Movie Promotions Ban: ఇకపై విద్యా సంస్థల్లో సినిమా ప్రమోషన్లు చేస్తే అంతే...!
Movie Promotions Ban: ప్రైవేటు విద్యా సంస్థల్లో సినిమా ప్రమోషన్లు, వాణిజ్య కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
Movie Promotions Ban: ఇకపై విద్యా సంస్థల్లో సినిమా ప్రమోషన్లు చేస్తే అంతే...!
Movie Promotions Ban: విద్యా సంస్థలు చదువు చెప్పే సరస్వతీ నిలయాలు. కానీ ఇటీవల కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల ధోరణి తల్లిదండ్రులను, విద్యావేత్తలను తీవ్రంగా కలవరపెడుతోంది. పిల్లల భవిష్యత్తు కోసం లక్షల రూపాయలు వెచ్చించి పాఠశాలలు, కళాశాలల్లో చేర్పిస్తే... ఆ సంస్థల యాజమాన్యాలు విద్యార్థులను తమ వ్యాపార, రాజకీయ, కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల కొన్ని విద్యా సంస్థల్లో చోటుచేసుకున్న పరిణామాలు విద్యారంగంలో భద్రతా లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. సినిమాల ప్రమోషన్లు, ప్రైవేటు ఆడియో ఫంక్షన్ల కోసం విద్యార్థులను వేదికలుగా చేసుకోవడం, ఆయా సినిమాలు చూడాలంటూ యాజమాన్యాలే స్వయంగా సెలవులు ప్రకటించడం వంటి చర్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
అంతేకాకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా వేల మందితో నిర్వహించే భారీ కార్యక్రమాల వల్ల తీవ్ర అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల ఒక విద్యా సంస్థలో వేదిక కూలిపోయి ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం యావత్ సమాజాన్ని షాక్‌కి గురిచేసింది. విద్యార్థుల రక్షణను గాలికొదిలేసి చేపడుతున్న ఇటువంటి ప్రమోషన్లపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. క్యాంపస్‌లలో వాణిజ్య, సినిమా ప్రమోషన్ల నిర్వహణపై పూర్తి నిషేధం విధించే దిశగా యోచిస్తోంది. విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు, ఎటువంటి వాటిపై నిషేధం ఉండాలనే అంశంపై అధ్యయనం చేయాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
విద్యా సంస్థల ప్రాంగణాలను కేవలం విద్యా, క్రీడా కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. సినిమా ప్రమోషన్లు, వాణిజ్య వేడుకలకు స్పష్టమైన నిషేధం ఉంటుంది. క్రీడలు, సాంస్కృతిక పోటీలు భారీ ఎత్తున నిర్వహిస్తే... హాజరయ్యే వారి సంఖ్య, స్టేజ్ నిర్మాణం దృఢత్వం, ఫైర్ సేఫ్టీ, రాకపోకల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ముందుగానే అందజేసి అనుమతి పొందాలి. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే చిన్న తరహా విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదు.
ఒకవైపు ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేసేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, గూగుల్ ఫర్ స్టార్టప్స్, ఏఐ ఇన్నోవేషన్ హబ్ వంటి వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. కళలు, సంస్కృతిని ప్రోత్సహించేందుకు గద్దర్ ఫిల్మ్ అవార్డులు, యంగ్ ఇండియా ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ వంటి వేదికలను కల్పిస్తోంది. అయితే, ప్రభుత్వ ఆశయాలకు విరుద్ధంగా కొన్ని విద్యా సంస్థలు విద్యా క్యాలెండర్‌ను పక్కనపెట్టి, వ్యాపార ప్రమోషన్లకు ప్రాధాన్యం ఇవ్వడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.




