Ashu Reddy : అషురెడ్డిపై చీటింగ్ కేసు.. పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు నొక్కేసిందని ఎన్ఆర్ఐ ఫిర్యాదు
Ashu Reddy : నటి అషురెడ్డిపై హైదరాబాద్‌లో చీటింగ్ కేసు నమోదైంది. పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం కాజేసిందని ఎన్ఆర్ఐ ధర్మేంద్ర ఫిర్యాదు చేశారు.
Ashu Reddy
Ashu Reddy : సోషల్ మీడియా సెన్సేషన్, బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి చుట్టూ ఇప్పుడు వివాదాల ఉచ్చు బిగుస్తోంది. గ్లామరస్ ఫోటోలు, క్రేజీ వీడియోలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ అమ్మడు.. ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయల మోసం ఆరోపణలతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించి తన దగ్గర నుంచి భారీగా నగదు, బంగారం కాజేసిందని ఓ ఎన్ఆర్ఐ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
ఏమిటీ వివాదం?
హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన వైవీ ధర్మేంద్ర అనే వ్యక్తి లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా స్థిరపడ్డాడు. 2018లో భారత్‌కు వచ్చినప్పుడు అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువుకున్నానని, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పినట్లు ధర్మేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పరిచయం కాస్తా ప్రేమగా మారిందని, తననే పెళ్లి చేసుకుంటానని నమ్మించి రకరకాల అవసరాల పేరుతో ఆమె తన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిందని బాధితుడు వాపోతున్నాడు.
9 కోట్లు.. 5 కిలోల బంగారం
ఈ వ్యవహారంలో ఆరోపణలు వింటే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. తన అవసరాల కోసం ధర్మేంద్ర నుంచి అషురెడ్డి దాదాపు రూ.9.35 కోట్లు తీసుకుందని, ఆ డబ్బుతో ఖరీదైన కార్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుందని ఫిర్యాదులో ఉంది. ధర్మేంద్ర తండ్రి సైతం ఈ ఆరోపణలను సమర్థిస్తూ.. నగదు, ఆస్తుల విలువ దాదాపు 35 కోట్ల వరకు ఉంటుందని, సుమారు 5 కిలోల బంగారం కూడా ఆమె కాజేసిందని పోలీసులకు వెల్లడించారు. పెళ్లి కోసం తన కుమారుడిని అషురెడ్డి కుటుంబం సైతం నమ్మించిందని వారు ఆరోపిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు
గత కొన్నాళ్లుగా తనను దూరం పెడుతూ, పెళ్లి ప్రస్తావన వస్తే అషురెడ్డి ముఖం చాటేస్తోందని ధర్మేంద్ర హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అసలు ధర్మేంద్రకు, అషురెడ్డికి మధ్య ఉన్న లావాదేవీలు ఏమిటి? అంత భారీ మొత్తంలో డబ్బులు బదిలీ అయ్యాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాంకు స్టేట్మెంట్లను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
మౌనంలో అషురెడ్డి
ఆర్జీవీతో ఇంటర్వ్యూలు, బిగ్‌బాస్‌లో హంగామాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న అషురెడ్డి.. ఈ తాజా ఆరోపణలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆమె, ఈ సీరియస్ కేసు విషయంలో ఏమని క్లారిటీ ఇస్తుందోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరోవైపు, ఆమె సన్నిహితులు మాత్రం ఇదంతా కావాలని చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేస్తున్నారు. నిజానిజాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.




