తండ్రి మాట కోసం 40 ఏళ్ల రికార్డు బద్దలు.. ఎప్‌సెట్ టాపర్ రుషికి మెగాస్టార్ చిరంజీవి సర్ప్రైజ్ గిఫ్ట్!

Telangana EAMCET Topper: తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఫలితాల్లో 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి, ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన టాపర్ ఎం. రుషిని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సత్కరించారు.

Arun Chilukuri
Published on: 20 May 2026 4:31 PM IST
CHIRANJEEVI
X

తండ్రి మాట కోసం 40 ఏళ్ల రికార్డు బద్దలు.. ఎప్‌సెట్ టాపర్ రుషికి మెగాస్టార్ చిరంజీవి సర్ప్రైజ్ గిఫ్ట్!

Telangana EAMCET Topper: ‘‘నువ్వు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో.. నిన్ను మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పిస్తా’’ అని ఒక తండ్రి తన కూతురికి ఇచ్చిన మాట.. ఆమెలో కొండంత పట్టుదలను నింపింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన ఆ అమ్మాయి, తండ్రి కలను నెరవేరుస్తూ తెలంగాణ ఎప్‌సెట్ (EAPCET) ఫలితాల్లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. తాజాగా ఆ మెగా కల నిజమైన వేళ.. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆ విద్యార్థినిని కలిసి అభినందించారు.

తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగంలో ఎం.రుషి సాధించిన ఈ విజయం సాధారణమైనది కాదు. గత 40 ఏళ్లుగా (1986 తర్వాత) ఈ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక అమ్మాయిగా రుషి చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. సాధారణంగా అబ్బాయిలదే హవా అనుకునే ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో ఓ అమ్మాయి టాపర్‌గా నిలవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రుషి తండ్రి చిన్నప్పటి నుంచి చిరంజీవికి వీరాభిమాని కావడంతో, రుషి కూడా మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుంది.

తనను కలవడానికి వచ్చిన ఈ యంగ్ అచీవర్ రుషికి, ఆమె కుటుంబ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఘన స్వాగతం పలికారు. రుషి సాధించిన అద్భుతమైన విజయాన్ని కొనియాడుతూ ఆమెను శాలువాతో సత్కరించారు. అంతేకాకుండా, ఆమె తదుపరి చదువులకు ఉపయోగపడేలా ఒక ల్యాప్‌టాప్‌ను బహుమతిగా అందించారు. ఇంత చిన్న వయసులోనే తండ్రి మాట కోసం అంతటి కఠినమైన పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం గొప్ప విషయమని చిరంజీవి ప్రశంసించారు.

భవిష్యత్తులో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ రాసి, ఐఏఎస్ (IAS) అధికారిణి కావాలన్నదే తన జీవిత లక్ష్యమని రుషి ఈ సందర్భంగా చిరంజీవికి వివరించింది. ఆమె సంకల్పాన్ని విన్న మెగాస్టార్ ఎంతో సంతోషించారు. "లక్ష్యం వైపు దూసుకుపో.. చదువును ఎక్కడా ఆపొద్దు. నీ ఐఏఎస్ చదువులకు నా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు" అని చిరంజీవి ఆ అమ్మాయికి కొండంత భరోసా ఇచ్చారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story