Renu Desai: కష్టాల్లో ఉన్నవారిని వేధించడం అమానవీయం.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్!

Renu Desai: దీపావళి బాణసంచా శబ్దాలపై చేసిన పోస్ట్‌పై ట్రోలింగ్ జరగడంతో నటి రేణు దేశాయ్ తీవ్రంగా స్పందించారు.

Arun Chilukuri
Published on: 10 Nov 2026 5:22 PM IST
Renu Desai
X

Renu Desai: కష్టాల్లో ఉన్నవారిని వేధించడం అమానవీయం.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్!

Renu Desai: దీపావళి పండుగ వేళ భారీ శబ్దాలతో బాణసంచా కాల్చడంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన నటి రేణు దేశాయ్ (Renu Desai), ఆ తర్వాత తనపై జరిగిన వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారి ప్రశాంతతకు భంగం కలిగించవద్దని ఆమె కోరగా.. కొందరు నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని దారుణమైన కామెంట్లు చేశారు. ఈ పరిణామాలపై రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు.

"ఒక వ్యక్తి కష్టంలో ఉంటే వారిని ఇంకా వేధించడం నైతికంగా ఎంతమాత్రమూ సరైనది కాదు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని ఇంకా తొక్కాలని చూడటం అమానవీయం. వారు ఏ స్థాయిలో ఉన్నా సరే.. ముందు మనుషులనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒకరి సంతానం, ఒకరికి తల్లిదండ్రి, మరొకరికి తోబుట్టువు అనే స్పృహ ఉండాలి. గాజు గదుల్లో ఉంటూ ఇతరుల ఇళ్లపై రాళ్లు వేసే ప్రయత్నం చేయకూడదు. మనమంతా మనుషులం.. సహానుభూతి, దయ అనేవి ప్రతీ ఒక్కరికీ ప్రాథమికంగా ఉండాల్సిన లక్షణాలు" అని రేణు దేశాయ్ హితవు పలికారు.

అంతేకాకుండా, తాను ఈ పోస్ట్ పెట్టినందుకు కొందరు అనవసరమైన ఊహాగానాలు చేస్తారని తెలుసని స్పష్టం చేశారు. "నాకెవరూ పేటీఎం చేయలేదు.. నా సొంత అభిప్రాయాలనే ఇక్కడ పంచుకుంటున్నా. మన సమాజాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలమనే నమ్మకంతోనే ఈ మాటలు చెబుతున్నా" అని ఆమె క్లారిటీ ఇచ్చారు.

మరొక ఇన్‌స్టా స్టోరీలో యూట్యూబర్లు, పత్రికల తీరుపై రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఒకరిని బాధపెట్టి, వారి కన్నీళ్లతో డబ్బు సంపాదించే పత్రికలు, యూట్యూబర్లు ఒక విషయం గుర్తుంచుకోండి. ఆ డబ్బు ఎవరో ఒకరి వేదనతో, కన్నీళ్లతో మలినమై ఉంటుంది. ఆ కర్మ మీ మొత్తం కుటుంబాన్ని, వంశాన్ని నాశనం చేస్తుంది" అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ ఘాటైన పోస్ట్‌లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.