Jani Master: రూ. 5 కోట్ల ఫ్రాడ్ వ్యక్తికి వర్క్ పర్మిషన్.. జానీ మాస్టర్ దంపతులపై లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు!

Jani Master: టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో తీవ్ర వివాదం రేగింది.

Arun Chilukuri
Published on: 13 July 2026 12:19 PM IST
Jani Master
X

Jani Master: రూ. 5 కోట్ల ఫ్రాడ్ వ్యక్తికి వర్క్ పర్మిషన్.. జానీ మాస్టర్ దంపతులపై లేబర్ కమిషన్‌కు ఫిర్యాదు!

Jani Master: తెలుగు సినీ డాన్సర్స్ అసోసియేషన్‌లో తీవ్ర అలజడి రేగింది. అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఉన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత, అలాగే జానీ మాస్టర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా సభ్యులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. వారి ఆగడాలను నిరసిస్తూ కమిటీకి చెందిన 10 మంది సభ్యులు తమ పదవులకు ఒకేసారి రాజీనామా చేయడం చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది.

జానీ మాస్టర్, ఆయన భార్య సుమలత వ్యవహరిస్తున్న తీరును భరించలేకపోతున్నామని డాన్సర్స్ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కార్యవర్గాన్ని తక్షణమే రద్దు చేసి, మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ వారు ఫిలిం ఫెడరేషన్‌తో పాటు లేబర్ కమిషన్‌కు కూడా అధికారికంగా వినతి పత్రం సమర్పించారు.

అసోసియేషన్ గతంలో బ్యాన్ చేసిన, సుమారు ఐదు కోట్ల రూపాయల ఫ్రాడ్‌కు పాల్పడిన ఒక వ్యక్తిని జానీ మాస్టర్ దంపతులు మళ్లీ అసోసియేషన్‌లోకి తీసుకున్నారని సభ్యులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా అతనికి తిరిగి వర్క్ పర్మిషన్ ఇవ్వడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానిక తెలుగు డాన్సర్స్ పొట్ట కొడుతూ జానీ మాస్టర్ సొంత లాభాల కోసం చూసుకుంటున్నారని సభ్యులు మండిపడ్డారు. ఇటీవల ‘పెద్ది’ సినిమాలో ఒక సాంగ్ కోసం స్థానిక డాన్సర్స్ కాకుండా బొంబాయి నుండి డాన్సర్లను రప్పించి కొరియోగ్రఫీ చేయించారని ఆరోపించారు. బొంబాయి డాన్సర్స్ తో చేయిస్తే ఒకరి మీద 5 వేల చొప్పున, రోజుకు 100 మందితో లెక్కిస్తే దాదాపు 5 లక్షల రూపాయల పైనే జానీ మాస్టర్ జేబులోకి వెళ్తుందని, ఈ రకంగా ఆయన నిర్మాతలను దారుణంగా దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అక్రమాలను ప్రశ్నించిన లేదా తమకు వ్యతిరేకంగా మాట్లాడిన డాన్సర్‌లను జానీ మాస్టర్, ఆయన భార్య సుమలత భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సభ్యులు పేర్కొన్నారు. ఫెడరేషన్‌ను కూడా అస్సలు లెక్కచేయని సుమలత.. రాజకీయ అండదండలు చూపిస్తూ, పవన్ కళ్యాణ్ ఫోటోలను వాడుకుంటూ అపోజిట్ గ్రూప్ డాన్సర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story