Singer Mangli: మరో వివాదంలో ఇరుక్కున్న మంగ్లీ

Singer Mangli: సింగర్ మంగ్లీ ఆలపించిన నయా బోనాల పాట 'తీరు తీరు తొట్టెళ్ల' పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.

Naresh.k
Published on: 25 July 2026 10:16 AM IST
Singer Mangli
X

Singer Mangli: మరో వివాదంలో ఇరుక్కున్న మంగ్లీ 

Singer Mangli Bonalu Song: తెలంగాణ సంస్కృతికి, పండుగలకు స్పెషల్ సాంగ్స్ అనగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చే పేరు సింగర్ మంగ్లీ. బోనాలు, బతుకమ్మ, శివరాత్రి.. పండుగ ఏదైనా మంగ్లీ గొంతు కలవాల్సిందే. ఒకప్పుడు ఆమె నుంచి కొత్త పాట వస్తోందంటే చాలు, యూట్యూబ్‌లో ప్రోమోలకే మిలియన్ల కొద్దీ వ్యూస్ కురిసేవి. వినాయక చవితి నుంచి బోనాల వరకు ఆమె పాటల కోసం శ్రోతలు అంతగా ఎదురుచూసేవారు. కానీ, ఈసారి బోనాల పండుగ సందర్భంగా విడుదలైన నయా సాంగ్‌కి మాత్రం ప్రశంసల కంటే నెటిజన్ల నుండి ట్రోలింగ్ ఎక్కువుగా ఎదురవుతుండటం చర్చనీయాంశంగా మారింది.

బోనాల పండుగను పురస్కరించుకుని మంగ్లీ ఆలపించిన ‘తీరు తీరు తొట్టెళ్ల’ పాట ఇటీవల విడుదలైంది. సాధారణంగా అయితే ఈ పాటకు భారీ రెస్పాన్స్ రావాల్సి ఉంది. కానీ, సోషల్ మీడియాలో కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే అంతా ప్రతికూల వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. నెటిజన్లు కొందరు దారుణమైన పదజాలంతో కామెంట్లు చేస్తూ, ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవల మంగ్లీ పేరు ఒక ప్రముఖ స్కామ్‌తో ముడిపడి వార్తల్లోకి వచ్చింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవడంతో, ఆ ప్రభావం ఇప్పుడు ఆమె కొత్త పాటపై పడింది.ఆ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిర్దోషినని మంగ్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం శాంతించడం లేదు.చట్టపరంగా లేదా విచారణాధికారుల ద్వారా ఆ స్కామ్‌లో మంగ్లీ దోషి అని ఎక్కడా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆమెపై దొంగ మంగ్లీ అంటూ నెగెటివ్ కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.

తనపై వస్తున్న ఈ ట్రోల్స్ తుఫానుపై మంగ్లీ ప్రస్తుతం పెద్దగా స్పందించడం లేదు. కామెంట్లను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ఒక కళాకారిణిగా పండుగ వాతావరణాన్ని నింపేందుకు పాటలు చేయడం ఆమె బాధ్యత అయితే, ఆధారాలు లేకుండా కేవలం పుకార్ల ఆధారంగా ట్రోల్ చేయడం సరైంది కాదని ఆమె అభిమానులు, మద్దతుదారులు వాదిస్తున్నారు. ఏది ఏమైనా, ఒకప్పుడు వ్యూస్ రికార్డులు సృష్టించిన మంగ్లీ బోనాల పాట.. ఇప్పుడు ఇలా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం సంగీత ప్రియులను విస్మయానికి గురిచేస్తోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story