Meenakshi Chaudhary: సైబర్ కేటుగాళ్ల వలలో స్టార్ బ్యూటీ.. ఏం చేశారంటే..?
Meenakshi Chaudhary: టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి పేరుతో కొందరు సైబర్ కేటుగాళ్లు నకిలీ అకౌంట్లు, ఫేక్ నంబర్ క్రియేట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
Meenakshi Chaudhary: సైబర్ కేటుగాళ్ల వలలో స్టార్ బ్యూటీ.. ఏం చేశారంటే..?
Cyber Scam: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీల పేర్లు, ఫొటోలు వాడుకుని నకిలీ అకౌంట్లు సృష్టించడం, తద్వారా ఇండస్ట్రీ వర్గాలను, సాధారణ ప్రజలను మోసం చేయడం కేటుగాళ్లకు నిత్యకృత్యంగా మారిపోయింది. తాజాగా ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు టాలీవుడ్ లక్కీ బ్యూటీ మీనాక్షి చౌదరి. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె పేరు, చిత్రాలు , ఒక ఫోన్ నంబర్‌ను వాడుకుంటూ ఇండస్ట్రీలో మోసాలకు తెరలేపారు. అయితే ఈ విషయం కాస్తా నెటిజన్ల ద్వారా మీనాక్షి దృష్టికి వచ్చింది.
ఈ సైబర్ వ్యవహారంపై మీనాక్షి చౌదరి తక్షణమే స్పందించారు. తన పేరును తప్పుగా వాడుకుంటూ చలామణీ అవుతున్న ఆ నకిలీ వ్యక్తి గుట్టును సోషల్ మీడియా వేదికగా రట్టు చేశారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆ ఫేక్ నంబర్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌లను షేర్ చేస్తూ.. ఈ నంబర్ నుండి ఎవరికైనా కాల్స్ లేదా మెసేజ్‌లు వస్తే దయచేసి నమ్మకండి, అది నేను కాదు. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయండి అంటూ తన అభిమానులను, నెటిజన్లను కోరారు. అలాగే ఈ సైబర్ ఫ్రాడ్‌ను సకాలంలో తన దృష్టికి తీసుకువచ్చిన నెటిజన్లకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
'ఫెమినా మిస్ ఇండియా 2018' రన్నరప్‌గా నిలిచిన మీనాక్షి చౌదరి, మోడలింగ్ రంగం నుండి వెండితెరకు పరిచయమయ్యారు. 2021లో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు, 2022లో అడివి శేష్ సరసన నటించిన 'హిట్: ది సెకండ్ కేస్' చిత్రం మొదటి మైలురాయిగా నిలిచింది. ఈ కమర్షియల్ సక్సెస్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన మీనాక్షి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'గుంటూరు కారం'లో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె, ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ సరసన 'లక్కీ భాస్కర్' చిత్రంతో క్లాసిక్ హిట్ అందుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన నటనతో మెప్పించినందుకు గానూ ప్రతిష్టాత్మక గామా అవార్డ్స్ (2025) లో 'ఉత్తమ నటి' పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆపై 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన గోల్డెన్ లెగ్ గా మారిపోయారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న మీనాక్షి, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న హై-బడ్జెట్ మైథలాజికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'లో కథానాయికగా నటిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె 'దక్ష' అనే ఎంతో పవర్‌ఫుల్ , ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఈ భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబరులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు తమిళ స్టార్ కార్తి పదేళ్ల తర్వాత చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా ఎంపికైనప్పటికీ, ప్రస్తుతం హీరో , దర్శకుడి మధ్య కొన్ని విబేధాల కారణంగా ఆ ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.




