Salim Kumar Passes Away : సినీ పరిశ్రమలో విషాదం.. టాప్ కమెడీయన్ కన్నుమూత

Salim Kumar Passes Away : మలయాళ చిత్ర పరిశ్రమ ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది. తన విలక్షణమైన నటనతో, హాస్యంతో మూడు దశాబ్దాల పాటు ప్రేక్షకులను..

G Krishna
Published on: 7 Jun 2026 10:24 AM IST
Salim Kumar Passes Away
X

Salim Kumar Passes Away 

Salim Kumar Passes Away : మలయాళ చిత్ర పరిశ్రమ ఒక అద్భుతమైన నటుడిని కోల్పోయింది. తన విలక్షణమైన నటనతో, హాస్యంతో మూడు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు సలీం కుమార్ శనివారం రాత్రి కన్నుమూశారు. 300కు పైగా చిత్రాలలో నటించి, మలయాళ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా మారింది.

న్యూమోనియాతో పోరాడుతూ చివరి శ్వాస

సలీం కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు కాలేయ మార్పిడి (లివర్ ట్రాన్స్‌ప్లాంట్) శస్త్రచికిత్స కూడా జరిగింది. తాజాగా శనివారం నాడు ఆయనకు న్యూమోనియా సోకడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి, వెంటిలేటర్ సహాయంతో చికిత్స అందించారు. అయితే పరిస్థితి మరింత క్షీణించడంతో శనివారం రాత్రి 10:43 గంటల ప్రాంతంలో ఆయన చివరి శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ఆయనకు భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

'నన్ను ఏడిపించావు సోదరా' అంటూ కన్నీటి పర్యంతమైన మమ్ముట్టి

సలీం కుమార్ మరణవార్త తెలియగానే కేరళ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అత్యంత భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. నవ్వుతూ ఇతరులను నవ్వించావు, ఆలోచిస్తూ ఇతరులను ఆలోచింపజేశావు, అప్పుడప్పుడు ఏడుస్తూ ఇతరులను ఏడిపించావు, కానీ సలీం, ఈ రోజు నువ్వు నన్ను ఏడ్చేలా చేసి వెళ్లిపోయావు, నీ వీడ్కోలు నాకు ఎప్పటికీ తీరని శోకం అంటూ మమ్ముట్టి ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ కూడా సలీం కుమార్ మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ, ఆయన కేవలం నవ్వుల రాజు మాత్రమే కాదని, ఒకే ముఖంతో నవ్వించగల, ఏడిపించగల అరుదైన ప్రతిభావంతుడని కొనియాడారు. దిలీప్, రమేష్ పిషారోడి, నాదిర్షా వంటి పలువురు నటులు ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు.

టెలివిజన్ యాంకర్‌గా మొదలై స్టార్ కమెడియన్‌గా ఎదిగిన ప్రస్థానం

సలీం కుమార్ తన కెరీర్‌ను టెలివిజన్‌లో 'కామికోలా' అనే కామెడీ షో ద్వారా యాంకర్‌గా ప్రారంభించారు. ఆ తర్వాత 1997లో 'ఇష్టమాను నూరు వట్టం' అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 2000 సంవత్సరంలో విడుదలైన 'తెన్కాసిపట్టణం' సినిమా ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత నటుడు దిలీప్‌తో కలిసి చేసిన 'ఈ పరక్కుం తాళికా', 'మీసా మాధవన్' వంటి చిత్రాలు ఆయనను మలయాళంలో మోస్ట్ పాపులర్ కమెడియన్‌గా నిలబెట్టాయి. అయితే సలీం కుమార్ కేవలం కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా, తనలోని నటనను విశ్వరూపంగా చూపిస్తూ ఎమోషనల్ , క్యారెక్టర్ రోల్స్ కూడా అద్భుతంగా పండించి మెప్పించారు.

జాతీయ అవార్డులు , ఘనతలు

సలీం కుమార్ సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. 2010లో వచ్చిన 'ఆదామింతె మకన్ అబు' చిత్రంలో ఆయన చూపిన అద్భుత నటనకు గాను ప్రతిష్టాత్మక 'జాతీయ ఉత్తమ నటుడు' అవార్డు లభించింది. నటనతో పాటు ఆయన దర్శకుడిగా, రచయితగా కూడా రాణించారు. ఆయన దర్శకత్వం వహించిన 'కరుత జూతన్' చిత్రానికి గాను 2017లో కేరళ రాష్ట్ర ఉత్తమ కథా రచయిత అవార్డు దక్కింది. దీనితో పాటు 'అచనురంగత వీడు' చిత్రానికి కేరళ స్టేట్ సెకండ్ బెస్ట్ యాక్టర్ అవార్డును, అలాగే 2013లో బెస్ట్ టెలివిజన్ యాక్టర్ అవార్డును కూడా అందుకున్నారు. హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించినా, సీరియస్ పాత్రలతో కంటితడి పెట్టించినా అది కేవలం సలీం కుమార్‌కే సాధ్యమైంది. మలయాళ సినిమా చరిత్రలో ఆయన వదిలివెళ్లిన వారసత్వం రాబోయే తరాలకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story