Bharathiraja: భారతీరాజా పార్థివదేహానికి సీఎం విజయ్, స్టాలిన్ నివాళులు..

Bharathiraja: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దిగ్గజ దర్శకుడు భారతీరాజా అనారోగ్యంతో కన్నుమూశారు.

Arun Chilukuri
Updated on: 10 Jun 2026 12:22 PM IST
Bharathiraja
X

Bharathiraja: భారతీరాజా పార్థివదేహానికి సీఎం విజయ్, స్టాలిన్ నివాళులు..

Bharathiraja: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన విలక్షణమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన గ్రామీణ నేపథ్య చిత్రాలతో సినీ జగత్తుపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా (Bharathiraja) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే చిత్రసీమతో పాటు రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం భారతీరాజా పార్థివదేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. సమాచారం అందిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ (Vijay) అక్కడికి చేరుకొని భారతీరాజా భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతీరాజా మృతి భారతీయ సినిమా రంగానికి తీరని లోటని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.

డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్‌తో పాటు సీనియర్ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్‌, దర్శకుడితో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

"తమిళ సినిమా పంథాను మార్చి, సరికొత్త సృజనాత్మక ధోరణిని సృష్టించిన గొప్ప కళాకారుడు భారతీరాజా. అప్పట్లో కేవలం నాలుగు గోడల స్టూడియోలకే పరిమితమైన కెమెరాలను పల్లెటూళ్లలోకి తీసుకెళ్లి, గ్రామీణ ప్రజల యథార్థ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనదే. తమిళ సినిమాను వాస్తవికతకు అద్దం పట్టేలా చేసిన ఆయన చిత్రాలు హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన ఎన్నో తరాల దర్శకులకు స్ఫూర్తి" అని స్టాలిన్ కొనియాడారు.

భారతీరాజా మరణంతో కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు యావత్ భారత చలనచిత్ర రంగం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story