Happy Birthday DSP: స్కూల్ రోజుల్లోనే మ్యూజిక్ డైరెక్టర్ అవుతానన్నాడు.. కట్ చేస్తే టాలీవుడ్ రేంజ్‌నే మార్చేసాడు

Happy Birthday DSP:  టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 2). రెండు దశాబ్దాలుగా సంగీతంతో అలరించిన డీఎస్పీ, త్వరలోనే 'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' చిత్రంతో హీరోగా అలరించబోతున్నారు.

CR Reddy
Published on: 2 Aug 2026 7:41 AM IST
Happy Birthday DSP
X

 Happy Birthday DSP

Happy Birthday DSP: ఆయన మ్యూజిక్ ప్లే అయిందంటే చాలు.. ఎంతటి వారైనా కాళ్లు కదపాల్సిందే, ఎవరైనా స్టెప్పులేయాల్సిందే.. రొమాంటిక్, సెంటిమెంటల్, మాస్ బీట్స్, హై ఎనర్జీ ఐటమ్ సాంగ్స్.. జోనర్ ఏదైనా తనదైన మార్కు సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే దేవిశ్రీ ప్రసాద్ (DSP) పుట్టినరోజు నేడు (ఆగస్ట్ 2). 1979, ఆగస్ట్ 2న పశ్చిమగోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామానికి చెందిన గొర్తి సత్యమూర్తి, శిరోమణి దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి గొప్ప కథా రచయిత కావడం, ఇంట్లో సంగీత వాతావరణం ఉండటంతో చిన్నప్పటి నుంచే ఆయనకు సంగీతంపై మక్కువ పెరిగింది. అమ్మమ్మ పేరులోని 'దేవి', తాతయ్య పేరులోని 'ప్రసాద్'లను కలిపి ఆయనకు 'దేవిశ్రీ ప్రసాద్' అని పేరు పెట్టారు. మాండొలిన్ శ్రీనివాస్ వద్ద సంగీతం నేర్చుకున్న డీఎస్పీ, ఆరో తరగతిలోనే మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని చెప్పి, అనుకున్నట్లే 'దేవి' చిత్రంతో ప్లస్ 2 చదివే వయసులోనే టీనేజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రికార్డు సృష్టించారు.

మెగా కాంపౌండ్‌తో అవినాభావ బంధం

20 ఏళ్లకు పైగా సాగిన డీఎస్పీ కెరీర్‌లో మెగా ఫ్యామిలీతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిరంజీవితో శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖైదీ నంబర్ 150, పవన్ కళ్యాణ్‌తో జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్‌తో ఆర్య, జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, పుష్ప చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో రచ్చ చేశారు. రామ్ చరణ్‌తో ఎవడు, రంగస్థలం వంటి క్లాసిక్స్ అందించారు. మెగా హీరోలతోనే కాకుండా నాగార్జున (మన్మథుడు, మాస్), మహేష్ బాబు (శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు), ప్రభాస్ (వర్షం, మిర్చి), జూనియర్ ఎన్టీఆర్ (అదుర్స్, జనతా గ్యారేజ్) వంటి స్టార్లందరికీ అద్బుతమైన పాటలు అందించి టాలీవుడ్ మ్యూజిక్ కింగ్‌గా నిలిచారు.

ఎల్లమ్మతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ

దాదాపు రెండేళ్లుగా డీఎస్పీ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వైరల్ అవుతుండగా, ఇటీవల అది అధికారికంగా ఖరారైంది. బలగం చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి (జబర్దస్త్ వేణు) దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో డీఎస్పీ హీరోగా నటించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎల్లమ్మ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ పర్షి అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రా మాస్ ట్రాన్స్‌లో ఉండి, దేవిశ్రీ లుక్స్‌కి అభిమానులకు పూనకాలు తెప్పించింది.



ఈ సినిమా కథపై దర్శకుడు వేణు చాలా కాలంగా పనిచేస్తున్నారు. మొదట ఈ కథ కోసం న్యాచురల్ స్టార్ నానిని సంప్రదించినప్పటికీ, కాల్ షీట్స్ లేకపోవడం వల్ల ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ పేరు అధికారికంగా ప్రకటించినప్పటికీ, బడ్జెట్ సమీకరణాలు మరియు ఇతర కమిట్‌మెంట్ల వల్ల నితిన్ కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ పవర్‌ఫుల్ రోల్‌కి డీఎస్పీ అయితేనే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారని దిల్ రాజు, వేణు భావించి ఆయనను కథానాయకుడిగా ఖరారు చేశారు. కాగా, ఈ చిత్రంలో కథానాయిక ఎంపిక ఆసక్తికరంగా మారింది. గతంలో కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటికీ, ప్రస్తుతం ప్రేమలు సినిమాతో కుర్రకారును ఆకట్టుకున్న మలయాళ భామ మమితా బైజును హీరోయిన్‌గా లాక్ చేయడానికి చర్చలు జరుపుతున్నారు.

సరికొత్త రికార్డులపై డీఎస్పీ కన్ను

దేవిశ్రీ ప్రసాద్‌ను వెండితెరపై హీరోగా చూడాలని ఆయన అభిమానులు గత పదేళ్లుగా కోరుకుంటున్నారు. దానికి తగ్గట్లే ఎల్లమ్మ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు మైత్రి, దిల్ రాజు కాంబినేషన్ భారీగా ప్లాన్ చేస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనేక రికార్డులను తిరగరాసిన రాక్‌స్టార్, ఈ సినిమాతో నటుడిగా కూడా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న దేవిశ్రీ ప్రసాద్‌కు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story