Tollywood: టాలీవుడ్‌లో మాఫియా రాజ్యాంగం ..యంగ్ హీరో సంచలన కామెంట్స్!
Tollywood: చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా దొక్కిపెడుతున్నారంటూ 'ఓ అందాల రాక్షసీ' హీరో, ప్రొడ్యూసర్ షిరాజ్ మెహదీ సంచలన ఆరోపణలు చేశారు.
Tollywood: టాలీవుడ్‌లో మాఫియా రాజ్యాంగం ..యంగ్ హీరో సంచలన కామెంట్స్!
O Andala Rakshasi: తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాల ఉనికి, చిన్న నిర్మాతల మనుగడపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. తాను నిర్మించి, కథానాయకుడిగా నటించిన 'ఓ అందాల రాక్షసీ' చిత్రానికి థియేటర్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని హీరో, మూవీ మేకర్ షిరాజ్ మెహదీ బాంబు పేల్చారు. ఇండస్ట్రీలో ఒక రకమైన మాఫియా వ్యవస్థ నడుస్తోందని, చిన్న నిర్మాతలు అడుగడుగునా దోపిడీకి, తీవ్ర వివక్షకు గురవుతున్నారని విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు.
చిన్న సినిమాలను విడుదల చేయడం నిర్మాతలకు గగనకుసుమంగా మారిందని, సాంకేతిక ఛార్జీల పేరుతో దారుణంగా దోచుకుంటున్నారని షిరాజ్ మెహదీ ధ్వజమెత్తారు. క్యూబ్, యూఎఫ్‌ఓ వంటి డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు వారానికి కేవలం రూ.2,000 లోపే అయ్యే పనికి.. ఒక్కో థియేటర్ నుంచి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఐనాక్స్ , పీవీఆర్ , ఏషియన్ ఫిల్మ్స్ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు మొదట స్క్రీన్స్ ఇస్తామని చెప్పి, ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని, హైకోర్టు నుంచి సమన్లు కూడా పంపినట్లు వెల్లడించారు.
చిన్న నిర్మాతలకు కొండంత అండగా నిలవాల్సిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సైతం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని షిరాజ్ విమర్శించారు. పెద్ద సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ చిన్న చిత్రాలను దొక్కిపెడుతున్నారని, ఈ వివక్షపై ఇప్పటికే 40కి పైగా ప్రెస్‌మీట్లు, 50కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చినా మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. ఈ పోరాటంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని వెల్లడించిన షిరాజ్ మెహదీ, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
నా ప్రాణాలు పోయినా చిన్న సినిమాల హక్కుల కోసం నా పోరాటం ఆగదు. అవసరమైతే 100 ప్రెస్‌మీట్లు పెడతా.. ర్యాలీలు నిర్వహిస్తా. నా ఈ యుద్ధం కేవలం నా సినిమా కోసమే కాదు.. పరిశ్రమలోని వేలాది మంది చిన్న నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్ల భవిష్యత్తు కోసం అని ఆయన ఆవేశంగా మాట్లాడారు.
ఎన్ని అడ్డంకులు, కుట్రలు ఎదురైనా అధిగమించి ఓ అందాల రాక్షసీ' చిత్రాన్ని త్వరలోనే గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తానని ప్రకటించారు. సరైన రీతిలో థియేటర్లు లభిస్తే తమ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. షిరాజ్ మెహదీ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు, కోర్టు సమన్ల వ్యవహారం ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.




