Varanasi: హాలీవుడ్ బ్యూటీతో మహేష్ బాబు రొమాన్స్.. అంటార్కిటికాలో ‘వారణాసి’ అరుదైన రికార్డ్!

Varanasi: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో బ్రిటిష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ కీలక పాత్ర.

Gagan kumar
Updated on: 5 Oct 2026 12:54 PM IST
Varanasi
X

Varanasi: హాలీవుడ్ బ్యూటీతో మహేష్ బాబు రొమాన్స్.. అంటార్కిటికాలో ‘వారణాసి’ అరుదైన రికార్డ్!

Mahesh Babu Varanasi: భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అత్యంత భారీ ప్రాజెక్ట్‌లలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘వారణాసి’ చిత్రం ముందుంది. పాన్ వరల్డ్ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై రోజుకో ఆసక్తికర వార్త టాలీవుడ్‌‌లో ట్రెండ్ అవుతోంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వినిపిస్తున్న కొన్ని విశేషాలు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చుతున్నాయి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ చిత్రంలో ప్రధాన కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమెతో పాటు మరో ప్రముఖ బ్రిటిష్ నటి డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు, డైసీల మధ్య వచ్చే కొన్ని ప్రత్యేక రొమాంటిక్ సన్నివేశాలు, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికే హైలైట్‌గా నిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి, రాజమౌళి గతంలో తెరకెక్కించిన సంచలన చిత్రం 'RRR' లో జూనియర్ ఎన్టీఆర్ సరసన 'జెన్నీ' పాత్ర కోసం మొదట డైసీనే సంప్రదించారు. కానీ, కొన్ని వ్యక్తిగత కారణాలు, డేట్స్ సమస్యల వల్ల ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడు ఎట్టకేలకు రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఆమెను ఒప్పించారని, ఈ వార్త కనుక నిజమైతే 'వారణాసి' చిత్రంతో డైసీ భారతీయ చిత్రసీమలోకి అరంగేట్రం చేయనుందని సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కేవలం తారాగణమే కాకుండా, ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ కూడా ప్రేక్షకులను విస్మరిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా అంటార్కిటికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి భారతీయ సినిమాగా 'వారణాసి' చరిత్ర సృష్టించనుంది. అక్కడి అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు, కట్టుదిట్టమైన పర్యావరణ నిబంధనల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది సినిమాలు మాత్రమే అక్కడ షూటింగ్ జరపగలిగాయి. ఆ అరుదైన జాబితాలో ఇప్పుడు రాజమౌళి సినిమా చేరడం విశేషం.

మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. వీరితో పాటు ప్రియాంక చోప్రా, డైసీ జోన్ తదితరులు నటిస్తున్నారు. అత్యాధునిక విజువల్స్, హాలీవుడ్ స్థాయి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని సుమారు రూ. 1,300 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఇది భారతదేశంలోనే రెండో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవనుంది. రాజమౌళి అద్భుత సృష్టిగా రాబోతున్న ‘వారణాసి’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రాజమౌళి-మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.



Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.