The Gods Must Be Crazy: నాగరిక...అనాగరికుల మధ్య తేడాను చూపించే గాడ్స్‌ మస్ట్‌ బీ క్రేజీ చూసి తీరాల్సిందే

1980లో వచ్చిన గాడ్స్‌ మస్ట్‌ బీ క్రేజీ సినిమా ఎందుకు అంత హిట్టైందో తెలుసా... నాలుగు దశాబ్దాలైనా ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఈ సినిమాను ఎందుకు చూస్తుంటారో ఎప్పుడైనా ఆలోచించారా...

Balachander
Published on: 20 July 2026 11:53 AM IST
The Gods Must Be Crazy: నాగరిక...అనాగరికుల మధ్య తేడాను చూపించే గాడ్స్‌ మస్ట్‌ బీ క్రేజీ చూసి తీరాల్సిందే
X

The Gods Must Be Crazy: నాగరిక ప్రపంచం నుంచి వచ్చిన ఒక ఖాళీ కోకాకోలా సీసా, అమాయక ఆఫ్రికన్ తెగ జీవితాల్లో ఎలాంటి నవ్వుల తుఫాను సృష్టించిందో చూస్తే ఎవరైనా సరే పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే! 1980లో దక్షిణాఫ్రికా దార్శనికుడు జేమీ ఐస్ తెరకెక్కించిన "ది గాడ్స్ మస్ట్ బి క్రేజీ" కేవలం ఒక హాస్య చిత్రం మాత్రమే కాదు.. నాగరికత పేరిట మనుషులు పెంచుకుంటున్న స్వార్థాన్ని, ఆఫ్రికన్ బుష్‌మెన్ తెగ అమాయకత్వాన్ని అత్యంత సున్నితంగా ఎత్తిచూపిన ఒక క్లాసిక్ సినిమా.

కలహారి ఎడారి మీదుగా వెళ్తున్న విమానం నుంచి పడిన ఒక ఖాళీ కోక్ సీసాతో ఈ వినోదాత్మక ప్రయాణం మొదలవుతుంది. అంతవరకు స్వంత వస్తువు అనే భావన లేకుండా, ప్రకృతితో కలిసి జీవిస్తున్న శాన్ తెగ ప్రజలు ఆ సీసాను దేవతలు ఇచ్చిన కానుకగా భావిస్తారు. అయితే, దాని వల్ల తెగలో అసూయ, కొట్లాటలు మొదలవ్వడంతో, తెగకు చెందిన క్సీ అనే వ్యక్తి ఆ సీసాను భూమి చివరకు తీసుకెళ్లి పారేయాలని ప్రయాణమవుతాడు. ఈ క్రమంలో నగర యువతి కేట్, ఆడవాళ్లను చూస్తే కంగారుపడే మైక్రోబయాలజిస్ట్ ఆండ్రూ, ఉగ్రవాదుల గుంపుల మధ్య క్సీ పడే తిప్పలు ప్రేక్షకులను నవ్వుల నావలో ఓలలాడిస్తాయి.


ఈ సినిమా వెనుక ఉన్న ఆసక్తికర రికార్డులు

హాలీవుడ్ బయట తయారై ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఈ గాడ్‌ మస్ట్‌ బీ క్రేజీ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ చిత్రంలో బుష్‌మెన్ తెగ మాట్లాడే ప్రత్యేకమైన నాలుక చప్పుడు భాష, మన 'బాహుబలి' చిత్రంలోని 'కిలికిలి' భాషను గుర్తుచేస్తుంది. మన తెలుగు సూపర్‌హిట్ చిత్రం 'బొబ్బిలి రాజా'లోని కొన్ని హాస్య సన్నివేశాలు నేరుగా ఈ సినిమా నుంచే ప్రేరణ పొంది రూపొందించబడ్డాయి. ఎటువంటి అశ్లీలత, హింస లేకుండా కుటుంబ సమేతంగా, ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడదగ్గ అద్భుతమైన సినిమా ఇది. నాగరిక సమాజం నేర్పించే దురాశ కంటే, అమాయకుల ప్రశాంత జీవితమే మిన్న అని చాటిచెప్పే ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా మాత్రమే వస్తుంటాయి. ఈ సీరిస్‌లో నాలుగు సినిమాలు వచ్చినా అందులో మొదటి రెండు భాగాలు సూపర్‌ హిట్ కావడం విశేషం.

సినిమా పుట్టుకకు ప్రధాన కారణం

1974లో దర్శకుడు జేమి ఐస్‌ ఆనిమల్స్‌ ఆర్‌ బ్యూటిఫుల్‌ పీపుల్‌ అనే డాక్యుమెంటరీని రూపొందించేందుకు కలహారి ఎడారికి వెళ్లారు. అక్కడ చిత్రీకరణ సమయంలో ఆయనకు శాన్‌ అనే బుష్మెన్‌ తెగను చూశాడు. భాష తెలియకున్నా భావాలతో ఆయన ఆ తెగను ఆకట్టుకున్నాడు. అక్కడి ప్రజలకు ఏ వస్తువుపైనా వారసత్వం ఉండదు. ఒక వస్తువు ఉన్నది అంటే అది అందరిదీ. అందరూ ఎవరికి కావలసిన విధంగా వారు వాడుకుంటారు. ఆయన తన కోటును తీసి ఓ చోట ఉంచగా...దానిని అడగకుండానే తొడుక్కొని పక్కన వారితో పంచుకున్నారు. నిష్కల్మషమైన వారి మనసును చూసి ఆశ్చర్యపోయాడు జేమీ. నాదంటే నాది అనుకునే రోజుల్లో ఇలా అందరిదీ అనుకోవడం ఆయనకు వింతగా అనిపించింది. అయితే, వీరి మనసులో నాది అనే ఒక ఆలోచన వస్తే ఎలా ఉంటుంది అనే భావనతోనే కథను రాయడం మొదలుపెట్టారట జెమీ. ఆ కొత్త వస్తువే కోక్‌ సీసా. కోక్‌ సీసానే ఎందుకు ఎంచుకున్నారు అంటే ప్లాస్టిక్‌ నాగరికతకు దారి తీసిన వస్తువు కోక్‌ సీసానే అంటారు జెమీ. ఈ సినిమా వచ్చి నాలుగు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉన్నది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story