Relangi: పద్మశ్రీ పొందిన తొలి కమెడియన్...పాత్రల కోసం మైళ్లదూరం నడిచిన రేలంగి
తెలుగు చిత్రసీమలో హాస్యం అంటేనే రేలంగి.. రేలంగి అంటేనే హాస్యం. ఒకప్పుడు హీరో ఎవరన్నది పక్కనపెట్టి, కేవలం రేలంగి నటన కోసమే జనం థియేటర్లకు క్యూ కట్టేవారు.
Relangi: తెలుగు చిత్రసీమలో హాస్యం అంటేనే రేలంగి.. రేలంగి అంటేనే హాస్యం. ఒకప్పుడు హీరో ఎవరన్నది పక్కనపెట్టి, కేవలం రేలంగి నటన కోసమే జనం థియేటర్లకు క్యూ కట్టేవారు. తెలుగు సినీ చరిత్రలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న తొలి హాస్యనటుడిగా చరిత్ర సృష్టించిన రేలంగి వెంకట్రామయ్య గారి జీవితం నేటి తరానికి ఒక గొప్ప పాఠం. తెలుగు సినిమా స్వర్ణయుగంలో ఎందరో మహానటులు ఉన్నా, హాస్యాన్ని ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకెళ్లిన ఘనత రేలంగిదే. కేవలం తన ముఖ కవళికలతో, విలక్షణమైన టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన అరుదైన కళాకారుడు ఆయన.
సైకిల్ నుంచి సెవెన్ సీటర్ కారు వరకు
కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం మద్రాసు వీధుల్లో మైళ్ల కొద్దీ నడిచిన రేలంగి, స్టార్ నటుడిగా ఎదిగిన తర్వాత కూడా తన గతాన్ని మర్చిపోలేదు. తాను తొక్కే సైకిల్‌ను ప్రాణంలా చూసుకునేవారు. "ఒకవేళ నాకు అవకాశాలు తగ్గితే, ఈ ఆస్తిపాస్తులు వదిలేసి మళ్లీ నా సైకిల్ వేసుకుని మా తాడేపల్లిగూడెం వెళ్ళిపోతాను" అని ఆయన సరదాగా అనేవారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన నైజం. షూటింగ్ ముగిశాక చిన్న ఆర్టిస్టులను, అసిస్టెంట్ డైరెక్టర్లను స్వయంగా తన కారులో ఎక్కించుకుని వారి ఇళ్ల వద్ద దించి వెళ్లేంతటి దయాహృదయం ఆయనది. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. ఆయన మాటలంటే ప్రాణం. షూటింగ్ అంటే తల నొప్పి అనుకునేవారు కూడా రేలంగిని చూడగానే అరె ఒక్కదెబ్బతో మాయమైందే అనేవారట. అంతలా ఆయన నవ్వించేవాడు. నవ్వడం ఒక యోగమైతే..నవ్వించేవాడిని ఇంకేమనాలో.
లెక్కకు మించిన గుప్తదానాలు
రేలంగి ఇంట్లో నిత్యం కనీసం 25 మందికి పైగా భోజనం చేసేవారట. ఎంతోమంది పేద విద్యార్థుల ఫీజులు కట్టారు, ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఆయన చేసిన దానాలకు లెక్కే లేదు. సావిత్రి నుంచి సూర్యకాంతం వరకు అందరితోనూ ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. ముఖ్యంగా సూర్యకాంతం-రేలంగి కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక బ్రాండ్ ఇమేజ్. సావిత్రిలా దానాలు చేసినా...ఆమెలా మాత్రం ఆయనకు దుర్వసనాలు అంటుకోలేదు. సూర్యాకాంతంలా ఎప్పుడూ నిండుకుండలా ఉండేవాడు.
పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్
తన 34 ఏళ్ల సినీ ప్రయాణంలో సుమారు 205 చిత్రాల్లో నటించిన రేలంగి, ఒకానొక వేదికపై "ఇన్నేళ్లుగా నటిస్తున్నా ప్రభుత్వం నన్ను గుర్తించలేదు" అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు అప్పటి హోం మంత్రి జలగం వెంగళరావు చెవిన పడటంతో, 1970లో భారత ప్రభుత్వం ఆయనను 'పద్మశ్రీ' పురస్కారంతో గౌరవించింది. హాస్యనటుల్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే. సరదా మాటలు కూడా ఇలాంటి గుర్తింపు తెస్తాయంటే ఆశ్చర్యమే కదా. సరదాకు చెప్పినా అది ఆయన మనసులోని మాట. అందుకే ఫలించింది. ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
మృత్యువుని ఎరిగిన మహానటుడు
1975 నవంబర్ 27న ఆయన కన్నుమూశారు. మరణించే కొన్ని క్షణాల ముందు తనను కింద పడుకోబెట్టమని కోరారట. ఆ క్షణమే ఆయన ప్రాణం గాలిలో కలిసిపోయింది. తన మరణాన్ని తానే ఊహించిన మృత్యుంజయుడు ఆయన. రేలంగి భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పంచిన నవ్వులు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటాయి. నేటితరం ఎందరో హాస్యనటులకు ఆయన స్పూర్తి. ఆయన పండించిన హాస్యం తెలుగునాట ఎన్నటికీ గుర్తుండిపోయే పూదోట.




