'Shaque: Trust No One’.. పరిణీతి చోప్రా సస్పెన్స్ గేమ్ ఎలా ఉంది?
Shaque: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన తాజా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shock: Trust No One). స్వప్న మల్హోత్రా.
'Shaque: Trust No One’.. పరిణీతి చోప్రా సస్పెన్స్ గేమ్ ఎలా ఉంది?
Shaque: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన తాజా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘షాక్: ట్రస్ట్ నో వన్’ (Shock: Trust No One). స్వప్న మల్హోత్రా, సిద్ధార్థ్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌కు రెన్సిల్ డిసిల్వా దర్శకత్వం వహించారు. హిందీతో పాటు తెలుగులోనూ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ నెల 24 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ 7 ఎపిసోడ్ల థ్రిల్లర్, ఒక తల్లి ఆవేదనను, ఆమె చుట్టూ అల్లుకున్న నమ్మకద్రోహాలను అత్యంత ఆసక్తికరంగా తెరపైకి తీసుకొచ్చింది.
ఎనిమిదేళ్ల అన్వేషణ.. తల్లి కన్నీటి పోరాటం
శిమ్లాలో నివసించే అన్విత (పరిణీతి చోప్రా), అలోక్ (తాహిర్ రాజ్ భాసిన్) దంపతుల సంతోషకరమైన జీవితంలో ఊహించని తుఫాను వస్తుంది. అన్వితకు కాన్పు కాగా, డాక్టర్ భాస్కర్ (సుమిత్ వ్యాస్) హాస్పిటల్‌లో ఆమె పాప 'అపేక్ష'కు జన్మనిస్తుంది. అయితే, సీసీ కెమెరాలు పనిచేయని సమయంలో నర్స్ వేషంలో వచ్చిన ఒక అపరిచిత మహిళ ఆ పసికందును కిడ్నాప్ చేస్తుంది. ఎనిమిదేళ్లు గడిచినా, సిద్ధి అనే మరో పాప పుట్టినా.. అన్విత మాత్రం తన మొదటి కూతురు అపేక్ష బ్రతికే ఉందనే ఆశతో వెతుకుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఊరిలోకి కొత్తగా వచ్చిన గౌరవ్-సాక్షి దంపతుల పాప 'రియా'ను చూసిన అన్వితకు, ఆ పాపే తన అపేక్ష ఏమోనన్న అనుమానం బలపడుతుంది. అక్కడి నుంచి పోలీసు ఆఫీసర్ ఖురానా సహాయంతో అన్విత సాగించిన సత్యశోధనే ఈ సిరీస్ కథాంశం.
నమ్మకద్రోహాలు, క్షుద్రపూజలు.. ఆకట్టుకునే మలుపులు
కేవలం బిడ్డ అన్వేషణ మాత్రమే కాకుండా, అన్విత చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను బయటపెడుతూ దర్శకుడు కథనాన్ని ఎంతో వ్యూహాత్మకంగా నడిపించారు. అపేక్ష తిరిగొస్తే తన కొడుక్కి ప్రమాదమని భావించి అత్తగారు మాధురి చేసే క్షుద్రపూజలు, మరోవైపు భర్త అలోక్, స్నేహితురాలు శ్రేయ (హర్లీన్ సేథీ) రహస్యంగా సాగిస్తున్న అక్రమ సంబంధం లాంటి అంశాలు కథలో ఉత్కంఠను రెట్టింపు చేస్తాయి. ఒకవైపు అన్విత మనోస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నా, పసికందుగా పోయిన బిడ్డను గుర్తుపట్టగల తల్లి ప్రేమానురాగాలను నమ్మిన పోలీస్ ఆఫీసర్ ఖురానా పాత్ర కథకు ప్రధాన బలంగా నిలుస్తుంది.
ఎంగేజింగ్ కథనం.. ఊహకందని ట్విస్టులు
మొత్తం 7 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ ముగింపు (ఎపిసోడ్ బ్యాంగ్) తదుపరి ఎపిసోడ్‌పై విపరీతమైన ఆసక్తిని పెంచుతుంది. మూఢనమ్మకాలు, ప్రతీకారం, ఆశలు-వ్యామోహాలు మనుషులను ఎలాంటి దారుణాలకు ఒడిగట్టేలా చేస్తాయో ప్రెజెంట్ చేసిన తీరు మెప్పిస్తుంది. ప్రీ-క్లైమాక్స్ , క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని మలుపులు ఆడియన్స్‌ను స్క్రీన్‌కు కట్టిపడేస్తాయి. నిర్మాణ విలువలు, కెమెరా వర్క్, నేపథ్య సంగీతం సిరీస్ స్థాయిని పెంచాయి. ఒకటిరెండు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పటికీ, సస్పెన్స్ థ్రిల్లర్స్ , ఎమోషనల్ డ్రామాలను ఆస్వాదించే ఓటీటీ ప్రియులకు 'షాక్: ట్రస్ట్ నో వన్' ఖచ్చితంగా ఒక మంచి వాచ్ అని చెప్పవచ్చు.




