సంధ్య థియేటర్ కేసులో అప్‌డేట్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్!

Sandhya Theater Stampede Case: హైదరాబాద్ సంధ్య థియేటర్ పుష్ప-2 తొక్కిసలాట కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

Arun Chilukuri
Published on: 22 Jun 2026 3:58 PM IST
సంధ్య థియేటర్ కేసులో అప్‌డేట్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్!
X

Sandhya Theater Stampede Case: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన పుష్ప-2 తొక్కిసలాట కేసుకు సంబంధించి సోమవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి 11వ నిందితుడిగా (ఏ11) ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్.. న్యాయమూర్తి ఎదుట వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లలో బిజీగా ఉన్న కారణంగా తనకు భౌతిక హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. దీనికి న్యాయస్థానం అంగీకరించడంతో, అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు.

ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టుకు ఖచ్చితంగా హాజరుకావాలని అల్లు అర్జున్‌తో పాటు మొత్తం 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇటీవల సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు నిందితులంతా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరుకాగా, మిగిలిన వారంతా నేరుగా కోర్టుకు వచ్చి నిబంధనల ప్రకారం బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేశారు.

సంధ్య థియేటర్ దుర్ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. ఏ1 నుండి ఏ10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులను ప్రధాన నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు జరిపిన పోలీసులు.. మొత్తం 23 మంది నిందితులపై కోర్టులో సమగ్ర ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేయడం గమనార్హం.

2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వేదికగా ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట (Stampede) చోటుచేసుకుంది. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story