Sai Pallavi: ఇకపై ఆచితూచి మాట్లాడతా.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!
Sai Pallavi: వరుస వివాదాలు, ట్రోలింగ్‌పై నటి సాయిపల్లవి అత్యంత పరిపక్వతతో స్పందించారు.
Sai Pallavi: ఇకపై ఆచితూచి మాట్లాడతా.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!
Sai Pallavi Ramayana: వెండితెరపై సహజ నటనతో కోట్లాదిమంది సినీ ప్రేమికుల మనసు గెలుచుకున్న కథానాయిక సాయిపల్లవి. గ్లామర్ హంగుల కంటే పాత్రలోని గాఢతకే ప్రాధాన్యమిచ్చే ఈ టాలెంటెడ్ బ్యూటీ టాలీవుడ్లో ‘ఫిదా’ మొదలుకొని ‘తండేల్’ వరకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు.
అయితే వెండితెరపై ఎంతటి పరిణతి కనబరుస్తారో, తెరవెనుక మాట్లాడే మాటల విషయంలో మాత్రం పలుమార్లు అనవసర వివాదాల్లో చిక్కుకోవడం ఆమెకు అలవాటుగా మారింది. వరుస విమర్శల నేపథ్యంలో ఎట్టకేలకు ఆమె ఆత్మపరిశీలన చేసుకున్నారు. తన మనసులోని భావాలను వ్యక్తపరిచే విధానంలో లోపం ఉందని గ్రహించి ఇకపై ప్రతి మాటనూ ఆచితూచి మాట్లాడతానని స్పష్టం చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గతంలో ‘విరాటపర్వం’ ప్రమోషన్ల సమయంలో హింస గురించి మాట్లాడుతూ కశ్మీరీ పండిట్ల అంశాన్ని ప్రస్తావించడం పెద్ద దుమారానికే దారితీసింది. ఆ తర్వాత భారత సైన్యంపై గతంలో ఆమె చేసిన వ్యాఖ్యల తాలూకు పాత వీడియోలు తెరపైకి వచ్చి నెట్టింట తీవ్ర చర్చకు తావిచ్చాయి.
ఇక తాజాగా నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, కన్నడ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ప్రమోషన్ల వేళ కూడా ఇదే పునరావృతమైంది. అంతర్గత శత్రువులను జయించాలనే తాత్విక కోణంలో రావణుడిపై ఆమె చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదంగా మారాయి. పీఆర్ బృందాల ప్రమేయం లేకుండా మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఆమె నైజం ట్రోలింగ్‌కు కారణమవుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ సాయిపల్లవి అత్యంత పరిపక్వతతో కూడిన సమాధానం ఇచ్చారు. తనలో మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యం ఏమిటన్న ప్రశ్నకు.. సరిగ్గా భావాలను వ్యక్తపరచడమే అని నిస్సంకోచంగా అంగీకరించారు.
నా మనసులో ఉన్న ఆలోచనలను మాటల రూపంలో ఎదుటివారికి స్పష్టంగా చెప్పడం నాకు సరిగ్గా రాదు. దానివల్ల నేను చెప్పాలనుకున్న విషయం వేరొక అర్థాన్ని ఇస్తూ గందరగోళానికి దారితీస్తోంది. గుర్తింపు ఉన్న నటిగా నా ప్రతి మాటకు విస్తృత ప్రచారం దక్కుతుంది కాబట్టి నన్ను నేను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపై మాట్లాడే నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటాను అని సాయిపల్లవి పేర్కొన్నారు.
తన మాటల వల్ల ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాస్తవాన్ని ఒప్పుకుంటూ ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పులను తెలుసుకొని సరిదిద్దుకునే వ్యక్తిత్వమే ఆమెను మరింత ఉన్నత స్థానంలో నిలబెడుతుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
దీపావళి కానుకగా ‘రామాయణ: పార్ట్ 1’ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతున్న తరుణంలో సాయిపల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టి తన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకుంటానని ఆమె ప్రకటించడం సినిమాకు సానుకూల వాతావరణాన్ని తెచ్చిపెట్టింది. వివాదాలు పక్కకు వెళ్లి సీతాదేవిగా ఆమె చూపించబోయే దివ్యమైన నటన కోసం సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




