Sonali Kulkarni: ఒంటరిగా గదికి రమ్మన్నాడు.. డైరెక్టర్ బండారం బయటపెట్టిన ‘ది ప్యారడైజ్’ బ్యూటీ

Sonali Kulkarni: సీనియర్ నటి సోనాలి కులకర్ణి తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ భయానక సంఘటనను బయటపెట్టారు.

Gagan kumar
Published on: 18 Oct 2026 5:09 PM IST
Sonali Kulkarni
X

Sonali Kulkarni: ఒంటరిగా గదికి రమ్మన్నాడు.. డైరెక్టర్ బండారం బయటపెట్టిన ‘ది ప్యారడైజ్’ బ్యూటీ

Sonali Kulkarni: సినీ ఇండస్ట్రీలో ఎంతటి ప్రతిభ ఉన్నా, సక్సెస్ సాధించాలన్నా ఎదురీత తప్పదు. అయితే, వెండితెర వెనుక జరిగే మోసాలు, చీకటి కోణాలపై అప్పుడప్పుడు వస్తున్న నిజాలు సినీ ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో నాని చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సీనియర్ నటి సోనాలి కులకర్ణి తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఆమె చెప్పిన షాకింగ్ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో సోనాలి కులకర్ణి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో ఏ విధంగా వేధింపులను ఎదుర్కొన్నానో వివరించారు. ఒక సినిమా అవకాశం కోసం నన్ను ఒక దర్శకుడు కలవమన్నాడు. అయితే ఆయన సెక్రటరీ ఫోన్ చేసి.. కలవడానికి వచ్చేటప్పుడు కచ్చితంగా చీర కట్టుకుని రావాలి, అలాగే ఎవరినీ వెంట తెచ్చుకోకుండా ఒంటరిగా రావాలి అని కండిషన్ పెట్టాడు అని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత నగరానికి దూరంగా ఉన్న ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న నకిలీ ఆఫీస్‌కు తనను రమ్మన్నారని, బయట నుంచి చూస్తే అది ఒక సాధారణ ఇల్లులా ఉందని తెలిపారు.

దర్శకుడు కథ చెబుతానని చెప్పి తనను ఒక ప్రత్యేక గదిలోకి పిలిచాడని సోనాలి పేర్కొన్నారు. కానీ, ఆ గదిలోకి వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన పరిణామం ఆమెను తీవ్ర భయాందోళనకు గురిచేసిందట. గదిలోకి వెళ్లిన వెంటనే అక్కడ కథ చెప్పడానికి టేబుల్, కుర్చీలు ఏమీ లేవు. కేవలం మధ్యలో ఒక మంచం మాత్రమే ఉంది. ఆ వాతావరణం చూసి నాకు ఒళ్లు గగుర్పొడిచింది. ఏదో తేడా కొడుతోందని క్షణంలో గ్రహించాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. 'నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను' అని చెప్పి అక్కడి నుంచి ఎలాగోలా బయటపడ్డాను అని సోనాలి కులకర్ణి చెప్పుకొచ్చింది.

ఆ అనాటి ఘటన తనను మానసికంగా ఎంతగానో కలచివేసిందని, ఆ సమయంలో తనకు తీవ్ర అసౌకర్యంగా అనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆ దర్శకుడు వేరే నటీమణులతో సినిమా తీసి విడుదల చేసినప్పటికీ.. అలాంటి వ్యక్తులతో కలిసి పనిచేసిన, పనిచేస్తున్న నటీనటులను తలుచుకుంటే తనకు ఇప్పటికీ బాధగా ఉంటుందని సోనాలి అన్నారు. గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే కామాంధుల చీకటి నిజాలను ఆమె ధైర్యంగా బయటపెట్టడం పట్ల నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎదిగే క్రమంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ఇలాంటి సంఘటనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.