నో చెప్తే ఛాన్సులు పోతాయి.. ఎస్ చెప్తే ఇంకో 4 సినిమాలు వస్తాయి.. టాలీవుడ్ సీక్రెట్స్ బయటపెట్టిన సునీత!
Singer Sunitha: టాలీవుడ్ పాపులర్ ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.
Singer Sunitha: నో చెప్తే ఛాన్సులు పోతాయి.. ఎస్ చెప్తే ఇంకో 4 సినిమాలు వస్తాయి.. టాలీవుడ్ సీక్రెట్స్ బయటపెట్టిన సునీత!
Singer Sunitha: టాలీవుడ్ పాపులర్ ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. సినిమా పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాలు, మహిళల భద్రత, గ్లామర్ పేరిట జరుగుతున్న మితిమీరిన అశ్లీలత మరియు హీరోయిన్ల మైండ్‌సెట్‌పై కుండబద్దలు కొట్టారు. పరిశ్రమలో ఒక స్టార్ సింగర్ స్థాయి నుంచి ఆమె పంచుకున్న వాస్తవాల పూర్తి కథ ఇది.
సినిమా రంగంలో మహిళల రక్షణ గురించి సునీత అత్యంత నిజాయితీగా మాట్లాడారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో, కేవలం 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కొన్ని చేదు అనుభవాలు, అసౌకర్యకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని ఆమె అంగీకరించారు. అయితే, మీడియా ముందుకు వచ్చి పేర్లు చెప్పడం వల్ల సమస్య ముగిసిపోదని, ఇది పరిశ్రమలో ఎంతో మంది మహిళలు రోజూ ఎదుర్కొంటున్న దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి ఒకరి దగ్గర విద్యావంతుడిగా నటిస్తూ, మరో మహిళ దగ్గర అసభ్యకరంగా ప్రవర్తించే ద్వంద్వ వైఖరి ఇండస్ట్రీలో ఎక్కువగా ఉందని ఆమె ఎండగట్టారు.
ఇటీవల జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' సినిమాలో కొన్ని వివాదాస్పద సీన్లు, దానిపై వచ్చిన ట్రోలింగ్‌ను సునీత పరోక్షంగా ప్రస్తావించారు. కొత్తగా వచ్చే అమ్మాయిలు అవకాశాల కోసం, భవిష్యత్తు భయంతో లేదా ఆర్థిక అవసరాల కోసం డైరెక్టర్లు చెప్పే బోల్డ్ సీన్లకు 'ఎస్' చెబుతారని, ఒకవేళ 'నో' చెప్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమని ఆమె ప్రాక్టికల్ విషయాలను వివరించారు.
కానీ, ఒక స్థాయికి ఎదిగి, పేరు మరియు పవర్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లు కూడా ఇటువంటి పాత్రలకు, వస్త్రధారణకు ఒప్పుకుంటున్నారు అంటే మాత్రం కచ్చితంగా వాళ్లు తమ ఇష్టానుసారమే స్క్రీన్‌పై అలా కనిపిస్తున్నారని సునీత స్పష్టం చేశారు.
సినిమాలు రిలీజ్ అయ్యాక ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చినప్పుడు కొందరు హీరోయిన్లు ప్రవర్తించే తీరును సునీత తీవ్రంగా తప్పుపట్టారు. "స్క్రిప్ట్ ఏంటో, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నామో హీరోయిన్లకు ముందే తెలుసు. ట్రోలింగ్ జరిగినప్పుడు.. 'అవును నేను చేశాను, పొరపాటు జరిగింది' అని ఒప్పుకుంటే పద్ధతిగా ఉంటుంది. అలా కాకుండా.. 'ఓ మై గాడ్! నన్ను అలా చూపించారేంటి? నా గురించి ఇలా మాట్లాడుతున్నారేంటి?' అని ఏడవడం కేవలం విక్టిమ్ కార్డ్ (బాధితరాలిగా నటించడం) వాడటమే అవుతుంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆధునిక సమాజంలో మహిళల స్వేచ్ఛ, ఫెమినిజం గురించి వస్తున్న కొన్ని వాదనలపై సునీత భిన్నమైన కోణాన్ని లేవనెత్తారు. అమ్మాయిలు ‘నా బాడీ.. నా ఇష్టం’ (My Body My Right) అని వాదించినప్పుడు.. దానికి కౌంటర్‌గా 'చూసేవాడి కళ్లు వాడి ఇష్టం' అనే పరిస్థితి కూడా వస్తుందని, తన దృష్టిలో అది అసలైన ఫ్రీడమ్ కానే కాదని అన్నారు.
సినిమా అనే మాధ్యమం ద్వారా సమాజంలో బూతులు మాట్లాడటాన్ని, అశ్లీలతను నార్మలైజ్ చేస్తున్నారని.. కమర్షియల్ సినిమాలైనా సరే సమాజం పట్ల డైరెక్టర్, రైటర్, యాక్టర్స్ అందరికీ ఖచ్చితంగా సామాజిక బాధ్యత ఉండాలని సునీత గట్టిగా డిమాండ్ చేశారు. ప్రస్తుతం సునీత చెప్పిన ఈ కఠిన నిజాలు టాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీశాయి.




