Shruti Haasan: మగవాళ్లకు పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ సంచలన కామెంట్స్

Shruti Haasan: నటి శ్రుతి హాసన్ పీరియడ్స్ సమయంలో పడ్డ ఇబ్బందులు, పీసీఓఎస్ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడారు.

Gagan kumar
Published on: 19 Sept 2026 10:35 AM IST
Shruti Haasan
X

Shruti Haasan: మగవాళ్లకు పీరియడ్స్ రావాలి.. శ్రుతి హాసన్ సంచలన కామెంట్స్

Shruti Haasan: సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ తారగా, అగ్ర నటిగా ఒక వెలుగు వెలుగుతున్న తార శ్రుతి హాసన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా గాయనిగా, స్వరకర్తగానూ రాణిస్తున్న ఈ బ్యూటీ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ప్రసిద్ధ పాడ్‌కాస్ట్ ఆల్ అబౌట్ హర్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నిర్మొహమాటంగా పంచుకున్నారు. తనకు పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్* సమస్య ఉందని, దీనివల్ల పీరియడ్స్ సమయంలో తాను తీవ్రమైన నరకం అనుభవించానని వెల్లడించారు.

చిన్న వయసు నుంచే పీరియడ్స్ తనకు ఎంతో బాధాకరంగా ఉండేవని ఆమె గుర్తుచేసుకున్నారు. కొన్నిసార్లు విపరీతమైన కడుపునొప్పి, వాంతులు, చివరకు స్పృహ కోల్పోయే స్థాయికి పరిస్థితి వెళ్లేదని, పలుమార్లు ఆసుపత్రిపాలయ్యానని చెప్పుకొచ్చారు. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ సమస్య ఆమెకు మరింత సవాలుగా మారిందట. కెమెరా ముందు నవ్వుతూ నటించాల్సి వస్తున్నప్పటికీ, తెరవెనుక ఆమె పడుతున్న వేదన అంతా ఇంతా కాదు.

షూటింగ్స్‌లో యాక్షన్ సన్నివేశాలు చేసే సమయంలో తీవ్రమైన కడుపునొప్పి ఉన్నా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోయేదాన్ని. ఏదైనా సమస్య అని చెబితే బలహీనురాలిగా చూస్తారనే భయంతో దాన్ని దాచుకునేదాన్ని. కానీ, అలా చేయడం వల్ల నేను ఎందుకు డల్‌గా ఉంటున్నానో సహనటులకు, చిత్ర యూనిట్‌కు అర్థం కాకపోయేది అని శ్రుతి భావోద్వేగానికి గురయ్యారు.

కాలక్రమేణా ఆమె ఆలోచనలో మార్పు వచ్చింది. ఒకసారి తనతో పనిచేస్తున్న తోటి ఆర్టిస్ట్‌కు సర్జరీ జరగగా, సినిమా మేకర్స్ అతనికి అండగా నిలిచి షూటింగ్ షెడ్యూల్స్‌ని సైతం మార్చడాన్ని ఆమె గమనించారు. దీంతో ధైర్యం తెచ్చుకున్న శ్రుతి.. ఒకసారి తన పీరియడ్స్ సమస్య గురించి ఓ దర్శకుడికి ఓపెన్‌గా వివరించారట. ఆ దర్శకుడికి కూతురు ఉండటంతో ఆమె పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకుని ఎంతో సానుకూలంగా స్పందించారు. అప్పట్నుంచి తన సమస్యలను దాచుకోవడం మానేసి, అవసరమైనప్పుడు ధైర్యంగా చెప్పడం ప్రారంభించానని శ్రుతి తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో శ్రుతి హాసన్ మగవాళ్లపై చేసిన వ్యాఖ్యలు తెగ నవ్విస్తున్నాయి. ఒకవేళ పురుషులకు కూడా పీరియడ్స్ వస్తే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చంటూ ఆమె సరదాగా సెటైర్లు వేశారు. మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుంది. ఒకవేళ అలా జరిగితే... హీరోయిన్లతో కుదుర్చుకునే కాంట్రాక్టుల్లో పీరియడ్స్ సెలవుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, ఆ రోజుల్లో వారికి కచ్చితంగా హాలిడేస్ ఇచ్చే ఏర్పాట్లు చేసేవారేమో అంటూ ఆమె నవ్వులు పూయించారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.