Raviteja Irumudi: ఆ సీన్స్ ఏంటి..? ‘ఇరుముడి’పై నారా లోకేశ్‌కి ఎమ్మెల్సీ ఫిర్యాదు!

Raviteja Irumudi: రవితేజ 'ఇరుముడి' సినిమా 100 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తున్నా, ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయంటూ ఏపీ టీచర్స్ యూనియన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

Gagan kumar
Published on: 28 Aug 2026 10:26 AM IST
Raviteja Irumudi
X

Raviteja Irumudi: ఆ సీన్స్ ఏంటి..? ‘ఇరుముడి’పై నారా లోకేశ్‌కి ఎమ్మెల్సీ ఫిర్యాదు!

Raviteja Irumudi: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దండయాత్ర చేస్తోంది. విడుదలైన తొలి నాలుగు రోజుల్లోనే అత్యంత వేగంగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

రెండో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ అనేక కేంద్రాల్లో హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ షేక్ అవుతోంది. అయితే, ఒకవైపు ఈ స్థాయి విజయాన్ని అందుకుంటున్న ఈ సినిమా, మరోవైపు తీవ్ర వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సినిమాలో ప్రభుత్వ పాఠశాలలు , ఉపాధ్యాయులను అత్యంత తప్పుగా, కించపరిచేలా చిత్రీకరించారంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు చెన్నుపాటి మంజుల, బసవలింగారావులతో పాటు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్టా, యూటీఎఫ్, ఏపీటీఏ సంఘాలు ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని సీలేరు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పేరును, బోర్డును నేరుగా సినిమాలో చూపించారని మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అధికారిక డ్రెస్ కోడ్‌తో విద్యార్థినులను చూపిస్తూ, ఆ బడి హెడ్ మాస్టర్ పాత్రను అత్యంత క్రూరంగా చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్పెషల్ క్లాసుల పేరుతో అమాయక విద్యార్థినిని స్థానిక ఎమ్మెల్యే వద్దకు పంపించేలా దృశ్యాలు చిత్రీకరించడం ఉపాధ్యాయులకు, ప్రజాప్రతినిధులకు తీవ్ర తప్పుడు సంకేతాలు ఇస్తోందని మండిపడ్డారు.

ఈ వివాదం మరింత ముదరడంతో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి భీమవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నో సమస్యలు, సవాళ్ల నడుమ ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న వేలాది మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు.

సినిమా తీసే దర్శక నిర్మాతలకు సామాజిక బాధ్యత ఉండాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి హితవు పలికారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఆయన లేఖ రాస్తూ, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి శాశ్వతంగా తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సమాజంపై తీవ్ర ప్రభావం చూపే సినిమా మాధ్యమంలో విద్యా వ్యవస్థపై ప్రతికూల భావనలు పెంచే సీన్లు ఉండటం తగదని, సదరు చిత్ర నిర్మాణ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story