S. Janaki Life Story: గానకోకిల ఎస్. జానకి...ఐదు తరాల స్వర ప్రయాణం వెనుక మనకు తెలియని నిజాలు!

గానకోకిల ఎస్. జానకి జీవిత విశేషాలు, ఐదు తరాల స్వర ప్రయాణం, 50 వేల పాటల ఘనత, జాతీయ అవార్డులు, వ్యక్తిగత విషాదాలు, చివరి రోజులు, సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 12 July 2026 1:23 PM IST
S. Janaki Life Story: గానకోకిల ఎస్. జానకి...ఐదు తరాల స్వర ప్రయాణం వెనుక మనకు తెలియని నిజాలు!
X

S. Janaki Life Story: తెలుగు చలనచిత్ర రంగంలో ఐదు తరాల హీరోయిన్లకు తన గొంతుతో ప్రాణం పోసిన అమృత గాయని, మన గానకోకిల ఎస్. జానకి. 1957లో తమిళ చిత్రం ‘విధియిన్ విలయాట్టు’తో మొదలైన ఆమె స్వర ప్రయాణం, దక్షిణాది చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు ఏకఛత్రాధిపత్యంగా శాసించింది. ఆరు పదుల సినీ జీవితంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకంగా 50,000కి పైగా పాటలు పాడి, 4 జాతీయ పురస్కారాలు, 31 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్న జానకమ్మ జీవితం వెనుక ఎన్నో అద్భుతాలు, మరెన్నో గుండెలను పిండేసే నిజాలు దాగి ఉన్నాయి. ఆ మధుర గాయని జీవితంలోని హృదయాన్ని హత్తుకునే మైలురాళ్లను తెలుసుకుందాం.

గుంటూరు పల్లెటూరు నుండి చెన్నై స్టూడియో వరకు

1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో ఒక సామాన్య ఉపాధ్యాయుడి ఇంట్లో జన్మించిన జానకి, చిన్నతనం నుంచే లతా మంగేష్కర్, పి.సుశీలల పాటలను పాడుతూ పెరిగారు. నాదస్వరం విద్వాన్ పైడిస్వామి వద్ద సంగీతం నేర్చుకుని, తన 19వ ఏట చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరపడిన ఆమె, కేవలం పాటలు పాడటమే కాదు... మౌనపోరాటం చిత్రానికి స్వరకల్పన చేసి భానుమతి, లీలల తర్వాత టాలీవుడ్‌లో మూడో మహిళా సంగీత దర్శకురాలిగా రికార్డు సృష్టించారు.

గొంతులోనే నవరాసాలు ... మిమిక్రీ అద్భుతాలు

జానకమ్మ గొంతు ఒక మాయా ప్రపంచం. ఒకే గొంతుతో చిన్న పిల్లాడిలా, పండు ముసలావిడలా పాడటం ఆమెకే చెల్లింది. పదహారేళ్ళ వయసు చిత్రంలో "కట్టుకథలు చెప్పి..." పాటలో పండు ముసలావిడ గొంతు. గోవుల్లు తెల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటల్లో నిష్కల్మషమైన చిన్న పిల్లాడి గొంతు. శ్రీవారి శోభనం చిత్రంలో చిలిపి బామ్మ స్వరం... ఇవన్నీ ఆమె బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనాలు. ఇళయరాజాతో 200 డ్యూయెట్లు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో వేలాది గీతాలు, ఏఆర్ రెహమాన్ తొలిరోజుల్లో ‘మార్గళి తింగళే’ వంటి క్లాసిక్స్ పాడి సంగీత ప్రపంచాన్ని మురిపించారు. దక్షిణ భారత కళాకారులకు సరైన గుర్తింపు దక్కడం లేదని 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని తిరస్కరించిన ధీశాలి ఆమె.

గుండెను పిండేసిన వ్యక్తిగత విషాదాలు

2016 సెప్టెంబరులో ఇక తాను పాడటం ఆపేస్తున్నట్లు ప్రకటించిన జానకమ్మ జీవితంలో వ్యక్తిగత బాధలు భక్తురాలిగా ఆమెను మార్చాయి. ఆమె భర్త రామ్‌ప్రసాద్ 1990ల మరణించారు. కాగా, ఆమెకు ఉన్న ఒకే ఒక్క కుమారుడు మురళీకృష్ణ భరతనాట్య ప్రవీణుడు, ‘వినాయకుడు’ చిత్ర నటుడు కూడా ఈ ఏడాది జనవరి 226న తన 65 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కుటుంబసభ్యుల మరణాలు ఆమెను తీవ్రంగా కలిచివేసినా, కృష్ణుడిని, షిర్డీ సాయిబాబాను నమ్ముకుని మీరా భజనల పూజల్లో ఆమె మనశ్శాంతిని వెతుక్కున్నారు. చివరకు సుదీర్ఘ అనారోగ్య సమస్యలతో పోరాడుతూ జులై 11, 2026 ఆ గానకోకిల అనంత వాయువుల్లో కలిసిపోయింది. శరీరం అంతరించినా, ఆమె పలికించిన ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది’ అనే స్వరం విశ్వం ఉన్నంతవరకు అమరంగానే ఉంటుంది. ఐదు తరాల పాటు భారతీయ సినిమాను లాలించిన ఆ అమ్మ గొంతుకు మరణం లేదు... అది కేవలం భౌతిక ముగింపు మాత్రమే.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story