Titanic Movie: ‘టైటానిక్’ క్లైమాక్స్ డోర్ సీన్ వెనుక ఉన్న అసలు కథ ఇదీ!
Titanic Movie: హాలీవుడ్ సంచలనం 'టైటానిక్' సినిమాలో రోజ్ ప్రాణాలు కాపాడే ఆ చెక్క తలుపు సీన్ ఎంతటి భావోద్వేగాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే.
Titanic Movie: ‘టైటానిక్’ క్లైమాక్స్ డోర్ సీన్ వెనుక ఉన్న అసలు కథ ఇదీ!
Titanic Movie: హాలీవుడ్ సంచలనం 'టైటానిక్' సినిమాలో రోజ్ ప్రాణాలు కాపాడే ఆ చెక్క తలుపు సీన్ ఎంతటి భావోద్వేగాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ ఐకానిక్ సీన్ వెనుక ఒక నిజమైన చైనీస్ ప్రయాణికుడి మనుగడ పోరాటం దాగి ఉందనే ఆసక్తికర విషయాన్ని సదరు బాధితుడి మనవడు తాజాగా ప్రపంచానికి వెల్లడించారు.
సముద్ర గర్భం నుండి ప్రాణాలతో బయటపడిన ఫాంగ్ లాంగ్
ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం.. 1912 నాటి టైటానిక్ ఘోర ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడిన ఆరుగురు చైనీస్ వలసదారులలో ఫాంగ్ లాంగ్ ఒకరు. ఓడ మునిగిపోతున్న సమయంలో ఆయన కూడా నీటిలో మునిగిపోయారని, కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ సముద్రంలో తేలుతున్న ఒక చెక్క తలుపును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నారని ఆయన మనవడు స్టీవెన్ ఫాంగ్ గుర్తుచేసుకున్నారు. దర్శకుడు జేమ్స్ కెమరూన్ ఈ వాస్తవ సంఘటన ఆధారంగానే సినిమాలో జాక్, రోజ్ ల క్లైమాక్స్ దృశ్యాన్ని డిజైన్ చేశారని ఆయన స్పష్టం చేశారు.
జేమ్స్ కెమరూన్ ఒప్పుకున్న నిజం
ఈ చారిత్రాత్మక సినిమా ముగింపులో కథానాయిక రోజ్ ఒక చెక్క పలకపై తేలుతూ ప్రాణాలు కాపాడుకోగా, హీరో జాక్ చలికి గడ్డకట్టుకుపోతూ ప్రాణత్యాగం చేస్తాడు. ఈ సీన్ రాయడానికి ఫాంగ్ లాంగ్ కథే తనకు స్ఫూర్తినిచ్చిందని దర్శకుడు జేమ్స్ కెమరూన్ స్వయంగా అంగీకరించినట్లు స్టీవెన్ ఫాంగ్ తెలిపారు. ఇంతటి ప్రపంచ ప్రసిద్ధ చిత్రంలో తమ తాతగారి జీవితం ఒక భాగంగా మారడం, ఈ వారసత్వంలో తాము భాగస్వాములు కావడం ఎంతో గర్వంగా, భావోద్వేగంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
‘ది సిక్స్’ డాక్యుమెంటరీతో వెలుగులోకి..
ఫాంగ్ లాంగ్ బతికున్నంత కాలం ఆ భయంకరమైన ప్రమాదం గురించి గానీ, తను ప్రాణాలతో బయటపడిన విధానం గురించి గానీ కుటుంబ సభ్యులతో పెద్దగా పంచుకోలేదు. ఆయన 1986లోనే కన్నుమూశారు. అయితే, ఆ ప్రమాదం నుండి బతికిన ఆరుగురు చైనీయుల రహస్య జీవితాల ఆధారంగా 2020లో వచ్చిన ‘ది సిక్స్’ అనే డాక్యుమెంటరీ ద్వారా ఈ విషయాలు ప్రపంచానికి తెలిశాయి. 1997లో విడుదలైన ‘టైటానిక్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అపారమైన వసూళ్లు సాధించడమే కాకుండా ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను గెలుచుకుని సినిమా చరిత్రలోనే ఒక అద్భుతంగా నిలిచిపోయింది.




