SV Ranga Rao: అంతటి మహానటుడు ఎస్వీఆర్‌ని ఇబ్బందిపెట్టిన డైలాగ్ ఇదే
మహానటుడు ఎస్వీ రంగారావును ‘సంపూర్ణ రామాయణం’ షూటింగ్‌లో ఓ డైలాగ్ ఉచ్చారణ ఎలా ఇబ్బంది పెట్టిందో తెలుసా? బాపు, రమణలతో జరిగిన ఆసక్తికరమైన సంఘటన గురించి తెలుసుకుందాం.
SV Ranga Rao: మహానటుడు ఎస్వీ రంగారావు పేరు చెబితేనే గంభీరమైన స్వరం, కళ్లలో కనిపించే భావం, డైలాగ్ చెప్పే తీరు గుర్తుకొస్తాయి. పేజీల కొద్దీ సంభాషణలు ఉన్నా సింగిల్ టేక్‌లోనే చెప్పగలిగిన నటుడిగా ఆయనకు అప్పట్లో ప్రత్యేక గుర్తింపు ఉండేది. కానీ అలాంటి ఎస్వీ రంగారావును కూడా ఒక చిన్న పదం పదేపదే ఇబ్బంది పెట్టిందట. ఆ పదం సరిగ్గా పలకలేక ఆయనకు కోపం వచ్చింది. చివరకు అదే సంఘటన ఆయనలోని అహంకారాన్ని కూడా కాస్త దించిందట.
సంపూర్ణ రామాయణం
ఈ ఆసక్తికరమైన సంఘటన ‘సంపూర్ణ రామాయణం’ సినిమా షూటింగ్ సమయంలో జరిగినట్లు చెబుతారు. ఈ చిత్రంలో ఎస్వీ రంగారావు రావణుడి పాత్రలో నటించారు. కెమెరా ముందు నిలబడిన వెంటనే పాత్రలోకి వెళ్లిపోయే ఆయన.. భారీ సంభాషణలను కూడా అలవోకగా చెప్పేవారు. ఒక్కసారి డైలాగ్ పూర్తయితే సెట్లో ఉన్నవారి నుంచి చప్పట్లు వినిపించేవి. అలాంటి ఓ సందర్భంలో ఒక భారీ డైలాగ్‌ను అద్భుతంగా చెప్పిన తర్వాత ఎస్వీ రంగారావు తన గురించి తానే సరదాగా గొప్పగా చెప్పుకున్నారట. తన స్థాయిలో డైలాగ్ చెప్పగల నటులు చాలా అరుదంటూ సవాల్ చేసినట్టుగా మాట్లాడారు. ఆ మాటలను దర్శకుడు బాపు, రచయిత రమణతో పాటు యూనిట్ సభ్యులు కూడా విన్నారు. ఆ తర్వాత వచ్చిన సన్నివేశమే అసలు కథకు కారణమైంది.
ఇబ్బంది పెట్టిన డైలాగ్
“మహావీరా! మంత్రవిద్యా విశారదా మారీచా! నీకేల ఈ ముని మృచ్చువృత్తి?” ఇందులోని “మంత్రవిద్యా విశారదా” అనే పదబంధం దగ్గరే సమస్య మొదలైంది. ఎస్వీ రంగారావు ఎంత ప్రయత్నించినా “విద్యా విశారదా”ను సరిగ్గా పలకలేకపోయేవారు. పదేపదే ఉచ్చారణలో తడబడటంతో టేక్ ఆగిపోతుండేది. బాపు గారు దగ్గరకు వెళ్లి, పదంలో ఉన్న వత్తులను సున్నితంగా గుర్తుచేసేవారట. “వత్తులు లేవు సర్” అని చెప్పేవారు. దానికి ఎస్వీ రంగారావు కూడా వెంటనే స్పందించేవారు. “వత్తులు లేకుండా డైలాగ్ ఏమిటి? సరిగ్గా చూడండి.. రావణుడు బ్రాహ్మణుడు కదా!” అంటూ తన వాదన వినిపించేవారు. అయినా డైలాగ్ మాత్రం అనుకున్నట్టుగా రావడం లేదు. ఒకసారి ఒక చోట ఉచ్చారణను మార్చి చెప్పినా సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు. టేకులు వరుసగా తప్పుతుండటంతో వాతావరణంలో టెన్షన్ పెరిగింది. ఇంతకుముందు తన ప్రతిభ గురించి ధీమాగా మాట్లాడిన ఎస్వీఆర్‌కు ఇదే చిన్న డైలాగ్ సవాల్‌గా మారింది. చివరకు చిరాకుతో ఆయన మేకప్ రూమ్‌లోకి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు బయటకు రాలేదు.
మంచులా కరిగిపోయిన అహంకారం
కొంతసేపటి తర్వాత రమణగారు దగ్గరకు వెళ్లి “టిఫిన్ తెప్పించనా?” అని అడిగారట. దానికి ఎస్వీఆర్.. “తిన్నానుగా తట్టెడు. టిఫిన్ వద్దు. దమ్ము లాగనీ” అంటూ సిగరెట్ వెలిగించారు. కాసేపటి తర్వాత తనలో తానే ఆలోచించుకున్న ఆయన.. “పొగరు తగదు. అహం దెబ్బకొట్టింది. రమణా.. సారీ!” అని అన్నారట. అప్పుడు రమణగారు కూడా నవ్వుతూ.. “రాముడికి కోపం వచ్చింది.. రావణాసురుడి మీద” అని చమత్కరించారట. ఆ మాటకు ఎస్వీ రంగారావు కూడా నవ్వేశారు. వెంటనే “సరే.. టిఫిన్ తెప్పించు. అది తినివస్తే టేకులు తినడం ఉండదేమో!” అన్నారట.
అవలోకగా డైలాగులు
ఆ తర్వాత మళ్లీ సెట్లోకి వచ్చి డైలాగ్ చెప్పారు. ఈసారి సన్నివేశం సరిగ్గా వచ్చింది. ఒక చిన్న పదం.. ఓ మహానటుడి పట్టుదలను పరీక్షించింది. చివరికి ఆ సంఘటన డైలాగ్ కంటే పెద్ద పాఠాన్నే మిగిల్చింది. ఎంతటి ప్రతిభ ఉన్నా, ఒక్కోసారి చిన్న విషయం కూడా మనల్ని ఆపుతుంది. దాన్ని అంగీకరించి మళ్లీ ప్రయత్నించడమే అసలైన గొప్పతనం. ఎస్వీఆర్ వంటి నటుడి విషయంలో జరిగిన ఈ సరదా సంఘటన అందుకే ఇప్పటికీ ఆసక్తిగా చెప్పుకుంటారు.




