Renu Desai: పవన్ కళ్యాణ్ స్టైలింగ్ వెనుక అసలు నిజం బయటపెట్టిన రేణు దేశాయ్..!
Renu Desai: 'బాలు' సినిమాలో పవన్ కళ్యాణ్ ధరించిన రూ.70 వేల రేర్ ప్యాంట్ వెనుక అసలు రహస్యం బయటపెట్టిన రేణు దేశాయ్. లండన్ షాపింగ్ విశేషాలు వైరల్.
Renu Desai: పవన్ కళ్యాణ్ స్టైలింగ్ వెనుక అసలు నిజం బయటపెట్టిన రేణు దేశాయ్..!
Renu Desai: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటన, మేనరిజం, యాక్షన్ సీన్ల గురించే కాకుండా ఆయన స్టైలింగ్, దుస్తుల ఎంపిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఆయన ధరించే బట్టలు, హెయిర్‌స్టైల్, వేసుకునే యాక్సెసరీస్‌ను యువత గుడ్డిగా అనుసరించేది. ఆయన సినిమాల్లో కనిపించిన విభిన్నమైన దుస్తులు అప్పట్లో ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచేవి. ముఖ్యంగా ఒకే దుస్తులపై మరో దుస్తులు వేసే లేయరింగ్ ప్రయోగాలు, కార్గో ప్యాంట్లు, హూడీలను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత పవన్ కే దక్కుతుంది.
అయితే ఇందులోనూ 'బాలు' సినిమాలో పవన్ ధరించిన ఒక ప్రత్యేకమైన ప్యాంట్ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ప్యాంట్ ధర ఏకంగా రూ.70 వేల వరకు ఉంటుందనే ప్రచారం అప్పట్లో విపరీతంగా సాగింది. తాజాగా ఆ ప్యాంట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన మరియు అరుదైన విషయాలను పవన్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ బయటపెట్టడంతో ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
రేణు దేశాయ్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. 'బాలు' సినిమా కోసం పవన్ కళ్యాణ్ వేషధారణ, స్టైలింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారట. ఆ చిత్రంలో పవన్ ధరించిన ఆ ప్యాంట్ సాధారణమైనది కాదని, ప్రపంచవ్యాప్తంగా అలాంటి ప్యాంట్లు కేవలం ఐదు మాత్రమే ఉన్నాయని ఆమె వెల్లడించారు. ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన ప్రత్యేకమైన వస్త్రంతో ఆ ప్యాంట్లను తయారు చేశారని ఆమె చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఆ ప్యాంట్ అరుదైన రూపకల్పన, దాని చారిత్రక నేపథ్య విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆ ప్యాంట్‌పై జరిగిన చర్చ, దాని ఖరీదైన ధర వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని తెలిసి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ స్టైలింగ్, షాపింగ్‌కు సంబంధించిన మరికొన్ని ఆసక్తికర జ్ఞాపకాలను కూడా రేణు దేశాయ్ పంచుకున్నారు. అప్పట్లో పవన్ కోసం లండన్‌లోని ఓ ప్రముఖ షాపింగ్ మాల్ నుంచి ప్రత్యేకంగా దుస్తులు కొనుగోలు చేసేవారమని తెలిపారు. అదే సమయంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కోసం ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ కూడా అదే షాపింగ్ మాల్‌కు వచ్చి బట్టలు కొనుగోలు చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్, షారుఖ్ ఖాన్ స్టైలింగ్‌లోనూ కొన్ని ప్రత్యేక పోలికలు ఉండేవని, వారిద్దరి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకునేవని తెలిపారు. ఏదేమైనా 'బాలు' సినిమా ప్యాంట్ విశేషాలు, లండన్ షాపింగ్ జ్ఞాపకాలను రేణు దేశాయ్ పంచుకోవడం పవన్ అభిమానుల్లో పాత జ్ఞాపకాలను మళ్లీ తాజా చేశాయి.




