకను ప్రధానంగా చూపించడం అత్యంత సాహసోపేతమైనవిగా చెప్పాలి.




