Tollywood Health Alert 2026: షూటింగ్ గాయాలా? ఆరోగ్య సమస్యలా?...వరస సర్జరీలతో అభిమానుల్లో ఆందోళన

2026లో టాలీవుడ్‌ అగ్ర హీరోలు, నటీనటుల వరుస సర్జరీలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, బాలకృష్ణ, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి అగ్రతారలకు సర్జరీలు కావడంతో అభిమానులు ఆందోళన చెందారు.

Balachander
Published on: 14 Aug 2026 11:02 AM IST
Tollywood Health Alert 2026:  షూటింగ్ గాయాలా? ఆరోగ్య సమస్యలా?...వరస సర్జరీలతో అభిమానుల్లో ఆందోళన
X

Tollywood Health Alert 2026: 2026 సంవత్సరం టాలీవుడ్ పరిశ్రమలో ఒకవైపు భారీ సినిమాల హంగామాతో సాగుతుండగా, మరోవైపు అగ్ర కథానాయకుల ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. షూటింగ్స్ సమయంలో జరిగిన ప్రమాదాలు, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం తీసుకున్న కఠిన శిక్షణ, కొన్ని పాత సమస్యల కారణంగా వరుసగా ఆరుగురు అగ్ర నటులు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, బాలకృష్ణ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ఇలా ఒకరి తర్వాత ఒకరు సర్జరీలు చేయించుకోవడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. అయితే ప్రస్తుతం వీరంతా క్రమంగా కోలుకుంటున్నారు.

షూటింగ్‌లో గాయాలు...ఆరోగ్య సమస్యలు

తెలుగు చిత్రసీమలో ప్రముఖులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలు, సర్జరీల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. 2026 ఫిబ్రవరిలో చిరంజీవి కుడి చేతికి స్లింగ్ ధరించి కనిపించడంతో ప్రచారం మొదలైంది. దీనిపై ఆయన స్పందిస్తూ తన భుజానికి చిన్నపాటి కీహోల్ శస్త్రచికిత్స జరిగినట్లు స్పష్టం చేశారు. కొన్ని రోజుల రెస్ట్‌ తరువాత మెగాస్టార్‌ సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ బిజీలో ఉన్నారు చిరంజీవి. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు 2026 ఏప్రిల్‌లో అనారోగ్యం కారణంగా చిన్నపాటి చికిత్స పొందారు. ఆ తర్వాత జూలై 11న ముంబైలోని కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో సుమారు 3.5 గంటల పాటు కుడి భుజానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేయించుకున్నారు. తీవ్రమైన రొటేటర్ కఫ్ సమస్య వల్ల ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం పవన్‌ కోలుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన చురుగ్గా పాలనా పనుల్లో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇక మరో మెగా కాంపౌండ్‌ హీరో వరుణ్‌తేజ్‌, తన తదుపరి చిత్రం ‘భారీ’ కోసం వాలీబాల్ క్రీడాకారుడిగా ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సమయంలో మోకాలికి తీవ్ర గాయమైంది. 2026 ఏప్రిల్లో శస్త్రచికిత్స జరగగా, వైద్యులు ఆయనకు 3 నెలల విశ్రాంతిని సూచించారు. ఇటీవల కొరియన్‌ కనకరాజు సక్సెస్‌ మీట్‌లో చేతికర్ర సహాయంతో ఆయన కనిపించారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్టు మెగాకుటుంబం పేర్కొన్నది.

ఇక ఇదిలా ఉంటే, ‘NBK111’ షూటింగ్ లో బాలకృష్ణ యాక్షన్ సీన్ చేస్తుండగా ఎడమ మోకాలి టెండన్‌కు తీవ్ర గాయమైంది. 2026 జూలైలో హైదరాబాద్ AIG ఆసుపత్రిలో సుమారు 3 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం బాలకృష్ణ ఈ గాయం నుంచి కోలుకునేందుకు రెస్ట్‌ తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దర్శకుడు మలినేని గోపిచంద్‌ యాగం కూడా నిర్వహించినట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇకపోతే, రామ్‌చరణ్‌ పెద్ది షూటింగ్‌ సమయంలో కుడిచేతి మణికట్టుకు గాయమవ్వడంతో 2026 జూలై 27న కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యులు ఎనిమిది వారాల విశ్రాంతిని సూచించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్టుగా మెగా కుటుంబం తెలియజేసింది. ఇక, రీసెంట్‌గా 2026 ఆగస్టు 12న హైదరాబాద్ KIMS ఆసుపత్రిలో ఎన్టీఆర్‌కు భుజానికి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ జరిగింది. ఆగస్టు 13న డిశ్చార్జ్ అయిన ఎన్టీఆర్, పూర్తిగా కోలుకోవడానికి 2 నుండి 3 నెలలు పడుతుందని తెలిపారు. తాను బాగున్నానని, త్వరలోనే కలుస్తానని అభిమానులకు భరోసా ఇచ్చారు.

ఇక ఇదిలా ఉంటే మైసా షూటింగ్‌ సమయంలో రష్మీక మందన డ్యాన్స్‌ చేస్తుండగా ఆమె హిప్‌ టెండన్‌కు గాయంమైంది. వెంటనే ఆమెకు చికిత్స అందించిన వైద్యులు ఆరు వారాల విశ్రాంతిని సూచించారు. ప్రస్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ రికవరీ అవుతున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్‌లో ఈ పరిస్థితికి కారణమేంటి?

సినిమా స్థాయి పెరిగేకొద్దీ రిస్క్ కూడా పెరుగుతోంది. నేటి కమర్షియల్ చిత్రాల్లో భారీ యాక్షన్ స్టంట్స్, రియలిస్టిక్ డ్యాన్స్ మూవ్స్, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అత్యంత కీలకంగా మారాయి. కారకాలేవైనా, తమ ప్రియతమ హీరోలు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ సెట్స్ పైకి రాబోతుండటంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story