Sobhan Babu: అక్కినేని హిట్ కొట్టిన సినిమాతో శోభన్‌బాబుకు ప్లాప్...కారణమిదే
తెలుగు సినిమా చరిత్రలో 'నటభూషణ' శోభన్ బాబు, 'మూవీ మొఘల్' రామానాయుడులది విడదీయలేని అనుబంధం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన 'సోగ్గాడు', 'జీవన తరంగాలు', 'దేవత' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
Sobhan Babu తెలుగు సినిమా చరిత్రలో 'నటభూషణ' శోభన్ బాబు, 'మూవీ మొఘల్' రామానాయుడులది విడదీయలేని అనుబంధం. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వచ్చిన 'సోగ్గాడు', 'జీవన తరంగాలు', 'దేవత' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అందరూ శోభన్‌బాబును నటభూషణుడు అని పిలిస్తే రామానాయుడు మాత్రం రాజా అని చనువుగా సంబోధించేవాడు. మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన ఈ సంస్థ వద్ద శోభన్‌భాబు డేట్స్ ఉండటంతో 1985లో 'మాంగల్య బలం' అనే సినిమాను తీశారు. అనూహ్యంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. శోభన్ బాబు కెరీర్‌లో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. దీనికి ప్రధాన కారణం ఒక క్లాసిక్ సినిమా కథను తిరగేసి తీయడమే. కథ వినే సమయంలో హిట్ మూవీ కథ అని గుర్తుపట్టలేకపోయినా...షూటింగ్ సమయంలో గుర్తుకు వచ్చినా లాభం లేకపోయింది.
డేట్స్ వృథా కాకూడదని..
నిర్మాత రామానాయుడికి ఒక అలవాటు ఉండేది. హీరో డేట్స్ ఇచ్చారంటే, ఆ సమయాన్ని అస్సలు వృథా చేయకుండా ఏదో ఒక సినిమా పట్టాలెక్కించేవారు. అలా శోభన్ బాబు డేట్స్ ఉండటంతో, ప్రముఖ తమిళ రచయిత గుహనాథన్‌ను పిలిచి ఒక మంచి కథ సిద్ధం చేయమన్నారు. గుహనాథన్ చెప్పిన 'ట్రయాంగిల్ లవ్ స్టోరీ' నచ్చడంతో, 1984 సెప్టెంబర్ 8న సినిమా షూటింగ్ ప్రారంభించారు. జయసుధ, రాధిక హీరోయిన్లుగా బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సినిమా శరవేగంగా పూర్తయింది.
సగం సినిమా అయ్యాక తెలిసిన చేదు నిజం
సినిమా చిత్రీకరణ దాదాపు 60% పూర్తయ్యాక రామానాయుడికి ఒక షాకింగ్ విషయం తెలిసింది. గుహనాథన్ చెప్పిన కథ కొత్తదేమీ కాదు. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్‌లో 1965లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'మనసే మందిరం' కథనే చిన్న మార్పులు చేసి చెప్పారని అర్థమైంది. మనసే మందిరం జినిమాలో హీరోకి క్యాన్సర్ ఉంటే మాంగల్యబలం సినిమాలో హీరోయిన్‌కి క్యాన్సర్ ఉన్నట్టుగా మార్చారు. మరో విశేషమేమంటే మనసే మందిరంలోని మగ పాత్రలను మాంగల్యబలం సినిమాలో ఆడ పాత్రలుగా, ఆడపాత్రలను మగపాత్రలుగా మార్చారు. కథను కొంచెం అటూఇటూ మార్చి ఎవరికీ అనుమానం కలుగకుండా కథను సిద్దం చేసి రామానాయుడికి వినిపించారు. కథలను పసిగట్టడంలో దిట్ట అయిన రామానాయుడు కూడా గుర్తించలేకపోయాడు. అంతలా మెస్మరైజ్ చేశాడు రచయిత గుహనాథన్.
తిరగబడిన ఫలితం
అక్కినేని నటించిన 'మనసే మందిరం' అప్పట్లో సంచలన విజయం సాధించింది. కానీ, అదే ఫార్ములాను శోభన్ బాబు మీద ప్రయోగించేసరికి ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. ఇద్దరు భార్యల భర్తగా, మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న శోభన్ బాబుకు ఈ 'రివర్స్' సెంటిమెంట్ కథ సెట్ కాలేదు. ఫలితంగా అక్కినేనికి హిట్ ఇచ్చిన కథ, శోభన్ బాబుకు మాత్రం ప్లాప్‌ను మిగిల్చింది. ఎంతటి దిగ్గజ నిర్మాతలైనా, రచయితల మాటల గారడీలో పడితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి 'మాంగల్య బలం' ఒక నిదర్శనం. నేటికీ సినీ విశ్లేషకులు ఈ చిత్రాన్ని ఒక 'రాంగ్ ఎక్స్‌పెరిమెంట్'గా గుర్తు చేసుకుంటారు. ఫలితం ఎలా ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటికి తావు ఇవ్వకూడదు అని చెప్పడానికి ఈ సినిమాను ఒక ఉదాహరణగా తీసుకున్నారు.




