Tollywood: టైటిల్ ఏంటి ఇంత పొడవుంది.. టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక రికార్డు.!
Tollywood: చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో ఒక సినిమా ఈ నెల 18న రానుంది.
Tollywood: టైటిల్ ఏంటి ఇంత పొడవుంది.. టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక రికార్డు.!
Tollywood: తెలుగు సినీ ప్రేక్షకులను విభిన్నమైన కథలతో అలరించే దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తాజాగా ఒక ప్రయోగాత్మక చిత్రంతో రాబోతున్నారు. 'ఆ నలుగురు', 'అందరి బంధువయా' లాంటి అద్భుతమైన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో ఒక సినిమాను రూపొందించారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు' అనే సుదీర్ఘమైన పేరు పెట్టారు. కేవలం తెలుగులోనే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఇది అత్యంత పొడవైన టైటిల్ అని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో టాలీవుడ్‌లో 'మీ ఇంటికి వస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు' అనే సినిమా టైటిల్ అత్యంత సుదీర్ఘమైన టైటిల్‌గా ఉండేది. ఇప్పుడు చంద్ర సిద్ధార్థ్ సినిమా ఆ పాత రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రమోషన్ కోసమో, లేక కథ డిమాండ్ చేసిందో కానీ ఒక చిన్న సినిమాకు ఇంత పెద్ద టైటిల్ పెట్టడం ప్రస్తుతం తీవ్ర ఆసక్తి రేపుతోంది.
ఈ సినిమా టైటిల్ వెనుక ఉన్న ఆసక్తికరమైన కథాంశాన్ని దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ వెల్లడించారు. కథ ప్రకారం ప్రతిరోజూ రాత్రి 10:30 గంటలకు ఒక రేడియో స్టేషన్ నుంచి నిరంతరం ఒకే పాట ప్రసారమవుతూ ఉంటుంది. నెమలిపాలెం గ్రామానికి చెందిన రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్ లాంటి కొందరు వ్యక్తులు ఆ పాటను కోరినట్లుగా రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తుంది. అసలు ఆ పాట వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ వ్యక్తులకు, ఆ పాటకు ఉన్న సంబంధం ఏంటి? అన్న మిస్టరీతో ఈ సినిమా నడుస్తుంది. ఈ క్రేజీ ఐడియాకు 'ఎ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్‌బిడెన్ సాగా' అనే ఇంగ్లీష్ సబ్‌టైటిల్‌ను కూడా జోడించారు.
ఇది ఒక హై-కాన్సెప్ట్ సైకలాజికల్ మిస్టరీ మ్యూజికల్ థ్రిల్లర్. సౌండ్ థెరపీ, బ్రెయిన్ మ్యాపింగ్, జ్ఞాపకాలు, న్యూరోసైన్స్ లాంటి ఆధునిక అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దివంగత ప్రముఖ రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. మదన్ చనిపోయే ముందు ప్లాన్ చేసిన చివరి సినిమా ఇదే కావడం విశేషం. అప్పట్లో మదన్ కథతోనే 'ఆ నలుగురు' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను చంద్ర సిద్ధార్థ్ తీశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ప్రాజెక్ట్‌ను సుమారు రూ. 3 కోట్లు నుంచి రూ. 5 కోట్లు బడ్జెట్‌తో సొంత బ్యానర్‌లో చంద్ర సిద్ధార్థ్ స్వయంగా నిర్మించారు.
ఈ చిత్రంతో హర్ష అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నాడు. అమైరా గోస్వామి, ఇనాయా సుల్తానా, రవివర్మ లాంటి నటులు కీలక పాత్రలు పోషించారు. జే రెక్స్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ప్రయోగాత్మక చిత్రం కచ్చితంగా ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది.




