Sagara Sangamam:విశ్వనాథ్‌ సినిమాల్లో అంతర్లీనమైన కథ... ప్రేరణే శిల్పం

కె విశ్వనాథ్‌ సాగర సంగమం సినిమా మిగతా సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఏ లక్ష్యానికి లొంగని వ్యక్తి కథను అద్భుతంగా తెరకెక్కించి అద్భుతమైన విజయం అందుకున్నారు.

Balachander
Published on: 10 July 2026 1:36 PM IST
Sagara Sangamam:విశ్వనాథ్‌ సినిమాల్లో అంతర్లీనమైన కథ... ప్రేరణే శిల్పం
X

Sagara Sangamam:సినీ ప్రపంచంలో కళాత్మక చిత్రాలకు, భావోద్వేగాలకు కేరాఫ్ అడ్రస్ కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆయన తెరకెక్కించిన దృశ్యకావ్యాలలో మాస్టర్ పీస్ 'సాగర సంగమం'. పైకి ఇది ఒక నాట్య కళాకారుడి కథలా కనిపించినప్పటికీ, అంతర్లీనంగా ఇది తాగుడుకి బానిసైన ఓ భగ్న ప్రేమికుడి వ్యధ. సాధారణంగా ప్రేక్షకులు పరాజితుల కథలను చూడటానికి ఇష్టపడరనే ఒక టాక్ ఇండస్ట్రీలో ఉంది. కానీ, విశ్వనాథ్ బాలు పాత్రను అందరి దృష్టిలో పరాజితుడిగా చూపించి కూడా, ఈ సినిమాతో అఖండ విజయాన్ని సాధించారు. మనిషి జీవితంలో గెలుపైనా, ఓటమైనా.. దాని వెనుక ఒక వ్యక్తి ఇచ్చే 'ప్రేరణ' ఎంత బలంగా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది.

బాలు జీవితాన్ని శాసించిన ఇద్దరు స్త్రీలు

బాలు అనే అద్భుతమైన నర్తకుడి జీవితంలో ఇద్దరు స్త్రీలు అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. వారే అతని కళకు ప్రాణవాయువు లాంటి ప్రేరణను ఇచ్చారు. తన నాట్య ప్రదర్శనను తల్లికి చూపించాలనేది బాలు మొదటి ఆశయం. కానీ ఆమె హఠాన్మరణం బాలును కోలుకోలేని దెబ్బ తీసింది. బాలులోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించిన ప్రేయసి జయప్రద. అయితే ఆమెకు అప్పటికే వివాహం జరిగిందని తెలిసిన తర్వాత, బాలు తన ప్రేమను త్యాగం చేసి ఆమెను భర్తతో కలిపాడు. తన జీవితంలో ముఖ్యమైన ఇద్దరు లేకపోవడంతో కమల్‌ హాసన్‌ హృదయం కకావికలం అయిపోతుంది. తన కళను ఆస్వాదించేవారే లేనప్పుడు ఇక ఎవరి కోసం నృత్యం చేయాలనే వైరాగ్యంతోనే అతను మందుకు బానిసయ్యాడు.

విశ్వనాథ్ విభిన్న పాత్రల విశ్లేషణ

విశ్వనాథ్‌ గత సినిమాలతో పోలిస్తే సాగర సంగమం ఫార్ములా పూర్తిగా భిన్నమైనది. ఆయన ఇతర చిత్రాలలో పాత్రల ట్రీట్‌మెంట్ ఒకలా ఉంటే, సాగర సంగమంలో మరోలా ఉంటుంది. స్వయంకృషి సినిమాలో చిరంజీవి ప్రేమ విఫలమైనా నీరుగారిపోకుండా లలిత ప్రేరణతో లక్షాధికారిగా ఎదుగుతాడు. శంకరాభరణం సినిమాలో జేవీ సోమయాజులు పాత్ర విషయానికి వస్తే మారిన తరం ఆదరించకపోయినా శిష్యురాలి ఆరాటమే ఆయనలోని ప్రతిభను లోకానికి చాటుతుంది. స్వర్ణకమలం సినిమా కూడా ఇంచుమించుగా ఇలానే ఉంటుంది. కానీ, సాగర సంగమంలో బాలు పాత్ర ఏ లక్ష్యాలకూ లొంగదు. క్లైమాక్స్‌లో తన శిష్యురాలి నాట్యంలో తన కళను చూసుకుని మురిసిపోతున్న తరుణంలోనే, అనారోగ్యంతో అతను మరణించడం సగటు ప్రేక్షకుడి గుండెను పిండేస్తుంది. ఇళయరాజా అద్భుతమైన సంగీతం, జంధ్యాల గారి మార్క్ సంభాషణలు, కమల్ హాసన్ విశ్వరూపం ఈ సినిమాను ఎప్పటికీ మరువలేని క్లాసిక్‌గా నిలబెట్టాయి. శరత్ బాబు, ఎస్.పి.శైలజ, మిశ్రో లాంటి నటీనటులు తమ పాత్రల్లో జీవించారు. ఒక వ్యక్తి విజయం వెనుకైనా, అపజయం వెనుకైనా ఒక బలమైన స్ఫూర్తిప్రదాత ఉంటారనే సత్యాన్ని ఈ చిత్రం మనకు బోధిస్తుంది. ఇలాంటి సినిమాలు గతంలో కొన్ని మాత్రమే వచ్చాయి. భవిష్యత్తులో వస్తాయన్న నమ్మకం లేదు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story