Shekhar Master: అయ్యప్ప దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాం.. కారు యాక్సిడెంట్‌పై స్పందించిన శేఖర్ మాస్టర్!

Shekhar Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 12 Nov 2026 4:33 PM IST
Shekhar Master
X

Shekhar Master: అయ్యప్ప దయవల్ల ప్రాణాలతో బయటపడ్డాం.. కారు యాక్సిడెంట్‌పై స్పందించిన శేఖర్ మాస్టర్!

Shekhar Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆయనతో పాటు కారులో ఉన్న మరో ముగ్గురు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ షూటింగ్‌లో భాగంగా నైట్ షూటింగ్ ముగించుకుని శేఖర్ మాస్టర్ తన బృందంతో కలిసి కారులో తిరిగి వస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ వద్దకు చేరుకోగానే.. తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన పండ్ల లోడు లారీ వీరి కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంపై శేఖర్ మాస్టర్ స్వయంగా ఒక వీడియో సందేశం ద్వారా స్పందించారు. "కాకా సాంగ్ షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తుంటే తెల్లవారుజామున 6 గంటలకు కారు యాక్సిడెంట్ అయింది. కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో కారులో మేము నలుగురం ఉన్నాం.. ఇటీవలే అయ్యప్ప స్వామి మాల ధరించాను. అయ్యప్ప దయ, స్వామివారి ఆశీస్సుల వల్లే మాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు" అని భావోద్వేగంతో తెలిపారు.

తనకు ఫోన్లు చేసి, ఏమైందని ఆరా తీస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను, తనతో పాటు ఉన్నవారంతా క్షేమంగా ఉన్నామని, ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ప్రమాదం జరిగినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా.. "ఈరోజు రాత్రికి కూడా షూటింగ్ ఉంది, దానికి బయల్దేరుతున్నాను" అని శేఖర్ మాస్టర్ పేర్కొనడం విశేషం. ఆయన క్షేమంగా బయటపడటంతో టాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.