S Varalakshmi: అలనాటి వరలక్ష్మి గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఆ పాటలను ఇప్పటివారు ఎందుకు పాడలేరంటే
అలనాటి నటి, గాయని ఎస్. వరలక్ష్మి సినీ ప్రస్థానం, ఆమె ప్రత్యేక గాత్రం, ‘లీలా కృష్ణా’ వంటి పాటల విశిష్టత, ఇప్పటికీ ఆమె పాటలు పాడటం ఎందుకు కష్టమో తెలుసుకుందాం.
S Varalakshmi: ఒకప్పుడు తెరపై నటించడమే కాదు.. తన పాత్రకు తానే పాట పాడి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటి ఎస్. వరలక్ష్మి. ఆమె గొంతులోని గాంభీర్యం, పదాల ఉచ్చారణలోని స్పష్టత, రాగాన్ని పట్టుకునే తీరు కలిస్తే పాటకు ఓ ప్రత్యేకమైన రూపం వచ్చేది. అందుకే దశాబ్దాలు గడిచినా ఆమె పాటలు గుర్తొస్తూనే ఉంటాయి. అయితే నేటి గాయనీగాయకులు ఆమె పాటలను పెద్దగా ఎంచుకోకపోవడానికి ఒక కారణం ఉంది. అవి వినడానికి ఎంత సులభంగా అనిపించినా.. పాడటం మాత్రం అంత సులభం కాదు.
బాల్యంలోనే సినీ రంగ ప్రవేశం
1927లో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించిన ఎస్. వరలక్ష్మి చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. కుటుంబ పరిస్థితుల కారణంగా కర్నూలుకు వెళ్లిన ఆమెకు పెద్దమ్మ, రంగయ్య నాయుడు అండగా నిలిచారు. అక్కడే సంగీతంపై ఆసక్తి పెంచుకుని శిక్షణ పొందారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం రోజున జన్మించడంతో ఆమెకు వరలక్ష్మి అనే పేరు పెట్టినట్లు చెబుతారు. గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో బాలనటిగా సినిమాల్లోకి అడుగుపెట్టారు. 1937లో ‘బాలయోగిని’ ఆమె తొలి చిత్రం. ఆ తర్వాత ‘రైతుబిడ్డ’, ‘ఇల్లాలు’, ‘శాంత బాలనాగమ్మ’, ‘మాయాలోకం’ వంటి చిత్రాల్లో నటించారు. ‘ఇల్లాలు’లో ఆమె పాడిన ‘కోయిలోకసారొచ్చి కూసిపోయింది’ పాటతో మంచి గుర్తింపు వచ్చింది.
‘పల్నాటి యుద్ధం’తో ప్రత్యేక గుర్తింపు
‘పల్నాటి యుద్ధం’ చిత్రం వరలక్ష్మి కెరీర్‌లో కీలక మలుపు. ఆ సినిమాలోని పాటలు అప్పట్లో మద్రాసు ఆల్ ఇండియా రేడియోలో రికార్డింగ్ అయిన మరుసటి రోజే ప్రసారమయ్యాయని చెబుతారు. ఆ కాలంలో ఇది సాధారణ విషయం కాదు. నటి, గాయనిగా ఆమె ప్రతిభకు మరో ఉదాహరణ ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రంలోని ‘లీలా కృష్ణా’ పాట. పదాలను స్పష్టంగా పలుకుతూ, అవసరమైన చోట గొంతులో విరుపులు ఇవ్వడం ఆమె ప్రత్యేకత. పాటను వింటే సహజంగా అనిపిస్తుంది. కానీ అదే భావాన్ని, అదే స్వర నియంత్రణతో పాడటం మాత్రం శిక్షణ పొందిన గాయకులకు కూడా సవాలే. ‘వెంకటేశ్వర మహత్యం’ సహా పలు చిత్రాల్లో ఆమె పాడిన పాటలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. శివాజీ గణేశన్‌తో కలిసి నటించిన ‘వీరపాండ్య కట్టబొమ్మన్’ చిత్రం కైరో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైనప్పుడు ఆమె గాత్రానికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి.
నిర్మాతగా మారి నష్టాలు
కేవలం నటి, గాయని దగ్గరే ఆమె ప్రయాణం ఆగలేదు. కన్నాంబ ప్రోత్సాహంతో నిర్మాతగా మారి ‘వరలక్ష్మీ పిక్చర్స్’ సంస్థను ప్రారంభించారు. 1957లో ‘సతీ సావిత్రి’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో మంగళంపల్లి బాలమురళీకృష్ణను చిత్రసీమకు పరిచయం చేశారు. ఈ చిత్రానికి ఏకంగా ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. అయితే నిర్మాణ రంగంలో ఎదురైన ఆర్థిక నష్టాలు ఆమె జీవితంపై ప్రభావం చూపాయి.
వ్యక్తిగత జీవితంలో విషాదాలు
సినిమాల్లో వెలుగులు చూసిన వరలక్ష్మి వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితి ఆమెను జీవితాంతం బాధించింది. భర్త మరణం తర్వాత కుటుంబ, ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. అత్తింటి వేధింపులు కూడా ఆమెను తీవ్రంగా కలిచివేశాయని సన్నిహితుల జ్ఞాపకాలు చెబుతాయి. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన సమయంలో సహచర నటీనటులు ఆమెకు అండగా నిలిచారు. ఈ విషయం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి వెళ్లడంతో ఆమె వరలక్ష్మికి ఆర్థిక సహాయం అందించినట్లు సమాచారం.
తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని పేరు
హీరోయిన్‌గా ఆమె చివరి చిత్రం 1965లో విజయా వారి ‘సత్యహరిశ్చంద్ర’. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగారు. తెలుగులో ఆమె చివరి చిత్రం ‘ముద్దుల కృష్ణయ్య’ (1986). నటి, గాయని, నిర్మాతగా అనేక పాత్రలు పోషించిన ఎస్. వరలక్ష్మి 2009 సెప్టెంబర్ 22న కన్నుమూశారు. అయితే ఆమె గొంతు మాత్రం పాత పాటల ద్వారా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. అదే ఆమె ప్రత్యేకత. నటిగా గుర్తుండిపోయిన కళాకారిణులు చాలామంది ఉన్నా.. తన పాత్రకు తానే పాడుకుని, ఆ పాటకు నటనను కూడా జోడించిన వరలక్ష్మి వంటి కళాకారిణులు అరుదు అనే చెప్పాలి.




