Sree Vishnu: అమీర్‌పేట్ సెంటర్‌లో బట్టలు విప్పాల్సిన అవసరం లేదు.. శ్రీవిష్ణు సెటైర్లు!

Sree Vishnu: 'కామ్రేడ్ కళ్యాణ్' ఈవెంట్‌లో శ్రీవిష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. హిట్ కోసం అమీర్‌పేట్‌లో పబ్లిసిటీ స్టంట్స్ అవసరం లేదన్నారు.

Ravi
By Ravi
Published on: 6 Sept 2026 4:38 PM IST
Sree Vishnu
X

Sree Vishnu: అమీర్‌పేట్ సెంటర్‌లో బట్టలు విప్పాల్సిన అవసరం లేదు.. శ్రీవిష్ణు సెటైర్లు!

Sree Vishnu: టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. తనదైన కామెడీ టైమింగ్, సహజ నటనతో ప్రేక్షకులను అలరించే శ్రీవిష్ణు, తాజాగా తన కొత్త సినిమా 'కామ్రేడ్ కళ్యాణ్' ప్రమోషనల్ ఈవెంట్‌లో పరోక్షంగా కొందరు నటీనటులపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. సినిమా ప్రమోషన్ల కోసం ఈమధ్య కాలంలో కొందరు చేస్తున్న విచిత్రమైన సవాళ్లు, పబ్లిసిటీ స్టంట్లపై ఆయన ముక్కుసూటిగా స్పందించారు.

'కామ్రేడ్ కళ్యాణ్' చిత్ర టీజర్ లాంచ్ వేడుకలో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. సినిమా హిట్ కోసం విచిత్రమైన స్టేట్‌మెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. "నా సినిమా హిట్ అవ్వకపోతే అమీర్‌పేట్ సెంటర్‌లో బట్టలిప్పి తిరుగుతాను లాంటి సవాళ్లు నేను చేయలేను. వాటి అవసరం కూడా లేదు. నిజాయితీగా ఒక మంచి కథను ప్రేక్షకులకు అందిస్తే చాలు. ఆ కథలో నిజంగా బలం ఉంటే, ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాను సూపర్ హిట్ చేస్తారు" అని ఆయన చెప్పుకొచ్చారు. పబ్లిసిటీ కోసం అడ్డదారులు తొక్కడం కంటే కంటెంట్ మీద నమ్మకం ఉంచాలని ఆయన సూచించారు. శ్రీవిష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు నేరుగా 'సహ' మూవీ యూనిట్‌ను ఉద్దేశించే అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇటీవల విడుదలైన 'సహ' అనే చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆ చిత్ర హీరోయిన్ శ్వేత ఒక సంచలన సవాల్ విసిరింది. తమ సినిమా చూసి ఆడియన్స్ ఎవరైనా డిసప్పాయింట్ అయితే, తాను నేరుగా అమీర్‌పేట్ సెంటర్‌లో నిలబడి గుండు గీయించుకుంటానని ఆమె బహిరంగంగా ప్రకటించింది. అలాగే ఆ సినిమా హీరో కూడా పబ్లిక్‌గా తన ఫోన్ నెంబర్ ఇచ్చి, సినిమా బాలేకపోతే ఫోన్ చేసి తిట్టండని చెప్పుకొచ్చాడు. అయితే సెప్టెంబర్ 4న విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమైంది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, లాజిక్ లేని సీన్స్ ఉన్నాయని ప్రేక్షకులు పెదవి విరిచారు. గుండు గీయించుకుంటానన్న సవాల్ విసిరిన హీరోయిన్ శ్వేతను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అమీర్‌పేట్ సెంటర్‌కు ఎప్పుడొస్తున్నావు అంటూ కామెంట్లతో ఆమెను ఆడేసుకుంటున్నారు. ఈ ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీవిష్ణు సెటైర్లు వేశారని నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది.

ఇక శ్రీవిష్ణు హీరోగా వస్తున్న 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. 1992 నాటి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఇందులో శ్రీవిష్ణు ఒక మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ పాత్రలో నవ్వులు పూయించనున్నారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ సినిమాను వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ నిర్మాణానికి మేకర్స్ సుమారు రూ. 15 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. శ్రీవిష్ణు మార్క్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story