Tollywood Monopoly: సీఎం రేవంత్ రెడ్డి, పీవీఆర్, ఫిల్మ్ చాంబర్‌కు నోటీసులిచ్చిన యంగ్ హీరో!
Tollywood Monopoly: ‘బాద్మాష్ పొట్టే’ ప్రీ-రిలీజ్ వేడుకలో టాలీవుడ్ గుత్తాధిపత్యం, బంధుప్రీతిపై నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tollywood Monopoly: సీఎం రేవంత్ రెడ్డి, పీవీఆర్, ఫిల్మ్ చాంబర్‌కు నోటీసులిచ్చిన యంగ్ హీరో!
Sheraz Mehdi: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇండస్ట్రీలో కొందరి గుత్తాధిపత్యం, బంధుప్రీతి వల్ల చిన్న నిర్మాతలు బలైపోతున్నారంటూ ‘ఓ అందాల రాక్షసి’ ఫేమ్, నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, బడా మల్టీప్లెక్స్ సంస్థలైన పీవీఆర్, ఐనాక్స్, తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు కూడా తాను తుది నోటీసులు జారీ చేసినట్లు ప్రకటించి ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించారు.
హైదరాబాదీ హిందీ చిత్రం ‘బాద్మాష్ పొట్టే’ ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఫరూఖ్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన షెరాజ్ మెహదీ.. ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ఇండస్ట్రీలోని చీకటి కోణాలపై గళమెత్తారు.
చిన్న సినిమాలను థియేటర్లలోకి రాకుండా అడ్డుకుంటున్న వారిపై గత ఏడాదిన్నరగా తాను న్యాయపోరాటం చేస్తున్నానని షెరాజ్ తెలిపారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్, మరియు తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు కూడా ఫైనల్ నోటీసులు ఇచ్చానని స్పష్టం చేశారు. తన పోరాటం ఇప్పటికే 90 శాతం పూర్తయిందని, చిన్న నిర్మాతలకు న్యాయం జరిగే వరకు తగ్గే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
పరిశ్రమలో కొందరి ఆధిపత్యం, నెపోటిజం అంటే బంధుప్రీతి కారణంగా టాలెంట్ ఉన్న కొత్త దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు అవకాశాలు రావడం లేదని షెరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుండటం వల్ల, మంచి కథలు ప్రేక్షకులకు దూరమవుతున్నాయని మండిపడ్డారు.
ఇదే వేదికపై తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి షెరాజ్ మెహదీ ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ఇతర చిన్న రాష్ట్రాలు సైతం సినిమాలకు సబ్సిడీలు ఇస్తుంటే, ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలకు సరైన సబ్సిడీ విధానం లేకపోవడం విచారకరమన్నారు.
సినిమా విడుదలయ్యాక నష్టాలు వస్తే కనీసం 20 నుంచి 30 శాతం వరకు రికవరీ అయ్యేలా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కోరారు. అంతేకాదు, తెలుగు సినిమాలతో పాటు హైదరాబాద్ కేంద్రంగా రూపొందే దక్కనీ, హైదరాబాదీ హిందీ చిత్రాలకు కూడా సమానంగా ప్రభుత్వ రాయితీలు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఇక తాను సాధారణంగా సినిమా ఫంక్షన్లకు రానని, కానీ దర్శకుడు ఫరూఖ్ ఖాన్‌కు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ చూసే ఇక్కడికి వచ్చానని షెరాజ్ చెప్పారు. ఫరూఖ్ ఖాన్ లుక్ చూస్తుంటే బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ గుర్తుకొస్తున్నారని సరదాగా కామెంట్ చేశారు. గతంలో ‘అంగ్రేజ్’, ‘హైదరాబాదీ నవాబ్స్’, ‘గుల్లు దాదా’ లాంటి సినిమాలు సాధించిన బ్లాక్ బస్టర్ విజయాన్ని ‘బాద్మాష్ పొట్టే’ కూడా అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.




