Superstar Krishna: ఒక్క ఏడాదిలోనే 18 సినిమాలు... ఎవరూ అందుకోలేని రికార్డ్
సంవత్సరానికి ఒక్క సినిమా రిలీజ్ అయితే గొప్ప అనుకునే హీరోలున్న ఈ రోజుల్లో ఏడాదికి 18 సినిమాలు రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ.
Superstar Krishna: సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తే గొప్ప విషయం. ఈరోజుల్లో హీరోల సినిమాల కోసం అభిమానులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కానీ, బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి కనీసం ఐదారు సినిమాలు చేసేవారు. అంతకు మించి అన్నట్టుగా ఓ ఏడాది ఆయన సినిమాలు ఏకంగా 18 రిలీజ్ అయ్యాయి. ఆరోజుల్లో ఒకే ఏడాది 18 సినిమాలు రిలీజ్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు ఆయన రికార్డును ఏ హీరో అందుకోలేకపోయారు. 1972లో కృష్ణ సృష్టించిన ప్రభంజనం నేటి తరానికి ఆశ్చర్యమైనా...అనుసరనీయం అని చెప్పాలి. అన్నేసి సినిమాలు చేయలేకపోయినా కనీసం రెండు మూడు సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు. 1972లో ఒకే నెలలో రెండు మూడు సినిమాలు రిలీజ్ అయ్యి ఆయన సినిమాలు ఆయనే పోటీగా నిలవడం విశేషం.
1972లో విడుదలైన 18 సినిమాలు
సూపర్ స్టాక్ కృష్ణ కష్టపడే తత్వానికి, క్రమశిక్షణకు మారుపేరు. ఒకే ఏడాది ఇన్ని సినిమాలు చేయడం అంటే మామూలు కష్టం కాదు. రోజుకు మూడు నాలుగు షిఫ్టుల్లో పనిచేయాలి. ఏ సినిమాకు సంబంధించి ఆ సినిమాలోకి పరకాయ ప్రవేశం చేయాలి. ఎక్కడా ఏ సినిమాలోనూ మొనాటనీ కనిపించకూడదు. మరి 1972లో రిలీజైన ఆ సినిమాలు ఏంటో చూద్దామా. 1972 జనవరి 3న మొనగాడొస్తున్నాడు జాగ్రత్త, ఏప్రిల్ 6న తాజ్‌మహల్, ఏప్రిల్ 19న అంతా మన మంచికే, మే 5న మావూరి మొనగాళ్లు, మే 26న గూడుపుఠాణి, జూన్ 2, హంతకులు దేవాంతకులు, జూన్ 29న కోడలు పిల్ల, జులై 7న మేనకోడలు, జులై 12న భలే మొనగాడు, జులై 21న పండంటి కాపురం సినిమాలు రిలీజ్ అయ్యాయి. జులై 21న రిలీజైన పండంటి కాపురం సినిమా అప్పట్లో బంపర్ హిట్‌గా నిలిచింది.
ఇక ఆగస్టు 4న నిజం నిరూపిస్తా, ఆగస్టు 25న ఇన్‌స్పెక్టర్ భార్య, ఆగస్టు 31న అబ్బాయిగారు అమ్మాయిగారు, అక్టోబర్ 26న కత్తుల రత్తయ్య, నవంబర్ 1న మా ఇంటి వెలుగు, నవంబర్ 30న ప్రజానాయకుడు, నవంబర్ 16న మరపురాని తల్లి, డిసెంబర్ 7న ఇల్లు ఇల్లాలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సినిమా హిట్టయిందా లేక ఫెయిల్ అయిందా అన్నది ముఖ్యం కాదు. ఇలా వరసగా సినిమాలు చేయడం వలన ఇండస్ట్రీని నమ్ముకొని బతికే సినీ కార్మీకులకు ఉపాధి కల్పన జరుగుతుంది.
నాటి కృష్ణ వేగం.. నేటి తరం ఆలోచన!
ఈ రోజుల్లో ఒక సినిమా పూర్తి కావడానికి కనీసం 6 నెలల నుండి ఏడాది సమయం పడుతోంది. కానీ నాడు పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల్లోనే, కృష్ణ మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ ఈ రికార్డును సాధించారు. కేవలం సినిమాలు చేయడమే కాదు, అందులో 'పండంటి కాపురం' వంటి క్లాసిక్ ఫ్యామిలీ డ్రామాలు, 'గూడుపుఠాణి' వంటి సస్పెన్స్ థ్రిల్లర్లు ఉండటం విశేషం. జులై, నవంబర్ నెలలో కృష్ణ మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. వరసగా ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం విశేషం. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత కాలం, ఈ '18 సినిమాల రికార్డు' ఒక చెరగని మైలురాయిగా, మరే హీరో అందుకోలేని శిఖరంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దటీజ్ సూపర్ స్టార్!




